ప్రేరణ

రాత్రంతా తోట నిండా రాలి పడిన పసుపు గన్నేరు పూలు.
ఓంటరి నా గదిలో కాన్వాస్ పై రంగుల కలలే తెల్లవార్లూ..

అన్నట్టు మర్చిపోయాను ఇవ్వాళ నిన్ను కలవబోతున్నాను కదా! అంటే నిజం గా మర్చిపోయానని కాదు, అంతా మాములుగా ఉన్నప్పుడు ఒక ఇష్టమైన విషయం గుర్తుకు రావటం లో ఉండే ఆనందం కోసం మళ్ళీ మర్చిపోవటం. పుప్పొడి పూతల్లో అణిగి ఉన్న ఆరాటాన్ని గాలి బంధిస్తే అదొక మకరందపు విస్ఫోటనమైనట్టు.. ఇన్నాళ్లూ అణచిపెట్టిన ఉద్వేగమంతా నిన్ను చూడగానే ఎక్కడ నా మాటకి ఎదురుతిరుగుతుందోనని భయం. మనం కలిసి ఇన్నాళ్ళయిందా? ఆశ్చర్యం! ప్రతి నిముషం పలకరించుకుంటున్నట్టే ఉంటుంది. మరి అదేమిటో ప్రతి రోజూ కనపడినప్పుడు మాత్రం యుగాల నిరీక్షణ లా ఉండేది.

‘నన్నెపుడైనా గుర్తు చేసుకుంటావా’ అని నువ్వడిగితే;

వసంతాల్నీ సమీరాల్ని వదిలేసి ,
ఉషోదయాలు, అపరాహ్నాలూ,అసురసంధ్య లు
నా ఉనికినే మరిచిపోయేంతగా లీనమయ్యి చిత్రవర్ణాల్లో అంతర్లోకాల్నిని సృజించుకుంటూ,
ఏ అర్ధరాత్రో ఆకలి తెలిసి,
ఒకదాన్లో ఒకటి ఐక్యమైపోయిన అరచేతుల జంట ఆసరా గా తల వెనక్కి వాల్చినప్పుడు,
మూసిన కనురెప్పల వెనక ఎగసిపడే మొట్ట మొదటి జ్ఞాపకం నీదేనని..
చెప్పనా?
వద్దు, ఇప్పుడు కరిగిపోతే ఎన్నో సార్లు ఘనీభవించటానికి సిద్ధపడాలి.
గుర్తు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రతి క్షణం హోరెత్తుతున్న నీ జ్ఞాపకాల కోలాహలాన్ని తప్పించుకోలేని అశక్తుణ్ణి..

‘నేనెప్పుడైనా గుర్తొస్తానా’ అని నువ్వడిగితే..
‘ఊహూ’ తల అడ్డం గా ఊపాను. అన్ని అబద్ధాలూ అందంగా ఉండవు మరి. కోపం తో అరుణిమైన నీ వెచ్చని చూపుకీ ఈ సాయంత్రపు నీలిమ కీ మధ్య ఉభయసంధ్యల వారధిలా నిల్చుని నేను.

మెదడు లోంచి లావా పొంగి హృదయాన్ని దహించివేస్తున్న దృశ్యాన్ని తర్వాతెప్పుడో ఒకరోజు కాన్వాస్ పై చిత్రిస్తే..
ఈ ఆలోచన నీకెలా వచ్చింది అని ఎవరైనా అడిగినప్పుడు, ఇదంతా తవ్వి తలపులకెత్తుకోవటం ఇష్టం లేక ప్లాస్టిక్ పూలమీంచి వచ్చే పెర్ఫ్యూమ్ పరిమళం లాంటి ఒక నవ్వు బదులిస్తాను.

24 thoughts on “ప్రేరణ

  1. కల్ హర ప్రియ గారు మీ ప్రేరణ….ఆసాంతం అద్భుత భావన,…ప్లాస్తిక్ పూల మీదనుంచి వచ్చే పెర్ఫ్యూం పరిమళం లాటి నవ్వు నవ్వేస్తాను.ప్రయోగం అభినందనీయం. వ్రాస్తూనే వుండండి. …. Nutakki Raghavendra Rao

  2. మీలాంటి వాళ్ళతో నాకెప్పుడూ ఇదే ఇబ్బంది. చాలా సంవత్సరాల నుంచీ దాక్కొని, ఉన్నంతలో హాపీగానే ఉంటున్నాను. కానీ ఈ రాతలున్నాయి చూసారూ..దాక్కొని ఉన్న నన్ను బలవంతంగా బయటకు లాక్కొస్తాయి. వెంటనే నాతో దాగున్న హాపీనెస్ ఎగిరి పోతుంది. గుండె సన్నగా మూలుగుతుంది. దాంతో దిగులు మొదలయ్యి నన్నాక్రమించేసుకుంటుంది.

    అందుకే ఐ హేట్ యు. Go back to the place where you were hiding all these days. Will you please?

  3. Welcome back swathi gaaru. Loved this poem (or whatever). Particularly this line:

    “వద్దు, ఇప్పుడు కరిగిపోతే ఎన్నో సార్లు ఘనీభవించటానికి సిద్ధపడాలి.”

    “అశక్తుణ్ణి”? అంటే ఇది మగ స్వగతమా! ఎందుకు ఇలా మమ్మల్ని మిమిక్ చేస్తున్నారు? అదీ ఇంత ఎక్యురేట్‌గా ఎలా?

    Keep posting anyway.

  4. “అంతా మాములుగా ఉన్నప్పుడు ఒక ఇష్టమైన విషయం గుర్తుకు రావటం లో ఉండే ఆనందం కోసం మళ్ళీ మర్చిపోవటం.”
    ఈ వాక్యం అద్భుతంగా ఉంది. మిగతాదంట్లో సువాసనలపాళ్ళు ఎక్కువైనాయి.

    BTW, welcome back!

  5. స్వాతి

    మీ ప్రేరణ చాలా బాగుంది.

    ” ప్రతి క్షణం హోరెత్తుతున్న నీ జ్ఞాపకాల కోలాహలాన్ని తప్పించుకోలేని అశక్తుణ్ణి..”

    ఈ వాక్యం చాలా చాలా నచ్చింద.

  6. నిజం చెప్పాలి అంటే నమ్ముతారో లేరో గాని ఈ ప్రయోగం బాగుందే అని చాలా వాక్యాలు కాపీ చేసి ఉంచా.. అభినందించడానికి .. కాని చివరికి వచ్చేసరికి ఒకటి కాదు చాలా మిగిలాయి నా చిట్టాలో ! చాలా బాగా వర్ణించారు మీరు !
    మచ్చుకకు ఈ రెండు .. నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం మీ వర్ణనాజ్ఞానం అమోఘం ..
    “వసంతాల్నీ సమీరాల్ని వదిలేసి ,
    ఉషోదయాలు, అపరాహ్నాలూ,అసురసంధ్య లు
    నా ఉనికినే మరిచిపోయేంతగా లీనమయ్యి చిత్రవర్ణాల్లో అంతర్లోకాల్నిని సృజించుకుంటూ,
    ఏ అర్ధరాత్రో ఆకలి తెలిసి,
    ఒకదాన్లో ఒకటి ఐక్యమైపోయిన అరచేతుల జంట ఆసరా గా తల వెనక్కి వాల్చినప్పుడు,
    మూసిన కనురెప్పల వెనక ఎగసిపడే మొట్ట మొదటి జ్ఞాపకం నీదేనని..
    చెప్పనా?”
    — ఈ వర్ణన అద్భుతం ..
    ఇక “ప్లాస్టిక్ పూలమీంచి వచ్చే పెర్ఫ్యూమ్ పరిమళం” ఈ పోలిక అయితే చెప్పనే అవసరం లేదు.. మీ కామెంట్స్ చదవకూడదు అని అనుకున్నా.. అందరూ అభినందించే ఉంటారేమోగా అని .. please keep going like this ..

Leave a reply to ప్రవీణ్ గార్లపాటి స్పందనను రద్దుచేయి