త్వమేవాహం

ప్రేమంటే..
..రెండు హృదయాలు ఒకేలా స్పందించటం,
..ఇద్దరి అభిప్రాయాలు, భావాలు కలవటం.
ఇలాంటివి అప్పటికి చాలా విని ఉన్నాను.

మన పరిచయమైన మొదటి రోజుల్లో ఒకసారి నిన్ను అడిగాను,
“మీకు అన్నిటికన్నా ఏదంటే బాగా ఇష్టం?” (అసంబద్ధం గా, అస్పష్టం గా
ఉందా?ఐనా చూద్దాం ఏం చెప్తావో అని) అసలు ఇసుమంతైనా అలోచించకుండా చాలా అత్మ విశ్వాసం తో చెప్పావు.”నాకు దానిమ్మ పండంటే చాలా ఇస్టం” ఆపలేనంతగా నవ్వానో, నడుస్తూ నవ్వలేక అలాగే ఆగిపోయానో..మొత్తానికి సభ్యత గా ఉండదేమో అని అపేశాక నాకు ఎదురు ప్రశ్న “మరి మీకు?””అక్షరం ” అని లోపల గొణుక్కున్నానేమో “ఏదైనా చదువుతూ ఉండటం నాకు
బావుంటుంది.” అని వీలైనంత సింపుల్ గా చేప్పినట్టు గుర్తు.

తొండ ముదిరి ఊసరవెల్లి అయాక ఒక రోజు..(చాలా పనికిమాలిన పోలిక, కానీ స్నేహం పెరిగాక అని నా ఉద్దేశం.)మొహం వేళ్ళాడేసుకుని కనిపించావ్. “ఏంటలా ఉన్నావ్ జ్వరమా ? తిరక్కుండా పడుకో” ఒక మొక్కుబడి సలహా పడేసి బాధ్యత తీర్చేసుకున్నా. “కాదు ! నిన్నంతా నిన్ను చూడక పోయేసరికి తిండి నిద్ర సహించలేదు”-

“నా మొహం లా ఉంది, ఫూలిష్, నేనైతే ఏదెలా ఉన్నా వేళకి తిని శుభ్రం గా
పడుకుంటా” గట్టిగానే పైకే చెప్పాను. అలా అనటం వరకైతే సాధ్యమైంది కానీ తెచ్చిపెట్టుకున్న కొద్దిపాటి కరకుతనం ఎర్రబడిన నీ కళ్ళలోనీ ఆరాటాన్ని చూసి కరిగిపోయాక కూడా, నొక్కి పెట్టిన ఉద్వేగాన్ని ఆపటం నా తరం కాలేదు.

‘మనసెప్పుడు లయ తప్పుతుందో తెలిసుంటే ఆ ఒక్క క్షణం నీ పై చూపు నిలవకుండా చేసి ఉందును కదా’అని రాసుకున్నాను ఆ రోజు రాత్రి డైరీ లో. అలాంటి క్షణాలే గంటలుగా మారి ప్రతి సాయంత్రం నీ సమక్షం లో సముద్రపు ఒడ్డున సాగిపోయేవి. ఇసుకలో గవ్వలేరుకుంటూ నేను, నా నవ్వులేరుకుంటూ నువ్వు. ప్రతి రాత్రీ ఇంటి గేట్ దగ్గర వెన్నెలతో పాటు నీకూ వీడ్కోలు చెప్పి మెట్లు ఎక్కబోతుంటే.. దోసిట్లో నువ్విచ్చిన గులాబీల పైన రాలి పడే కన్నీటి చుక్కని ఎన్నో సార్లు ప్రశ్నించి ఉంటాను. ‘ఒక్క రోజు ఎడబాటుకే ఇంత వేదనా?’ అని. ఆరాధన లో, ఆకర్షణ లో, ప్రేమావేశం లో కొన్ని నెలలే తెలియకుండా గడిచిపోయాయి. ఇంకెన్నాళ్ళైనా నీతొ స్నేహం ఇలానే అద్బుతం గా సాగి ఉండేదేమో.

కానీ ఈలోపు మన పెళ్ళయింది.

****
పెళ్ళి తర్వాత మీ ఇంట్లో కొత్తగా అడుగుపెట్టిన రోజు అలసట తో, అంతా సవ్యం గా జరిగిందన్న అనందం తో కొత్త చోటని లేకుండా నిద్ర పట్టేసింది. లేచి చూసేసరికి గది లో ఒంటరిగా నేను. వరండా లో నాకు పరిచయం లేని నీ సొంత మనుషుల మధ్య నవ్వుతూ కబుర్లలో మునిగిపోయి నువ్వు. నీ ప్రపంచం లో నేను కొంత భాగం మత్రమేనని మొదటిసారి అనిపించింది.

నీకు కవిత్వం, సాహిత్యం తో అసలు పరిచయం లేదని, టీవీ లో క్రికెట్ గంటల తరబడి చూడగలవని కలిసి బ్రతకటం మొదలు పెట్టిన కొన్నాళ్ళకే అర్ద్ధమైంది. ఇంత చిన్న విషయాలు కూడా బీచ్ లో పార్క్ లో మనం కలిసి గడిపిన అన్ని సాయంత్రాల్లో నాకు తెలుసుకోవలనిపించకపోవటం ఆశ్చర్యమే. మిన్ను విరిగి మీద పడలేదు కానీ
అభూత కల్పన లాంటి ఊహ కి అతి సహజమైన వాస్తవానికి సమన్వయం కుదర్చాల్సిన అవసరం మొదలైంది.

నన్ను నేను మార్చుకోవాలా? నిన్ను మార్చటం జరిగే పనేనా? మరి ఇలా చెరో దారిలో ఎన్నాళ్ళు నడవగలం? రోజు రోజు కి మనసు నీండా పెరిగిపోతున్న ప్రశ్నలు. అన్నిటికీ సమాధానం మన సహజీవనం లోనే దొరికింది.

*******
కదలకపోతే అది కాలమెలా అవుతుంది?

ఇన్నాళ్ళ సాహచర్యం లో ఎన్ని పేచీ లు ఎన్ని రాజీలు,నా కష్టానికి చెమర్చు నీ నయనాలు, అలసటలో బాసటగా నువ్వందించే చేయూత.నా చిన్న స్వార్ధాలు – నీ పెద్ద త్యాగాలు (ఇష్టం తో చేస్తే కష్టం కాదట.. నువ్వే చెప్తావ్)

“బాబు కి పేరు పెట్టాలి కదా ! నువ్వు మాత్రం అలోచించకు మహానుభావా,చివరికి ఏ రొటీన్ పేరో చెబుతావ్.”
అని నేను ఫిర్యాదు చేసేలోపే”ఇలాంటివి నీకే బాగా తెలుసు. నువ్వేపేరు పెట్టినా బాగుంటుంది .”అని నా పై నీ నమ్మకం లో కవితలకి తెలియని సున్నితత్వం.

అభిరుచులొకటి కాకపోతే ఒకే రుచి ని పంచుకోలేమా?
నా ఒళ్ళో తలతో , క్రికెట్ మాచ్ లో కళ్ళతో టీ వీ కి నువ్వు అంకితమైపోతే..
చేతిలో పుస్తకం తో కవితా లోకం లో నేను మునిగిపోతే,
ప్రతీ బౌండరీ కీ నా చదువుని ఆపి నీ కామెంట్రీ విని..
నా ప్రబంధం లోని ప్రతి పద చమత్కృతి కి నీ తపో భంగం చేసీ నా ఉద్వేగాన్నినీతో పంచుకుని..
ఇటువంటి రమ్య చిత్రాలు మన జంట జీవితాల పై ఎన్నో చిత్రించుకున్నాక..

ఇప్పుడు నాకనిపిస్తుంది,
ప్రేమంటే
“ఒక హృదయ స్పందన ని మరో హృదయం అనుభూతి చెందటం” అని.

****

32 thoughts on “త్వమేవాహం

  1. ఇలాంటి శైలితో రాయాలని చాలావిషయాలు ప్రారంభించాను కానీ ఎందుకో పూర్తి చేయ్యలేకపోయాను. ఇది చదువుతున్నప్పుడు నేనే రాసినంత అనుభూతి చెందాను
    చెమ్మగిల్లిన కళ్ళతో
    అభినందనలు

  2. చాలా బావుంది. నాక్కూడా ఏదో వ్రాయాలనిపిస్తుంది, అంత బాగా వ్రాశారు. ఇంకా ఉంటే బాగుండేది. విషయం కంటే శైలి బాగుంది. ఐదేళ్ళ క్రింద ఇలా రెండు నదులూ కొండ ఆ పక్క నుండి ఈ పక్క నుండి వచ్చి కలుసుకున్నట్టు కలిసినాము. ఆ రోజు నుండి ఇలా ప్రయాణం చేస్తూనే ఉన్నాము.

  3. 🙂 very poetic.
    ఇసుకలో గవ్వలేరుకుంటూ నేను, నా నవ్వులేరుకుంటూ నువ్వు,
    నేను నీప్రపంచంలో ఒకభాగమేనని …
    -లాటి వాక్యాలతో వాస్తవమూ, ఊహలూ కూడా మిళితంచేసి చక్కగా నడిపారు.
    రమ్యమైన చిత్రం. థాంక్స్.
    మాలతి

  4. చాలా బావుంది అంటే ఏంటో అస్సలు సరిగ్గా చెప్పినట్లు లేదు.. ఇంకా చెప్పడానికి నా దగ్గర సరైన పదాలు లేవు.. ఈసారి ఏం రాస్తారా అని ఎంతో కుతూహలంతో ఎదురు చూస్తున్నాను.. నా ఎదురుచూపులకి ఫలితం దక్కింది 🙂 కిరణ్ గారన్నట్లు అప్పుడే అయిపోయిందా అనిపించింది.. ఆఖరి వాక్యం మాత్రం అమోఘం!!

    ఇంకో విషయం, నాకు మీ రచనలు ఎంత నచ్చుతాయో అంతే ఎక్కువగా వాటికి మీరు పెట్టే పేర్లు నచ్చుతాయి 🙂

  5. స్వాతి గారూ ఎలా మిస్ అయిపోయానో మరి దీనిని.అయినా పర్లేదు.ఇప్పటికన్నా చూడగలిగాను.అందరూ అన్నీ చెప్పేసారు.నాదగ్గరున్న కొన్ని మాటలూ సరిపోవట్లేదు.టచ్ చేసారు.అర్ధం చేసుకోరూ?

  6. స్వాతి గారు, చాలా చాలా బాగా వ్రాశారు.. ఇప్పటివరకు మీ బ్లాగ్ బావుంటుంది అని మిగతా బ్లాగుల్లో చూశాను కానీ, ఎప్పుడు ఇటువైపు రాలేదు..కానీ ఇప్పుడు చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది..

    అభిరుచులొకటి కాకపోతే, ఒకే రుచిని పంచుకోలేమా అన్నారు – నిజమే మరి పంచుకునే హృదయం ఉంటే!

  7. “ఏదైనా ‘రచన బాగుంది’ అని ఎప్పుడనిపిస్తుందటే! మనం అనుకున్న విషయాన్ని వేరొకరు మనకన్నా బాగా అక్షరబద్ధం చేసి, సాక్షాత్కరింపజేస్తే!!” అని అంటారు. అది నిజమని మీ ‘కథాకవితని’ చదవగానే అనిపించింది.

    వచనంతో సాధారణంగా మాబోటి రాతగాళ్ళు అభిప్రాయాల్నీ, మహాఐతే ఆలోచనల్నీ తెలుపగలంగానీ, మీలా కవితాత్మకతని జోడించి హృదయాన్ని ఆవిష్కరించడం…కష్టం. ఈ కష్టాన్ని మీరు మరింత ఇష్టంగా చేసి మమ్మల్ని సహృదయులుగా చేయగలరని ప్రార్థన. చిత్తగించగలరు…మన్నించనూ గలరు.

  8. “త్వమేహం” అన్న శీర్షిక ఇంతకు మునుపు చూసినపుడు.. ఇదేదో సంక్లిష్ట సంస్కృత పదబంధ కవితేమొ, చదవడానికి ప్రశాంతత కావాలి అని చదవడాన్ని వాయిదా వేసుకున్నా!

    తీరా ఇప్పుడు చదవడం మొదలెట్టాక, మనసు లేని ప్రశాంతతని తనే తెచ్చుకొంది. “ఇష్టమైంది చేయడం కష్టం కాదన్నట్టు” చదువుతున్నంత సేపూ, పనిగానీ పరిసరాలు గానీ గుర్తుకు రాలేదు.

    “అభిరుచులొకటి కాకపోతే ఒకే రుచి ని పంచుకోలేమా?” అన్నదానిపై నాకు చాలా ప్రశ్నలున్నాయి. అనుమానాలున్నాయి.

    రుచిని పంచుకోవచ్చేమొగానీ, ఆస్వాదించగలమా అని. ఆవతలి హృదయం భాధ పడుతుందేమొ అని జాలిగా రుచి చూడటం వేరు. అవతలి హృదయంతో మమేకమై రుచిని ఆస్వాదించడం వేరేమొ!

    ఏదేమైనా ఒకరి హృదయాన్ని, భావాల్ని, రుచుల్ని ఇంకొకరు ఆస్వాదించకపోయినా గౌరవిస్తే అదే పదివేలు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  9. నేనిన్నాళ్ళూ మీ బ్లాగును ఎలా మిస్ అయ్యానో అర్ధం కావట్లా… ఈ పోస్ట్ చాలా బాగుంది అన్న మాట నా ఆనందాన్ని పూర్తిగా వ్యక్తపరచడానికి సరిపోదు. ముఖ్యంగా ఆ శైలి… ఇసుకలో గవ్వలేరుకుంటూ నేను, నా నవ్వులేరుకుంటూ నువ్వు……… వాహ్ అద్భుతం!!!!

  10. త్వమేవాహం చదివాక మీ మీద అభిమానం మరీ పెరిగింది
    భావాలకి అక్షర రూపం కలిపించడం చాలా అద్బుతమైన కల
    మీ మనసులోని భావాలని అక్షరమాలికలుగా మార్చి
    మాకు అందించినందుకు కృతజ్ఞతలు

    విమల ఆంటీ ద్వారా నేను మీ గురించి తెలుసుకున్నాను

  11. స్వాతిగారూ, చిన్న రిక్వెస్ట్… ఈ కవితలో కొన్ని లైన్లేరుకుని ఎవరైనా అమ్మాయికి ప్రేమలేఖ రాసుకోమంటారా?? ఆ అమ్మాయి ఒప్పేసుకున్న తర్వాత కాపీరైట్ మీదే అని చెప్పేస్తాలెండి 🙂

  12. swati garu late ga chadavadam to latest gacomment rastunna.na observation yentante magadu pellayyedaka tana preyasi ki purti samayam keta istadu abadrata bhavam to once pelli ayipoyaka inka a insecure feeling poi vastavam gurtu kostundy so amma nanna tv chelli cricket vagaira pramukyanni tirigi santarinchu kuntayi.ade jabilli ade cheli mari ledem premagali?ade pelli inkonchem alasyam chesi vunte world cup lo india final match kuda vadilesi mito aa isaka dibbalamida tirigevaru.magadiki prati dasalo pramukyalu mari potayi where as strr ki avi constant.

  13. ఇన్నాళ్ళ సాహచర్యంలో ఎన్ని పేచీలు ఎన్ని రాజీలు, నా కష్టానికి చెమర్చు నీ నయనాలు, అలసటలో బాసటగా నువ్వందించే చేయూత. నా చిన్న స్వార్ధాలు – నీ పెద్ద త్యాగాలు…

    ఇష్టం తో చేస్తే కష్టం కాదట.. నువ్వే చెప్తావ్… వాహ్..! ఎంత అద్భుతంగా రాశారండి.. నిజంగా నాకు చాలా చెప్పాలని, పంచుకోవాలని ఉంది. కానీ మాటలు రావడం లేదు, చేతులు కదలడం లేదు… ఏదో తెలీని ఓ ఉద్వేగంలో కొట్టుకుపోతున్నా..

    ఇంతకాలం మీ బ్లాగును, రచనలను చూడలేకపోయినందుకు చింతిస్తూ…!

  14. nenu andhrajyothilo mee website gurunchi chadivi telusukunnanu.i really tanx to andhrajyothi, otherwise i will miss lot of thundering expressions. kalhara garu nenu premapipasini so i like ur literatures very much.naku aa experiance lekapoina mee writings chaduvutoo nannu image chesukuni over feel ayipotanu.mee site close cheyaagane malli
    love failure gurthochi feel avuthanu do u know i`m sincere lover. i miss her so much.bye………kalhara garu………very nice writings…………

  15. ప్రియమైన అక్క కి,

    ప్రత్యుత్తరమిమ్ము అని ఉంది ఇక్కడ. అందుకే మరిచిపొయిన లేఖిని ని మళ్ళీ వెతికి రాస్తున్నా, నా కోసం. కథలో కవిత, భావుకత సెలయేరు లా అందంగా ఉంది. గోదారిలా మనసుని పరవళ్ళు తొక్కిస్తోంది. సగం కథ చదివి, యండమూరి రాసిన “ఉల్లిపొర” కథకి సూక్ష్మ రూపమేమో అని తొందరపడి స్ర్కోల్ చేయబోయి కూడా ఆగి చదవటం మంచిదయింది. ఇది దానికంటే చక్కగా ఉంది. ఎంతయినా, ఒక స్త్రీ వైవాహిక అనుభూతిని గురించి, అమ్మాయి అర్ధం చేసుకుని చెప్పినట్టు, మగవాళ్ళు చెప్పలేరు అని ఈ కథ చదివిన వెంటనే నాకు అనిపించింది. మరి నువ్వేమంటావు?

    చిన్న కథ అయినా హృదయానికి హత్తుకునేలా చక్కగా రాసావమ్మయీ.. నా కోసం నీకు నూరేళ్ళు. చక్కగా ఇలంటివి రాస్తూ ఉండు, ఇకనించి తప్పకుండ నేను చదువుతూ ఉంటాను.

    – ప్రేమ తో,
    సింధు.

Leave a reply to జాన్ హైడ్ కనుమూరి స్పందనను రద్దుచేయి