హృదయము సంకెల జేసి

 

గేట్ తీస్తూనే చెప్పుల అరకేసి చూడవసర్లేదు, లోపల శబ్ధాల్ని ఆలకించి పసిగట్టాల్సిందేం లేదు. నువ్వు లోపల ఉండుంటే  మనసుకి ముందే తెలిసిపోతుంది. లేనందుకు కాదు బాధ.. ఉన్నావేమో అని కాసేపు ఆశపడే అదృష్టం లేదని.

అప్పటిదాకా తనలో ఉన్న మనిషి వెళ్ళిపోయినా కాసేపలా ఊగుతూ జ్ఞాపకాల ఊయల.

 నా మటుకు నాకు నువ్వు లేకపోవటమంటే అసలేమీ లేకపోవటం. నీకు వీడ్కోలు చెప్పి వెనక్కు తిరగ్గానే ప్రపంచమంతా పరాయిదైపోతుంది. Whenever you are not around, I terribily miss myself. బహుశా నీ ఉనికే లోకం వైపు సారే నా చూపులో జీవాన్ని నింపుతుంది. అరచేతి ఆలింగనంలో సెల్ ఫోన్ బిగుసుకుపోతుంది. “ఎలా ఉన్నావు” అని నువ్వడిగిన మాటలో కూడా ప్రపంచానికర్ధం కాని రహస్యమేదో నాకే చెప్తున్నట్టు తోస్తుందెందుకు? అయినా మాట్లాడితే బాధ పోతుందనుకోవటం పిచ్చితనం. కేవలం పొడి పొడి మాటలు గాయాన్ని మాన్పకపోగా నొప్పిని కదిల్చి వదిలితే, ఏ జారిపడిన సంతోష క్షణాల కోసమో దిగులు వృత్తంలో పిచ్చిగా వెంపర్లాడే గడియారపు ముళ్ళమైపోమూ! నీతో ఎంతసేపు గడిపానన్నది కాదు ,ప్రతి రోజూ నిన్ను కలుస్తాననే నమ్మకంతో రోజంతా ఉత్సాహంగా పనిచెయ్యటం; అదొక నిశ్చింత.  ఈ రాత్రికి కూడానిన్ను చూడకుండా నిద్ర పోవాలి అనే ఆలోచన చాలు మనసుని మెలిపెట్టడానికి.

 ఒకప్పుడు ప్రకృతంతా ప్రేమమయంగా అనిపించేది. నాలోని ఆర్తిని మొత్తం అందుకోవడానికో మనిషి దొరికాక ఇక కవిత్వంతో అవసరం పడలేదు.ఇప్పుడో! గుండెను మోయలేనంత బరువెక్కించే భావశూన్యం. నువ్వు లేకపోవటం వల్ల బాధో, ఓంటరిగా ఉండటం వల్ల బాధో తేల్చుకోవడానికి జనంలోకేళ్తే చుట్టూ ఉన్న మనుషుల రూపంలో ఒంటరితనం మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జనసందోహపు తలుపు సందులో చూపుడు వేలుపడి బయటికి పొంగలేని బాధ గడ్డకట్టి అక్కడో నల్లటి మచ్చ.

 వాన ముసురులా ఎడాపెడా జ్ఞాపకాలు, తలపుల్ని తడిపేస్తూ.

’ఎదురుచూపు లోని ఉద్విగ్నత ఎదురు చూసిన వస్తువులో లేదు. కలలు కన్నప్పటి ఆనందం అవి నిజమవ్వటంలో లేదు.’ అని నువ్వన్నప్పుడు ప్రేమలో కుడా ఇంత ప్రాక్టికల్‍గా ఎలా ఉంటారో? అనిపిస్తుంది. సందేహాన్ని నిందగా మార్చి ’నా అందం, వయసు అంటేనే నీకు ఆకర్షణ’ అని ఆమాటకూడా బయటికనేస్తే..ఒక భావగర్భితమైన నవ్వుతో నువ్వంటావు..

“మల్లెపువ్వుని గుండెమీదో, గుళ్ళోనో ఉంచి ఉన్నతంగా ప్రేమించగలిగినప్పుడు, వాడిపోయాక పుస్తకం మధ్యలో పెట్టుకుని గుర్తుంచుకున్నప్పుడు, ఆ పువ్వు కొంత సేపైనా అందంగా ఉండటం నా ప్రేమకి సంబంధించి కేవలం యాదృచ్చికం. నీ రూపం, నడక, కదలిక, మొత్తంగా ఒక సున్నితత్వపు గ్రేస్‍ని, విషాదంలోని నిశ్శబ్ధపు భారాన్ని, విరహంలోని వివవశతను, ఆకులుగా రేకులుగా, రంగులుగా విడదీసి అస్వాదించటం నాకు రాదు. నువ్వు నువ్వుగానే నాకిష్టం. నీకన్నా అందమైన, తెలివైన, సుకుమారమైన వాళ్ళు ఎందరున్నా నీలో నాకు దొరికే unique combination మాత్రం మరెవర్లోనూ కనపడదు.”

ఈ మాటలు తలచుకున్న ప్రతి సారీ శరీరమంతా మొద్దుబారి పోతుంది, కదిలితే ఈ తన్మయత్వమంతా ఎటు పోతుందో అని భయం.

 ఏకాంతంలో ఒక ప్రేమగీతం మనసునిండా గింగిర్లు తిరుగుతుంటే, అంత ప్రేమనీ ఒక్క పిలుపుతో గొంతుదాటనిద్దామంటే ఎవరున్నారు నా దగ్గర? పలికే వారు లేరని పెదవులాగాయేమో కానీ, తుడిచేవారు లేరని కన్నీళ్ళాగవు. వణికించే చలిగాలులాగి వసంతపు చల్లటి గాలులు తోలేలోపు, పోనీ ఆ కాస్త వెచ్చదనమూ వేడి సెగలైపోయే లోపు కొన్ని నిముషాల్ని ఎలాగో గుప్పిట పట్టి ఉంచుతాను. ఆదమరచి ఏ రాలుతున్న పూల కోసమో దోసిలి ఒగ్గి వదిలేసేలోపు నువ్వొచ్చి అపురూపంగా అందుకుంటావా?

(మొదటి ప్రచురణ ఆంధ్ర జ్యోతి నవ్య లో – 03-06-2010)

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

5 Responses to హృదయము సంకెల జేసి

 1. Nishigandha అంటున్నారు:

  “…పలికే వారు లేరని పెదవులాగాయేమో కానీ, తుడిచేవారు లేరని కన్నీళ్ళాగవు. …”

  Beautiful!!!

 2. భావన అంటున్నారు:

  అధ్బుతం. ఏదో ఒక్క పదాన్ని తీసి మెచ్చుకుందామంటే కుదరటం లేదు. ప్రతి పదం మనసు నుంచి స్రవించిన విరహాల వూటలో ముంచి లేపి దానికి జ్నాపకాల మధురిమ ను అద్ది కొసమెరుపుగా పదాల చమక్కులను తళుకులు గా చేసి మాకు ఇచ్చినట్లుంది. ఇంకా ఏమి రాయాలో అర్ధం కావటం లేదు. చదివి కాసేపు స్ధబ్దు నై తేరుకుని రాస్తున్నా. నా భావం నాలో పలికితే విరహం… గాయాల గేయాలతోనో… మనసు ముక్కలుగా చేసి మలచిన అక్షరాలతో చదివిన ప్రతి ఒక్కరి లో ఆ భావన పలికించగలిగితే… అది ఒక భావ కావ్యమా రస మాధుర్యమా… ఏమో నాకైతే తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పరాదా….

 3. radhika అంటున్నారు:

  మీకు అసలు హృదయం లేదండి.ఇలాంటివిరాసి ఎంతమంది హృదయాల్ని భారం చేస్తున్నారో.నిజం చెప్పొదూ…..ఇలా మీరు నొప్పించినా పర్లేదు.ఇష్టం గా ఓర్చుకుంటాము 🙂 ఎప్పటిలా బావుంది అనను.అప్పటికన్నా చాలా బావుంది.

 4. Sujji అంటున్నారు:

  “ఎలా ఉన్నావు” అని నువ్వడిగిన మాటలో కూడా ప్రపంచానికర్ధం కాని రహస్యమేదో నాకే చెప్తున్నట్టు ….

  Refreshingly Beautiful!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s