లావణ్య కౌముది
ఏప్రియల్ 7, 2007 at 1:09 అపరాహ్నం | In పోస్ట్ బాక్స్ | 14 Commentsనిండు జాబిలి కి తోడు మరో చందమామా?
శశి వదనా! నీ మోవి పై అవి నవ్వుల నెలవంకలా
అసలే సిరులు.. చుట్టూ ముత్యాల హారాలా?
లేక కురుల వనం లో మరుమల్లె సరాలా
జ్యోతి శిఖల నడుమ కృష్ణ వర్ణాలా?
మెరుపు కళ్ళలో నల్లటి కనుపాపల మైమరపులా
పసిడి పోత కి హరితపు పూతలా?
హేమలతా! నీవు కదిలితే పచ్చని గాజుల మోతలా!
తన్మయి
ఏప్రియల్ 2, 2007 at 8:21 పూర్వాహ్నం | In పోస్ట్ బాక్స్ | 6 Commentsఇరు చూపుల నడుమ కదిలిన భావ లహరిలో
మన సాన్నిహిత్యం సాహిత్యమా?
ఇరు పొద్దుల మధ్య మెదిలిన నడిరేయి రాగం లో సాంద్ర ప్రణయపు సంగీతమా?
మాటలు సాగినా
మౌనం ముసిరినా
కష్టమంతా పెదవులకే
నవ్వుల నదుల్ని ఆపలేకే
మధురోహల్ని దాటి
పులకింతల్ని మీటి
ఇంత హాయీ ఒక్కటై ఎదుటకొస్తుంటే
ఓపటమెలా కనురెప్పలు మూయకుంటే
కాలాన్ని నిద్రపోనివ్వను
మార్చి 12, 2007 at 10:43 పూర్వాహ్నం | In పోస్ట్ బాక్స్ | Leave a Commentపోయిన ఆదివారం పొద్దు పోక పుస్తకాల అర నుండి ఆచార్య యన్ గోపి గారి “కాలాన్ని నిద్రపోనివ్వను” తీశాను. “తంగేడు పూలు” కవితా సంపుటి తో మొదలైన గోపి గారి సాహిత్య ప్రయాణం “చిత్ర దీపాలు” చేత పట్టుకుని “వంతెన” మీదుగా సాగి సాహిత్య అకాడెమీ అవార్డ్ అనే “మైలు రాయి” దాటింది. ఆయన అలోచనల్నే కాదు కాలాన్ని కూడా నిద్ర పోనివ్వనని ప్రతిజ్ఞ చేసి రాసినట్టున్నారు ఈ పుస్తకం.
మనలో చాలా మంది అనుకునేలానే చచ్చిపోతున్న ఉత్తరం గురించి అక్కడ ఇలా ఉంది.
“ఫోన్లలో ఏముంది హృదయ నిశ్శబ్ధం తప్ప
నిన్నూ నన్నూ ఉద్వేగ రేఖపై నిలిపిన ఈ ముత్యాల వంతెనను ఎవరు కూల్చేశారు ప్రియా”
ఆసక్తి రెట్టింపవగా స్థిమితం గా చదవటం మొదలెట్టాను.
జీవితం లో ఎదగాలని అందరికీ ఉంటుంది కానీ “నిచ్చెనలో ఏ మెట్టూ సుఖం గా ఉండదు” అని మరోసారి గుర్తు చేశారు.
ఎన్నాళ్ళో కలిసి ఉంటుంటాం కానీ మనం నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నామా?
“మనుషుల మధ్య ప్రవహించే ఎడారుల గురించే బాధ”
కవిత్వం నిజంగా అంతా విస్తృతమా అనిపించేలా
“పద్యాల్లో పట్టనంత పెద్ద ప్రపంచం ఉంటుందా
జీవితం ఇరుకైనప్పుడు మైదానాల్ని మరింత విశాలం చేసేదే కవిత్వం” అని భరోసా ఇచ్చి,
“నీ అహం నా సహనం పై బరువును మోపుతుంది” అని పాత విషయమే ఐనా సరికొత్త సమీకరణం లో చెప్పారు.
“కన్నీళ్ళు బాల్యం వైపు పరిగెడతాయి
ఎండుటాకులకు కూడా పచ్చని జ్ఞాపకాలుంటాయి”
చిన్ననాటి రోజులు గుర్తొస్తే మనందరికీ ఇలాగే అనిపిస్తుంది కదూ..
మూర్తీభవించిన ఏకాంతాన్ని కదిలించటం ఎలా?
“గాలిని ముక్కలుగా కోసే గడ్డిపోచలు ఘనీభవించిన ఏకాంతాన్ని కరిగిస్తాయి”
వెన్నెల ఏ కవిని మాత్రం ఆకర్షించలేదు?
“చంద్రుడ్ని ఎన్ని సార్లు రుద్దినా అరిగిపోడు వెన్నెల గంధం వస్తూనే ఉంటుంది” అని ఈయన చంద్రుణ్ణి గంధపు చెక్కగా మార్చేశారు.
అత్యద్భుతమైన క్షణాల్లో మాటలు మాత్రం ఒక్కోసారి మెదలకుంటాయి.. భావావేశం ఏదైనా కానీ..
“అపూర్వ సంగమాలు అనివార్య వియోగాలు ఏవీ తిరిగి చేతికందవు
చచ్చుబడి పోయిన మాటల్ని గురించే బాధ”
విషాదాల్లోకెల్లా విషాదం ఆప్తుల మరణం. అది కూడ ఈయన కవితకి అనుభవం.
“తనకి తెలియదు. తన మరణం క్షణమైతే మా మరణం క్షణక్షణమని”.
“వర్షమంటే నాకు మేఘాల తాళపత్రాలపై లిఖిస్తున్న మహా గ్రంధం లా ఉంటుంది”
ఇంకోచోట వర్షం గురించి ఇలా గంభీరం గా అనేసి,
ఇదంతా ఎందుకు రాస్తున్నారంటే “కలతగా ఉంది, కవిత్వం సోకినట్టుంది” అని సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు.
-స్వాతికుమారి (http://swathikumari.wordpress.com)
తొలి ప్రచురణ పొద్దు లో
ఆహార్యం
ఫిబ్రవరి 19, 2007 at 11:11 పూర్వాహ్నం | In పోస్ట్ బాక్స్ | 5 Commentsపద్యమో పదమో
భావమో అభావమో
అనుభూతో అనుభవమో
ఏదైతేనేం..
కవితా రూపం
కొంత అందం
ఇసుమంతైనా అర్ధం
మరింత కాకపోయినా అలంకారం
అంతో ఇంతో చమత్కారం
ఈ మాత్రం చాలవా
వేయాలంటే సుమ హారం.
* శ్రీరామ్ గారి కోరిక మేరకు
వాళ్ళ కోసమే..
ఫిబ్రవరి 15, 2007 at 10:25 పూర్వాహ్నం | In పోస్ట్ బాక్స్ | 19 Commentsనెలల పసిపాపల్ని తల్లిపాలకి దూరం చేసి
తెలిసీ తిలియక ముందే క్రష్ ల పాలు చేసి
మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.
అమ్మ కి నాన్న కి మధ్య ఆదమరచి నిద్రపోవాల్సిన వేళ లో
విసుగుతోనొ అలసటతోనో అర్దరాత్రి ఆఫీస్ లోనో ఉండి
మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.
పాలబువ్వలు పెట్టే తీరిక లేక ప్రోసెస్డ్ తిండి అలవాటు చేసి
దాగుడు మూతలాడలేక ప్లే స్కూల్ కి పంపి
ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించలేక
ట్యూషన్ కని ఉదయపు లేత నిద్రపై నీళ్ళు చల్లి
ఇదంతా చేసి
అమాయకపు బాల్యాన్నంతా దోచేసి
మనం నిజంగా వాళ్ళ కోసమేనా సంపాదిస్తున్నాం?
* Nothing else in this world can be better than a non-working mother అని ఎక్కడో చదివాను. నిజమేనేమో!!
మురళీ రవళి
జనవరి 31, 2007 at 6:44 పూర్వాహ్నం | In పోస్ట్ బాక్స్ | 7 Commentsమధువులొలకవేమిరా మధుసూధనా
మధురాపురి ముదమందగ యదునందనా
యమున యదలో ఎప్పుడో జలపాతమై
కరిగి వీనుల విందులో నవనీతమై
వెదురు గుండెకు గానమూదిన పవనమేమో మోహనం
రాగ సుధాలాపనలో ప్రతి పయనం సమ్మోహనం
సందెల సందిట అందమే బృందావనిగా
నీ అందెల అలికిడికే పులకించిన అవనిగా
ఆ భావమే భూపాలమై లేచె మధురిమలే
నిశి మలుపులో ఆ పిలుపుకై వేచే అరుణిమలే
మధువులొలకవేమిరా మధుసూధనా
- స్వాతి
* “రేపల్లియ యదఝల్లున” స్పూర్తితో కొన్నేళ్ళ కిందట రాసుకున్నది.
దీన్ని ఎవరైనా ట్యూన్ చేస్తే వినాలని ఉంది.
అంతర్వాహిని
జనవరి 29, 2007 at 5:45 పూర్వాహ్నం | In పోస్ట్ బాక్స్ | 12 Commentsకోడి కూత కి వేకువ కి నడుమ కల నుండి మెలకువగా మారిన నీ జ్ఞాపకం
నీహారిక నెమ్మదించేవరకు ఆహ్లాదంగా కదిలి
జడ వేసుకుంటూ, మెట్లు దిగుతూ, రోడ్డు మీద నడుస్తూ ఉండగా హడావిడిగా పరుగిడి
అపరాహ్ణాన ఇత్తడి చెంబు నీట మునగ్గానే వేప చెట్టు పైన వడ్రంగి పిట్ట చప్పుడు ఆగినప్పుడు అలసటగా ఒదిగి
సాయం సమీరాల్లో వాలు కుర్ఛీ లో ప్రతి పేజీ కి పాట కి మధ్య విరామం గా
నడిరేయి కనుల క్షేత్రం లో నిద్ర కి నీటి కి జరిగే యుద్ధం లో మరిన్ని గాయాలు మిగిల్చి…
చీకట్లో తోడు గా ఉండే నీ జ్ఞాపకం.
పునరపి ప్రణయం
జనవరి 16, 2007 at 9:49 పూర్వాహ్నం | In పోస్ట్ బాక్స్ | 17 Commentsఇలా జరుగుతుందని విన్నప్పుడు నేను నమ్మలేదు.
కానీ కొన్ని అనుభూతులు అనుభవైకవేద్యాలే కదా!
అసలింతకీ ఏం జరిగిందంటే మా పెళ్ళయ్యి దాదాపు ఏడాది కావొస్తుండగా అంటే మొదటి పెళ్ళి రోజుకు ముందే అతను నా జీవితం లోకి వచ్చాడు.
రోజు రోజు కీ సాంద్రత పెరిగే భావం.. అది ప్రేమే ఐతే.. అవును తప్పుకోలేని, చూపు తిప్పుకోలేని ప్రేమలో పడిపోయా. అంత అందమైన కళ్ళు, విల్లు లాంటి పెదవులు,ఆకట్టుకొనే నవ్వులు.
అనుబంధానికి కాలం కూడా ఒక కొలమానమైతే రెండు నెలల్లోనే ఇంత దగ్గరితనం ఆశ్చర్యమే!
అవును మరి “ప్రహసిత్” అని నేను పేరు పెట్టిన వాడు నాకు పుట్టి ఇప్పటికి రెండు నెలలే.
* బుజ్జిగాడికి అమ్మనైన ఆనందం లో
జాతిని కాపాడుకుందాం
సెప్టెంబరు 8, 2006 at 4:57 పూర్వాహ్నం | In మాటల తోట | 13 Commentsమీ అందరీ అభిప్రాయలు అమూల్యమైనవే.
ఈ మధ్య కాలం లో ప్రేమ వివాహాల వల్ల, పెళ్ళికి ముందే ఏర్పడే అవగాహన వల్ల, ఇద్దరు సమాన బాధ్యత తీసుకోవటం జరుగుతుంది అమ్మాయి మీదే భారం పడకుండా(నా విషయం లో అలాగే జరిగింది).ఇది చాలా ఆశాజనకమైన పరిణామం.
కానీ పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళలో ఎక్కువ శాతం ఎదో ఒక పేరు తో అమ్మాయి వైపు వారే ఎక్కువ భారాన్ని మోస్తున్నారు.. సాంప్రదాయం వల్ల కావొచ్చు, సమాజం లో పరువు కోసం కావొచ్చు, ఇవ్వక తప్పని పరిస్థితీ కావచ్చు.
భార్యని జీవితాంతం భర్తే పోషించాల్సిన సందర్భం లో దీన్లో కొంత న్యాయం ఉందేమో కానీ, సమానం గా చదివి సమానం గా సంపాదించే వాళ్ళల్లో కుడా ఇలా జరుగుతుండటం పైనే నా బాధ.
కొందరమ్మాయిలు తామే తండ్రి నుంచి రాబట్టాలనో, అందరి ముందు గొప్పగా కనిపించాలనో ప్రయత్నించటం వాస్తవం.
ఆడపిల్ల తండ్రికి ఆస్తి ఉండి, డబ్బు ఖర్చు చెయ్యగలిగే స్థోమత ఉండి ఇదంతా వేడుక గా భావిస్తే అది వేరే విషయం కానీ పెళ్ళివారి కోరికలు తీర్చటానికి అప్పు చెయ్యటం, వాళ్ళ వృద్ధాప్యం కోసం ఏమి మిగలకుండా అమ్మాయికిచ్చెయ్యటం ఇవీ బాధాకరమైన విషయాలు.
ఏదేమైనా మన మిత్రులు చెప్పినట్టు గతం తో పోలిస్తే కొంత మార్పు ఉంది. కానీ అది పూర్తి మార్పు కాదు.
పరిష్కారం ఏమిటని అడిగారు.
1) అబ్బాయిలు ఆత్మాభిమానం తో అమ్మాయి డబ్బు తీసుకోవటం తమని తాము కించపరచుకోవటం అని భావిస్తే చాలా వరకు సమస్య తగ్గుతుంది.
మన సుభాషితాల్లో చెప్పినట్టు
తన స్వంత డబ్బు మీద ఆధారపడేవాడు ఉత్తముడు.
తండ్రి డబ్బు మీద ఆధారపడేవాడు మధ్యముడు
భార్య డబ్బు ని అనుభవించేవాడు అధముడు.
అనే సూక్తి ఇక్కడ స్మరణీయం.
2) అమ్మాయిలు గొప్పల కోసమో, పరువు కోసమో లేదా తర్వాత రాదనే భయం తోనో తండ్రి ని ఇబ్బంది పెట్టకుండా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది.
చివరగా ఒక విన్నపం: ఈ నా గోలంతా ఆడపిల్ల, అమె తల్లిదండ్రులు ఇబ్బంది పడటం గురించి అంతే కాని అమ్మాయికి చట్టపరం గా రావాల్సిన ఆస్తి హక్కు గురించో, అమ్మాయి తండ్రి కి బాగా డబ్బు ఉండి ఇష్టపూర్వకం గానో, లేదా ఒక మధ్య తరగతి భర్త చదువూ, సంపాదన లేని భార్యని పోషించాల్సిన సందర్భం లోనో నా వాదన చాల వరకు సడలుతుంది.
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.






