శ్రీ కృష్ణ శ్రీ తిలక్ శాస్త్రి!!

“వేళ కాని వేళ లలో, … దారి కాని దారులలో, ….” వెళ్లకూడదని తెలిసీ ఆ దారంట బయల్దేరాను. అనుకున్నట్టుగానే ఆ ఇంటిముందుకి రాగానే
“ఆగక్కడ ఆగక్కడ అగాగు అక్కడనే” అనెవరో పిలవటం వినిపించింది. ఇంకెవరు, భయపడినట్టుగానే సౌమ్య. అసలు బ్రతకనేర్చిన వారెవరైనా సౌమ్య కి కనపడతారా? కనపడెను పో దారి మార్చి పారిపోక అక్కడే ఉంటారా? ఎందుకంటారేమిటి మనిషి కనపడగానే “రివ్యూ రాశారా?” అంటుంది. అసలు ఏదేనా రాయలంటే ముందు మరేదైనా చదవాలి కదా! ఆ తర్వాత బద్ధకాన్ని నిద్రపుచ్చి అలవాటు లేని పనైనా ఆలోచించాలి కదా, ఎంతకష్టమెంత కష్టం.నా తలమునకల్లో నేనుండగానే కనిపెట్టేసినట్టుగా “రావోయి లోనికి సందేహం దేనికి?” అని మళ్లీ పిలుపు. ఇక తప్పక ’ఏం చేస్తున్నవమ్మా?’ అని అడుగుతూ లోపలికి అడుగుపెట్టాను. అమె సీరియస్ గా తలపైకెత్తి “రాస్తున్నానొక గీతి, చేస్తున్ననొక హేతి.. నా మనః కార్మిక శాల.. కక్కేది భావాగ్ని పొగలు” అని వెంటనే తలదించుకు రాసుకుంటుంది. ఐనా గీతం రాయడం దేముంది ’నవల్లు నవల్లు రాసేస్తున్నారు. వర్ణణీయ వస్తువే తిరగబడి వర్ణిస్తుంటే..”

నా తలపోతల్ని చెదరగొదుతూ “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు” అని ఒక చూపు చూసింది నాకేసి. “ఆ.. ఇప్పటిదాకా ఎక్కడుంటాయి వర్షాకాలం కూడా వచ్చేస్తేను” అని తప్పించుకోజూశాను. ఐనా వదలదు కదా ” పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవీ?” అని తగులుకుంది. “ఇంకా రెక్కలూ, గుర్తులూ ఎక్కడమ్మాయ్, వరదలోచ్చి ఊళ్ళే మాయమౌతుంటేనూ” నా టీవీ వార్తా జ్ఞానం బానే అక్కరకొచ్చింది.

ఇక నేరుగా విషయం లోకి దిగి “పుస్తకం సంగతి గుర్తు లేదా?” అని నిలదీసింది. “ఏమీ లేదు చిన్నమ్మా! చేతిలో కంప్యుటర్ లేదు, చేతి నిండా సమయం లేదు. నువ్వడిగేదేమో పెద్ద పని” భలే సాకు కనిపెట్టేశా. వ్యంగ్యం గా నవ్వి “నిజం గా నేను చూశాను నేస్తం! నీ శ్రుతి మించిన చాటింగ్ ని, జీ మెయిలింగ్ నీ, ఆర్కుటింగ్ నీ.. ప్రతి పోస్టు చివరా బ్లాగుల్లో కామెంటింగు ని” హతవిధీ! గుట్టు రట్టయింది. “ఆకలీ, దాహమూ, చింతలూ వంతలూ” ఇన్నిటిమధ్య నా వల్ల కాదు అని చెప్పి జారుకోబోయి వెనక్కి తిరిగి ఒక్కసారి చూద్దును కదా ఆమె కళ్ళల్లో “విచ్చిన రెండు కల్హార సరస్సులు” ఉండబట్టలేక ’ఏడవకండేడవకండ’ని ఓదార్చబోయాను. “ఏనసహాయురాల నేనభాగ్యురాల” అని తను వాపోతుంటే ’కర్కశ శిలయు నవజీవ కళల దేరి’ నట్టు, నిజం చెప్పొద్దూ మొన్న పండక్కి నే చేసిన మైసూర్పాక్ కన్నా కఠినమైన నా మనసు కూడా ’కవిత్వం పేరెత్తితే చాలు కరిగిపోతుంది మనసు’ అని నీరవటం మొదలెట్టింది.

“కనీసం దీపావళి పండక్కైనా నాకోసం ఒక వ్యాసం రాద్దురూ” అని మళ్ళీ సౌమ్య నా బలహీనత మీద ఆడుకోబోయింది. “నాకు దీపావళులు లేవు, నాకు చిచ్చుబుడ్డులు లేవు” అని చెప్పేద్దును కానీ ఈసారి మంచి మాటల్తో చెప్పి చూద్దామని… “అది కాదమ్మాయ్ కవిత్వమంటే గొప్పగా రాయాలి, గొప్ప విషయాలపై రాయాలి నావల్లవుతుందా?”
“అదేం కాదు! తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం..” అని ఉత్సాహం గా నన్ను ఏమార్చబోయింది.
నాకు తిక్క రేగి
“చదల చుక్క,
నెమలి రెక్క ,
అరటి మొక్క,
ఆమె నొసటి కస్తూరి చుక్క”
అనొక తిరుగులేని సమాధానమిచ్చి వెర్రిగా నవ్వాను.

ఇక కోలుకోలేని దెబ్బకొట్టానని ’ చిత్తమానందమయ మరీచికల సోల, హృదయమానందభంగ మాలికల దేల’ దర్జా గా దాటుకు వెళ్ళబోయా. ఐనా ఆమేమైనా తక్కువ తిందా? పుస్తకం పుస్తకం అంటూ జనాల దగ్గర తిన్న రివ్యూలన్నీ వంటపట్టించుకుని “ఏల రాయరు మీరు సమీక్ష ఒక్కటి? ఏల బాధింతురీరీతి నన్ను? నా హృదయమేల క్షోభించునిటుల” అంటూ గుమ్మానికడ్డు నిలుచుంది.

ఇక లాభం లేదు నన్ను ’చలువరాతి మేడల చరసాలలందు’ బంధించగలదీ అమ్మాయి అని నిర్మొహమాటమైన మొహమాటం తో ఉండగానే “మీరవుననలేదో.. ఈ కార్తీక పూర్ణిమ జ్యోత్స్న సైతం భయపెట్టు మిమ్ములను” అని బెదిరింపులు. అమ్మో ఈ పూర్ణిమ ఒకటే తక్కువైందిప్పుడు. ఆవిడ కూడా జాయినయ్యేలోపు నా పైత్యాన్ని రాసి వీళ్లమీద వదిలేస్తే తిక్క కుదురుతుంది కదా అని
“అలాగలాగే! అలాగే సౌమ్యా! పూర్ణిమా అలాగే!
నేను సైతం పుస్తకానికి వ్యాసమొక్కటి రాసి ఇస్తాను.”
అని వాగ్దానమిచ్చి బయటపడ్డాను. ఇప్పుడిలా మీ మీద రుద్దాను.

ప్రకటనలు
This entry was posted in మాటల తోట. Bookmark the permalink.

10 Responses to శ్రీ కృష్ణ శ్రీ తిలక్ శాస్త్రి!!

 1. chavakiran అంటున్నారు:

  అదృష్టవంతులు మీరు,
  మీ లోగిలి పుస్తకాల కొలువు
  మీ సమయం అనంతం
  —————-
  అభినందనలు

 2. కొత్తపాళీ అంటున్నారు:

  beautiful.

  and welcome back to civilization 🙂

 3. Mohana అంటున్నారు:

  చాణ్ణాళ్ళుగా ఎదురుచూస్తున్నా మీ టపా కోసం. భలేగా రాసారు. 🙂

 4. Nutakki Raghavendra Rao అంటున్నారు:

  స్వాగతం కల్హారప్రియ గారు.
  మీకు, మీ కుటుంబ సభ్యులకూ.దీపావళి శుభాకాంక్షలు
  బ్లాగ్లోకపు సాహితీ వనంలో మీ పునరాగమనం ఆనంద దాయకం. …..
  నూతక్కి రాఘవేంద్ర రావు.

 5. gireesh k అంటున్నారు:

  haha…welcome back!

  రండి, రండి, రండి…దయచేయండి!
  తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!

 6. independent అంటున్నారు:

  ఇంతందంగా ఎలా రాస్తావు కల్హార?
  పుస్తకం లో ఉన్న సమీక్ష కంటే, ఇక్కడ పోస్టు చాలా సార్లు చదివా.

 7. vasi అంటున్నారు:

  అర్ధరేత్రి ఈ వ్యాసం చదివి, కునుకుకని పడకెక్కితే… నిద్దట్లోకి నిర్దాక్షిణ్యంగా శ్రీపాద సుభ్రమణ్య మరియు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మలు కలిసి వచ్చేసి, నెత్తిబొప్పికట్టేలా మొట్టుతూనే ఉన్నారు…… ఎందుకు చెప్మా..

 8. pasunuru sreedhar babu అంటున్నారు:

  అమృతం కురిసిన రాత్రిలో వాసంతికా గీత సురభిలమ్ములతో మందార కుంద సుమదళములు పరిచిన దారిలో యువకాశల నవపేశల సుమ గీతావరణంలో విహరించడమంటే.. ఇదేనా!!
  – పసునూరు శ్రీధర్ బాబు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s