మానస వీణ – మధుగీతం

నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడుతున్నప్పుడు ఆ సంగమ సరిగమ స్వర పారిజాతాలతో తేటలూరు తెలుగుకు పుష్యమి పువ్వుల పూజ చేసిన పాటలూరివాడు మన వేటూరి. తన కవనాలలోని తొలిప్రాస తియ్యదనం తెలిసిన వాడు కనకనే సినీ యవనికపై మధుసంతకాలతో మృదుపాణి అయ్యాడు. ఆ కలం పిలిచినా, పలికినా రాగమే, అక్షరాలు పదబంధాలై చేరువైనా, చిలిపి విరుపుల మెరుపులై దూరమైనా ఆనందమే. సత్యసాధనకు, సత్వశోధనకు ప్రాణమైన సంగీత సరస్వతికి ప్రధమంగా గాన సరసీరుహ మాలికలర్పించి శృతి నీవు గతి నీవు అని నమస్కరించి, చంద్రకళాధర సహృదయుడినీ నాదశరీరాభరుడినీ స్మరించుకుని, మరి శ్రీరాముని సంగతేమిటంటే ’ఎరిగిన వారికి యదలో ఉన్నాడు, ఎరగని వారికి ఎదుటనే ఉన్నాడు’ అని వేదాంత ధోరణిలో దిగుతాడీ సుందర రాముడు.

పాపి కొండల నలుపు కడగలేక నవ్వుకున్న గోదావరి ఉరకలై ఆయన ఒడిలోనికి ఉరికితే ఏమీ ఎరగనట్టు కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అని బుకాయించాడు. సుడులు తిరుగు శుభగాత్రి తన కవితా గంగోత్రిని జీవనవాహినిగా చేసుకుని శరదృతు కావేరి వంటి ప్రవాహ ఉధృతినీ చూపించారు. ఇన్ని సాహితీ నదుల్లో మనని ఓలలాడించి, ప్రణవ/ప్రణయ సాగర సంగమాలు మాత్రం భారత భారతి పదసన్నిధిలోనే జరగాలని పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు.

భూలోకుల కన్నుసోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తానని మాటిచ్చి శబ్ధానువాద వెన్నెలని రప్పించి, ఆనక వచ్చాక నల్లని కురుల నట్టడువుల్లో ఆయన మాయమైపోతే.. నీశాంత మహీచ శకుంత మరందం వినపడేదాకా ఎదురుచూడక తప్పలేదు. కలిసే ప్రతి సంధ్యలో ప్రతి గొంతులో అల్లాడే గుండే పిలుపుల్ని, నిదురించు వేళ హృదయాంచలాన అలలై పొంగే భావ భంగిమల్ని అభినయ వేదంగా, ఆంగికమౌ తపముగా ఆచరించాడు.

ముకుళించే పెదవుల్లో మురిపాల్ని చక్కిలిగింతల రాగంలో శృతిచేసి, ఋతువుల్లో మధువంతా శ్రోతలకి సగపాలు పంచారు. ఆయన కలమొచ్చి కురిసేదాకా ఎవరూ అనుకోలేదు భావుకత్వమొక శ్రావణ మేఘమని, ఆ వానలో తడవడమొక తీరని దాహమని. ఆ వర్షాకాలం కాస్తా వెళ్ళిపోతుంటే సరస్సులో శరత్తు కోసం తపస్సులు చేసి జగాలులేనీ సీమలో, యుగాలు దాటే ప్రేమలో రససిద్ధిని సాధించారు. ఇంత శృంగారాన్నీ ఒలికించి సన్నాయి జళ్ళోంచి సందేళ లాగేసిన సంపెంగ సంగతి మాత్రం దాటేస్తారు. అదేమంటే మరునికి మర్యాదలు చేసి చేసి అలసిపోయానంటారు.

ఆయన ప్రౌఢభాషా ప్రయోగాలని, యావదాంధ్ర అచ్చెరువున విచ్చిన కన్నులతో చూస్తుంటే, తను మాత్రం నేనింకా బాలగోపాలుణ్నే అంటూ సెంచరీలు కొట్టే వయస్సుల్ని, బౌండరీలు దాటే మనసుల్నీ ఆకట్టుకున్నాడు. టప్పులూ,టిప్పులూ, దుప్పటి చిల్లులూ అంటూ చిలిపితనాన్ని ఆరబోసాడు. మొదటిగా చిలక్కొట్టుడు కొట్టిననాటినుండీ ఆ మాస్ పాటలకి వెర్రెక్కిన వాళ్లని చూసి, నన్నీ పాటల్లోకి ’ఈలకొట్టి లాగుతారు ఆంద్రా జనం’ అని ముచ్చటగా విసుకున్నాడు.

ఇన్ని దారుల్లో ఏకకాలంలో నడుస్తూనే ’ఏదారెటు పోతుందో ఎవరినీ అడగక’ అని తాత్వికతను రంగరించి ’నేను నేననుకుంటె యదచీకటి’ అని విశాలత్వాన్ని ఉద్భోదించారు.బహుశా సురసీమల సినిమాలకు తన అవసరముందని వెళ్ళిపోతూ కూడా ’గతించిపోని గాధ నేన’ని ముందు తరాలకి భరోసా ఇచ్చిన దీరోధాత్తుడు వేటూరికి ఇదొక పాటపోగు.

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

15 Responses to మానస వీణ – మధుగీతం

 1. Sandeep అంటున్నారు:

  మీ పేరేంటో తెలియదు కానీ, వేటూరి కలాన జాలువారిన చక్కని భావాలనన్నింటినీ గుర్తు చేశారు. చలనచిత్రగీతగగనాన ధ్రువతారగా చేరిన ఆయన్ని, “చుక్కా నవ్వవే, నావకు చుక్కానవ్వవే” అని యువకవులందరూ ప్రార్థిస్తూనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

 2. Sowmya అంటున్నారు:

  Wow!!! I think I need to read it 2,3 times to grasp fully!!

 3. భావన అంటున్నారు:

  చాలా బాగా రాసేరు. మనసు పెట్టి రాసేరు. బాగుంది.

 4. rajesh అంటున్నారు:

  వేటూరి వారి ప్రతి పాటని, పలుకుని ఆస్వాదిస్తు, అభిమానిస్తూ, ఆ మధుర వేను గానం లొ ఒలలాడిన, ఎన్నొ సార్లు సెదదీరిన, మరి ఇప్పుడు కాస్తగ చిన్నబొయిన మనసు నుండి జాలు వారిన పరిమల పుష్పాంజలిని అందించిన నీకు ధన్యవాదములు

 5. మెహెర్ అంటున్నారు:

  సింపిల్‌గా చెప్పాలంటే, చితగ్గొట్టారు! 🙂

  ఈ ఒక్క టపా నా చేత ఎన్ని పాటల్ని కూనిరాగాలు తీయించిందో! మళ్ళీ మళ్ళీ చదువుకుని మళ్ళీ మళ్ళీ పాడుకునేట్టు వుంది!

  ఇద్దరు ముగ్గురికి మైల్ చేస్సా కూడా ఈ లింకు! 🙂

  >>> బహుశా సురసీమల సినిమాలకు తన అవసరముందని వెళ్ళిపోతూ కూడా “గతించిపోని గాధ నేన”ని ముందు తరాలకి భరోసా ఇచ్చిన దీరోధాత్తుడు…

  నిజం!

 6. subrahmanyam అంటున్నారు:

  బ్రతుకే పాటగా మార్చుకున్న ఒక గొప్ప కవికి, అంతే గొప్ప నివాళి!

 7. Aruna Pappu అంటున్నారు:

  కొన్ని శాశ్వతం అయితే బాగుండు అనుకుంటాం. మళ్ళీ మళ్ళీ తలచుకోవాలనే ఆలోచనతో దేవుడు వాటిని పరిమిత కాలానికే కానుక చేస్తాడనుకుంటా. వేటూరి పాట వాటిలో ఒకటి. మీ రాత ఎన్నో మంచి పాటలను గుర్తుచేసింది. ఒక జాబితాలా కాకుండా వాటిని మీరు రాసిన తీరు… కేవలం “బావుంది” అనడం నా అసమర్ధతకు నిదర్శనం. పొద్దులో ఈ వ్యాసమే నివాళిగా ఎందుకు ప్రచురించలేదో మరి.

 8. రవి అంటున్నారు:

  పొద్దులో ప్రచురించి ఉంటే మరింతమంది చదివి ఆనందించి, ఊహల్ని తడుముకుని ఆస్వాదించి సంతోషించి ఉండేవారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు కాక, మరణించిన తర్వాత బయటకొస్తోంది, “ఎలా ఎలా దాచానో అలవికాని అనురాగం, ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ”

 9. ఉష అంటున్నారు:

  అన్ని మాటలు ముందొచ్చిన వారు రాసేసారు. ఇక్కడి పాటలతో పాటు మరెన్నో వాటంతటవే ఆలాపనలుగా జారిపోతున్నాయి.. తనికెళ్ళ భరణి గారు సరస్వతీదేవి చెప్తుంటే రాసినట్లుగా రాసిన ఒక సన్మానపత్రం చదివి మనసు ఉసూరుమంది http://telugu.greatandhra.com/cinema/20-05-2010/or_23.php మళ్ళీ ఈ పాటలన్నీ గుర్తుకు వస్తుంటే ఉపశమనం. ఎక్కడికి పోయారు అనుకోవటం, ఇక్కడే ఉన్నారుగా అని తలపోయటం.

 10. Sriram అంటున్నారు:

  Well compiled and beautifully worded. If Only you could add thelinks to the songs as well…. 🙂

 11. పింగుబ్యాకు: మానస వీణ – మధుగీతం | indiarrs.net Featured blogs from INDIA.

 12. Manasa అంటున్నారు:

  Beautiful..Looks like it is indeed straight from the heart
  Keep them coming Swathi garu, for all the ardent admirers of Telugu literature, like me.

 13. jyothi అంటున్నారు:

  No words to explian about veturi. To tell anything about we need collect the words from his songs only.

 14. G N RAJU అంటున్నారు:

  Mee Bhavana shakti ki kritajnatalu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s