ఇది వెన్నెల మాసమనీ

కొత్తగా వెల్ల వేసిన డాబా పిట్టగోడ మీద వెల్లికిలా పడుకుని ఆకాశాన్ని నిరాటంకంగా అనుభూతి చెందుతున్నాను ప్రతి రెండు నక్షత్రాల మధ్య దూరాన్ని లెక్ఖ కట్టుకుంటూ..
“అక్కా!ఇదే నెల?” నా చెల్లెలు. ఇదెప్పుడొచ్చిందో పైకి.
“వెన్నెల” తన్మయంగా చెప్పాను.
“ఒసే…య్.. ఇక్కడ్నుంచి తోసేస్తాన్నిన్ను.తెలుగు నెలల్లో ఇదే నెలా అని?”
“అబ్బా! ఏమిటే నీ గోల? కార్తీకం. అసలిక్కడికెందుకొచ్చావ్?” ఇది నిజంగా అన్నంత పని చెయ్యగలదు. జాగ్రత్తగా పిట్టగోడ దిగి డాబా మెట్ల మీద కూర్చోబోతుంటే విరగబడి నవ్వుతుందెందుకో. “ఏవిటే, వెర్రి నవ్వూ, నువ్వూనూ?”
“ఏం లేదు.నీ బట్టల్నిండా వెన్నెల”
అబ్బా సున్నం అంటింది. అవును వెన్నెల పిండారబోసినట్టుంది అంటాం కదా, సున్నమేసినట్టుంది అని కూడా అనొచ్చు ఇకనుంచి. నా అద్భుతమైన అలోచనని పంచుకుందామంటే  ’అక్కా! అసలు శనగపిండి తెల్లగా ఉందదు కాబట్టి బియ్యప్పిండి అనుకుందాం. అయినా అసలు పిండి ఎందుకారబోస్తాం? పురుగు పడితే కదా! మరి వెన్నెలకి పురుగు పట్టినట్టా?” అని గతంలో ఒకసారి ఈ పిల్ల నాకు విరక్తి తెప్పించిన విషయం గుర్తొచ్చి ఊరుకున్నా.
“మరైతే, శరదృతువన్న మాట!” వదలకుండా పక్కనొచ్చి కూచుంది. ఫర్లేదే దీనికి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. “ఊ!! బావుంటుంది కదా. నాకు భలే ఇష్టం వెన్నెలంటే.”
“అబ్బ ఛా! ఎవరికుండదు ఇష్టం. నీకు ఉండడం ఏదో గొప్పైనట్టు.” ఒక్కమాట సవ్యంగా రాదు దీని దగ్గర. ఏదో కాసేపు ఆనందపడనివ్వచ్చుగా.
“నువ్వు పక్కనుంటే ఆ ఇష్టం కాస్తా కష్టమౌతుందే. నే కిందకెళ్తున్నా. ఒక్కదానివే ఊరేగు.” ఒక దణ్ణం పెట్టి తులసికోట దగ్గర ప్రమిద లో నూనె పొయ్యడానికెళ్ళిపోయా!

*******

ఏదో పంచవర్ష ప్రణాళికలని పెద్ద గొప్పగా చెబుతారు కానీ ఐదేళ్లంటే ఏ మాత్రం? ఐదు వసంతాలని సంవత్సరాలని లెక్కెట్టే బదులు పది వెన్నెల మాసాలనుకోవడం మనసుకి చల్లగా ఉంటుంది కదా. కింద ఇంట్లో సన్నాయి మేళం. పెరట్లో వెన్నెల పందిరి కింద పెళ్ళి మండపం. మళ్ళీ కొత్త సున్నాలు వెలవెల బోయేలా కొత్తపెళ్ళికూతురి తలంబ్రాల చీరలాంటి స్వచ్చమైన తెల్లటి వెన్నెల సిగ్గుల మొగ్గలారబోసుకున్నట్టు.

“ఏమ్మా! కనిపించిందా అరుంధతి?” అదే డాబా మీద పురోహితుడు నా సమాధానమొస్తే పని కానిచ్చి వెళ్ళొచ్చని తొందర పడుతున్నాడు.  కొత్తచేతిలో ఇమిడిపోయిన చిటికిన వేలు సన్నగా వణుకుతుంది, మరి కొంగుముడి కూడా కంపిస్తుందేమో తెలీదు. ’కనపడినట్టే ఉంద” ని తల ఊపితే కిందకు రాలిన పసుపు రవ్వల్లాంటి తలంబ్రాల వెన్నెల.

“వెళ్ళొస్తానమ్మా!” అప్పగింతలయ్యాక కారెక్కుతూ ఎవర్నుద్దేశించన్నానో కూడా చెప్పలేను.
ఇంజన్ స్టార్ట్ అయి కదలబోతుంటే మనసాగక అద్దం దించి మళ్ళీ ఓసారి చెయ్యూపుతుంటే తిరిగి ఊపుతున్నవాళ్లలో చెల్లి కనపడలేదు.
“అదెక్కడమ్మా?” నాప్రశ్న హడావిడిలో ఎవరికీ వినపడనట్టుంది. అనుమానమేసి పైకి చూస్తే డాబా పిట్టగోడ మీద అటుతిరిగి కూర్చుని వెక్కెక్కి ఏడుస్తుంది వెర్రిగా  పిచ్చితల్లి.
ఉన్నట్టుండి నాకళ్లనిండా ఆత్మీయపు కన్నీటి వెన్నెల.

********

మొదటి ప్రచురణ ఆంధ్రజ్యోతి నవ్యలో 18-07-2010

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

6 Responses to ఇది వెన్నెల మాసమనీ

 1. ప్రణవ్ అయినవోలు అంటున్నారు:

  చాలా బాగుంది!
  పొద్దున్నే ఆంధ్ర జ్యోతిలో చదివాను. చివరి వరకు చదివాక గానీ మీరు రాసారని తెలియలేదు. అప్పటికి మీరింకా ఈ టపా పోస్ట్ చేయలేదు. ఈ రోజు మీ ఆర్టికల్ వల్ల నవ్వుతో మొదలయ్యింది. 🙂

 2. siddhartha అంటున్నారు:

  brilliantly written.u seem to have a flair for writing.the ease with which u wrote………the choice of words………the finishing touch……….aaaaahhhhh!

 3. మేధ అంటున్నారు:

  అంతేనా, అప్పుడే అయిపోయిందా అనిపించింది.. కానీ జ్ఞాపకాల తేనెతుట్టెను కదిలించింది….

 4. malapkumar అంటున్నారు:

  ఆంధ్రజ్యోతి లో చదివి మీదేనా , ఏమైనా దాని గురించి రాశారా చూద్దామని వచ్చాను . బాగా రాశారు .

 5. sindhuvu అంటున్నారు:

  మేధ గారి స్పందన కింద ఒక డిట్టో మార్కు, సిద్ధర్థ్ గారి స్పందన కిన మరొక డిట్టో మార్కు పెదితే, అది నా స్పందన. పేర్లు మారిస్తే సరిపోతుంది.

  ఇది చదివాక నా కామెంటు తెలుగు సినిమా కథ ఫక్కీలో ఉందనిపిస్తే అది నా తప్పు కాదు.

  గమనిక :- I am jelous of yamini… (idi pachi nijam..!!!)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s