అసంబద్ధం

చుట్టూరా దట్టం గా పొగమంచు, కిందంతా దళసరిగా మంచు. ఆ పొగలోంచి, మంచు మీంచి వెళుతున్నాను. అంటే నడుస్తున్నానని కాదు, వాహనమ్మీదా లేను. మరి తేలుతున్నానా, మత్తులో పేలుతున్నానా? ఎలానో ప్రయాణిస్తున్నాను. మనుసంభవం చదువుతూ పడుకున్నానేమో ప్రవరుడి లేపనం కాళ్ళకంటుకున్నట్టుంది. అంటే పడుకున్నాక నిద్రలోనో కల్లోనో నడుస్తూ .. సారీ తేలుతూ ఎక్కడికెళ్తున్నాను, ఐనా అర్ధరాత్రి ఈ పొగమంచేమిటీ ? ఇందాకట్నుంచీ ఈ పక్కనే ఏమీ మాట్లాడకుండా నడుస్తున్నదెవరో, ఉన్నట్టుండి ఆగిపోయి నది ఒడ్డున కూచున్నాడు. ఆ నది అప్పటిదాకా ఎక్కడుందో అతను కూచున్నాక చూస్తే కాళ్ల దగ్గర కదుల్తూ నీళ్ళు, ఎంత పొడవుందో కనపడటం లేదు. అతను కూర్చునే సరికే నేను అప్పటికే అక్కడ చాలా సేపట్నుండి ఉన్నాను. మరి ఇందాకట్నుంచీ అతన్తో నడిచేది ఎవరు? నా గురించి అతనేదో మనసులో గొణుక్కుంటున్నాడు. మనసులో అని ఎందుకన్నానంటే పెదవులు కదలకుండానే అతననుకునేది నాకు వినిపిస్తుంది. వినపడ్డమంటే చెవులకి కాదు, అతను అనుకుంటున్నట్టు అనిపిస్తుంది.

మెలకువలో ఉన్నప్పుడు ఒక్కోసారి ’ఇది కలా!?’ అనుకుంటాం కానీ ఆ అనుకోవడం లో అతిశయమే తప్ప నిజయితీ ఉండదు. కానీ కలలో ’ఇది నిజమా’ అని సందేహం వస్తే మాత్రం తేలేదాకా రకరకాలుగా ప్రయత్నల్చేస్తాం. నా పక్క వ్యక్తి ఏదో బాధలో ఉన్నాడు. కదలకుండా ఎదురుగా ఉన్న కొండ వైపే చూస్తూ ఉన్నా అతని లోపల్నుంచి వెక్కిళ్ళు వినపడుతున్నాయి (ఇందాక చెప్పినట్టుగానే వినిపించడమంటే అనిపించడం. ఐనా ఈ లోగా నది కొండలా ఎలా మారిపోయిందో.) నాకు ఓదార్చాలనిపించింది, ఇంతకీ ఎందుకేడుస్తున్నాడో. ఒకసారి భుజం చరిచి ధైర్యం చెప్పబోతే నేనూ బిగుసుకుపోయా, అంటే ఇందాకట్నుంచీ అలా కదల్లేని స్థితిలోనే ఉండి ఉంటాను, కానీ కదలాలనుకోకపోవడం వల్ల తెలీలేదు. కనీసం కళ్ళు తిప్పి అతన్ని చూద్దామన్నా వీలు కావట్లేదు. ఇంతకీ అతన్ని నేను ముట్టుకుని ఓదారిస్తే ఫర్లేదా,ఏమైనా తప్పా? అసలు నేను ఆడా, మగా? ఏమో మెలకువొస్తే గానీ గుర్తురాదు. ఆ పక్కనున్న వ్యక్తి మగవాడనుకున్నాను ఇందాకట్నుంచీ సరిగా చూడ్డానికి వీలు చిక్కక. అదీ ఖచ్చితం గా చెప్పలేను నిద్రలేచేదాకా, కానీ లేచాకా ఆ వ్యక్తి ఉండొద్దూ కనిపెట్టడానికి.. అతను ప్రస్తుతం నిద్ర లో ఉండి నా కల్లోకొచ్చాడు కాబోలు, బహుశా ముందు మెలకువొచ్చేస్తే ఉన్న ఫళాన మారిపోతాడో, మాయమౌతాడో ఈ పరిసరాల్లాగా.

ఐనా ఇప్పుడు కదల్లేకపోతేనేం, అతని బాధ నాకర్ధమైనట్టు నా ఓదార్పూ అతనికి అర్ధమై ఉంటుంది. ’అతను’ అన్నానేమిటీ అనుమానమింకా తీరకుండానే. ఏదో ఒకటనాలిగా కాసేపు సాటి స్వప్న శకలమై ఈ ఒంటరి నిద్రా జగం లో నాకు తోడున్నందుకు. అమ్మో! ఈ వ్యక్తి లేకపోతే ఇంత సుదీర్ఘమైన రాత్రి దాటటానికి కలలు తప్ప వేరే దారి లేని నిశని ఎలా గడపాల్సొచ్చేదో. అనుకోగానే చెప్పలేని అభిమానం ఉప్పొంగింది. ’మంచో చెడో! మనం కలిసి ఉన్నాం. ఖాళీ గా, శూన్యం గా ఉండేకన్నా వెక్కిళ్ళు పెట్టి ఏడవటం కొంచం నయమే అనుకో. కానీ, ఏదో కులాసాగా కాసేపు మాట్లాడ్డానికి సాటి మనిషున్నప్పుడు కూడా ఎందుకు? ఈ కన్నీళ్లని ఏకాంతం కోసం దాచుకోరాదూ.. ఐనా ఇది కలేగా, ఈ కష్టం నీకు నిద్ర లేచాక (గుర్తు)ఉండదులే.” అని లోపల్నుంచే అనునయించబోయా. అతని మొహం లో భావాలు చదవడానికి మేము ఎదురు బొదురూ కూర్చోలేదాయె, తిరిగి చూద్దామంటే ఇందాకట్లానే కదల్లేకపోయాను.  కానీ పక్క వ్యక్తి కదిలి వెళ్ళిపోతున్న అలికిడి (అంటే నిజం గా శబ్ధమవ్వలేదు. ఐనా తెలుస్తుందిగా కదలిక).”నీకేం. కాసేపుంటే లేచి మెలకువలో పడిపోతావ్. నా జీవితమే ఈ కలైనప్పుడు, నా కష్టాలు, సుఖాలూ అన్నీ ఇక్కడే తీరాలి.” అనుకుంటూ గొణుగుడు దూరమైపోయింది.

వెళ్తూ వెళ్తూ అతననుకున్న మాటలే మననం చేసుకుంటున్నాను. ఈ చలి కి శరీరం తో పాటు ఆలోచనలూ గడ్డకట్టేట్టున్నాయి. త్వరగా మెలకువచ్చేస్తే బావుణ్ణు. ఎవరైనా లేపకూడదూ, ఫ్రాయిడూ..??

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

6 Responses to అసంబద్ధం

 1. kalpana అంటున్నారు:

  కల్హార గారు,
  చాలా రోజులకు మీ పోస్ట్ చూస్తున్నాను. బావుంది. అయితే ఫ్రాయిడ్ వచ్చి నిద్రలేపాలన్న మాట. బావుంది.

  కల్పనరెంటాల

 2. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

  బాగుంది. చక్కని ప్రయోగం.

 3. Nutakki Raghavendra Rao అంటున్నారు:

  చేతనాచేతన స్థితి లో యోచనాయోచనలు….కలా కాదు ,వాస్తవమూ కాదు.నైస్ ప్రెసెంటేషన్. అభినందనలతో……నూతక్కి

 4. Ramana అంటున్నారు:

  బాగుంది

 5. Independent అంటున్నారు:

  నీకేం. కాసేపుంటే లేచి మెలకువలో పడిపోతావ్. నా జీవితమే ఈ కలైనప్పుడు, నా కష్టాలు, సుఖాలూ అన్నీ ఇక్కడే తీరాలి.”

  అలా నా జీవితం కూడా కలైతే ఎంత బాగుండు? కలలోంచి మెలకువ లోకెళ్తాను కదా ఎప్పుడో ఒకప్పుడు అన్న ఆశ ఉండేది?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s