రసమయం జగతి

ఎంతో ఇష్టమైన పాటని రింగ్‌టోన్‌గా పెట్టుకోవటం ఎంత బుద్ధితక్కువ పని! ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వచ్చి, ఏదో శత్రుత్వం ఉన్నట్టు వీలైనంత త్వరగా పాట ఆపెయ్యాలి.

తడిచేతిని కర్చీఫ్‌తో తుడుచుకుని, ఫోన్‌ తీసి ‘విరించి’ అన్న పేరును చూస్తూ ‘హలో’ అన్నాను.

అటువైపు అలికిడి లేదు.

“మాట్లాడరే?” ఖాళీ అయిన లంచ్‌బాక్సును సర్దుతూ అన్నాను.

“ఓ… జగతీ, హలో” అవతలనుంచి.

“ఏమిటంత పరధ్యానం?” చెప్పటానికి పెద్ద విషయాలేం లేకుండా ఫోన్ చెయ్యరే ఎప్పుడూ!

“ఒక కథ రాయాలి.. “

“ఏమిటో సబ్జెక్ట్?”

“నీ గురించే”

“నా గురించి రాయడానికేముంది?”

“అదే నాకూ అర్ధం కాక…”

“టీజ్ చెయ్యడం కూడా మొదలెట్టారా?”

“……….”

“ఐతే మీకథ రెండు రోజుల క్రితం మొదలౌతుందేమో.”

“అంతకుముందు సంగతులతో మొదలెట్టి నువ్వే ఎందుకు రాయకూడదు?”

“……….”

“దీనిక్కూడా ఎందుకంత ఆలోచన?”

“ఎక్కడి నుంచి మొదలెడితే బావుంటుందో అని..”

“ఆహా! ఇక ఉంటా మరి.. నీకూ నీకథకి మధ్య నేనెందుకు.”

————————XXXX——————-

మధ్యాహ్నం మెయిల్ చూసినప్పటినుండీ ఒకటే పరధ్యానం, చెన్నైలో మా టీముకి రెండురోజులపాటు మేనేజ్మెంట్ ట్రైనింగ్. నేరుగా ఫన్‌ట్రిప్ అంటే ఫండ్స్ రావని, చెప్పుకోవడానికి గొప్పగా ఉండదనీ ఈ ట్రైనింగ్ ముసుగు. అక్కడికెళ్ళాక ఇంగ్లీష్ వ్యక్తిత్వ వికాస పుస్తకాలని కాసేపు వల్లించి ఐపోయిందనిపించెస్తారు ఎలాగూ.

అదెలాఉన్నా మళ్ళీ చెన్నై వెళ్లాలన్న నా కోరిక తీరుతున్నందుకు చెప్పలేనంత ఉత్సాహంగా ఉంది. హరితో ఇదివరికెన్నో సార్లు ‘ఒకసారి వెళ్ళొద్దాం’ అన్నాను. “ఇప్పుడెవరున్నారక్కడ? ఐనా చూద్దాంలే,” అంటాడు. వాయిదా వెయ్యడమంటే, ’వద్దు’ అని సామరస్యంగా చెప్పడం. ఇప్పుడు ఆఫీస్‌టూర్ కాబట్టి ఏమంటాడో! వీక్లీ టార్గెట్ పూర్తిచేసి ఇంటికెళ్ళేసరికి తలలో యుద్ధం జరుగుతున్నంత నొప్పి.

“ఏమిటింతాలస్యం? కొత్తగా ప్రమోషనొచ్చిన వాళ్ళకి ఇల్లు గుర్తురాదేమో, నేను మధ్యాహ్నం కూడా తినలేదు”తలుపు తీస్తూనే నైట్‌డ్రెస్లో, చేతిలో టీవీ రిమోటుతో నామీద కంప్లైంట్లతో సహా సిద్ధంగా ఉన్నాడు.

‘నువ్వాలస్యంగా వస్తే కంపెనీకోసం, మన ఫ్యూచర్‍కోసం కష్టపడ్డట్టు, అదే నేనైతే ఇల్లు గుర్తు లేనట్టూనా? అంత ఆకలున్న వాడివి వండుకోలేకపోయావా?’ ఇవేమీ అనలేదు, కొన్ని విషయాలు మాట్లాడి తలనొప్పి పెంచుకోవడం కన్నా త్వరగా పని చేసుకుంటే పడుకోవచ్చు. ఒక నీరసపు నవ్వు నవ్వి “వచ్చే వీకెండ్ చెన్నైలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది కొత్త మేనేజర్లకి” చాలా అసందర్భమైన సందర్భంలో ’కొత్త’ అనే పదాన్ని స్ట్రెస్ చేస్తూ చెప్పాను.

ఎదురు సమాధానం చెప్పకపోవడంతో అప్పటికే గిల్టీగా అనిపించినట్టుంది, “మనకి దొరికే రెండ్రోజులూ ఇలా ఆఫీస్ పనంటే.. విల్ మిస్ యూ! మానడానికి కుదరదా?”

‘నువ్వు నీ స్నేహితులతో షికార్లలోనో, ఇంట్లో టీవీలోనో మునిగిపోతే, నేను ఇల్లు శుభ్రం చేసుకుంటూ రాబోయే వారానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ప్రతివారం నేను .. విల్ యూ రియల్లీ మిస్ మీ?’ “ఊహూ, కుదరదు, పెర్ఫార్మెన్స్ ఎప్ప్రైజల్లో నెగెటివ్ వస్తుంది” నటనని మించి జీవించాను. మిస్సింగూ, వల్లకాడూ కాదు. ఆమాట కొస్తే ఎన్ని వారాంతాలు నేను లేకుండా నువ్వు స్నేహితులతో అరకులు, అజంతాలూ తిరగలేదు?

“చెత్త పాలసీలు. ఆడవాళ్ళకి ఎన్ని ఇబ్బందులుంటాయి?. ఇంతకీ లేడీ కొలీగ్స్ వస్తున్నారుగా! సర్లే వంట మొదలెట్టు.”

“ఎవరూ లేరు, ఒక్కదాన్నేగా మా టీంలో అమ్మాయిని” నిజమే అయినా, కసిగా చెప్పి నాపనైపోయినట్టు వీలైనంత నెమ్మదిగా లోపల్నుంచి వంట గది తలుపు నెట్టాను, చిరాకు శబ్ధమై బద్ధలవకుండా.

’నా గురించి నేను నిరంతరం తెలుసుకోవాలంటే ఎప్పుడూ నా పక్కన ఉండే నువ్వే నాకున్న ఏకైక ఆధారం’ అనుకున్నాను పెళ్ళైన కొత్తలో, అతుక్కుపోయి ఉన్నా వేరు వేరు దిక్కులకేసి చూసే బొమ్మా బొరుసుల్లా ఏకమైపోయిన జీవితం మనది. కానీ ఒకళ్ళనొకళ్ళం తెలుసుకుంటున్నామో, మిస్‌లీడ్ చేసుకుంటున్నామో అర్ధం కావట్లేదు. కొన్ని విషయాలు నీకు కేవలం అలవాట్లకు సంబంధించిన సమస్య. కానీ అవి నా విలువలకూ, వ్యక్తిత్వానికీ సరిపడనప్పుడు .. సారీ నేను మారలేను.

మొదట్లో ఒకసారడిగాను నానుంచి నువ్వేమాశిస్తున్నావని. “నాకు మా అమ్మలాగా ఎప్పుడేం కావాలో చూసుకోవాలి. మావాళ్ళతో గౌరవంగా, కలుపుగోలుగా ఉండాలి, వంట బాగా రాకపోయినా పర్లేదులే.. మరి నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావ్?”

“జీవిత కాలపు స్నేహం”

నీకు బాగా నవ్వొచ్చినట్టుంది “స్నేహం మాత్రమేనా? భార్యాభర్తలమే అయిపోయాం కదా”

నిజమే! ఇప్పటికీ భార్యభర్తలమే.. అరమరికల్లేని స్నేహంమాత్రం లేదు.

ఒకరిపై ఒకరం ఆధారపడి ఉండటాన్ని, అలా ఉండక తప్పని అవసరాన్ని.. దీన్నేనా మనం సహజీవనమని లోకాన్ని భ్రమింపజేస్తున్నాం?

……

నొప్పి నిదానించి కలలకు, కలతలకూ అందని మత్తు నిద్ర నాలోకి మెల్లగా జారుకుంటుంది. – థాంక్స్ టు పెయిన్ కిల్లర్స్.

ఏమిటో కలలోని మెలకువలాంటి వెచ్చదనం, చుట్టూ మూడేళ్ళుగా అలవాటైన వివశత్వపు కదలిక.

విసుక్కోలేదు, విదిల్చి కొట్టలేదు..

’ఆప్ట్రాల్ ఐ టూ నీడ్ యూ’

కొన్ని నిముషాలైతే మాత్రమేం? మనసుల మధ్య మొహమాటాలన్నీ పటాపంచలైపోయి, ప్రపంచమంతా అనవసరమనిపించేటంత పిచ్చిఆవేశంలో కాలిపోతూ.. ఆలోచనలూ, ఆరోపణలూ అన్నీఅనవసరమైపోయి.. ధ్యానమా, యోగమా?

సపది మదనానలో…

“ఇవ్వాళ బాస్ పిలిచాడు”

“ఊ..” దహతి మమ..

“ఈసారి రివిజన్లో నన్ను ప్రమోట్ చెయ్యొచ్చనిపిస్తుంది”

దహతి మమ మానసం..

“మన వాళ్ళేలే”

“అహా”….దేహి ముఖకమల..

“లోన్ పెట్టయినా కార్ కొనాలి. లేకపోతే ఎవడూ లెక్క చెయ్యడివ్వాళ.. ఎమంటావ్?”

“ష్హ్…..షటప్ హరీ”

“నీకు కెరీర్‍మీదా ఫ్యూచర్‍మీదా బొత్తిగా ధ్యాస ఉండదెందుకో”

“మరే,నిజం”

చీకట్లో నిశ్చలంగా చెట్టు కొమ్మలపై నిద్రిస్తున్న పక్షిగుంపుని టపాసులు పేల్చి చెదరగొట్టినట్టు…

ఏకాగ్రతలేని ఏకత్వ సాధన దేనితో సమానం, దేనికన్నా హీనం?

*******

మౌనంగా సెల్‍ వైబ్రేషన్ మోడ్లో గిలగిల్లాడుతుంటే తీసి ’విరించి’ అనే పేరు వెలుగుతుంటే’ ఏమిటింత పొద్దున్నే’ అనుకొంటూ పలకరించాను.

“నువ్వెక్కడ” అటునుండి..

“ఎయిర్‌ పోర్ట్‌లో.. బయల్దేరటానికి మరోఅరగంట పట్టొచ్చు”

“టైమ్ తెలీకుండా ఒక కథ చెప్పనా?”

“కొత్త కథ రాస్తున్నప్పుడే నేను గుర్తొస్తాననుకుంటా! ” బొత్తిగా నిజంలేని ఆరోపణ. ఎప్పట్లానే ఆయన కథ మంత్రముగ్ధంగా సాగిపోయింది. ఏసమయంలో ఐనా తనకథని, దాని వెనకున్న మధనని నాతో చెప్పగల చనువు, దాన్ని నిరంకుశంగా విమర్శించగల అధికారమూ నాకు ఈ రెండేళ్ల పరిచయంలో ఎప్పుడొచ్చాయో తెలీదుకానీ దానికి ముందు ఒక దశాబ్ధం నుంచీ ఆయన్ని పత్రికల్లో, పుస్తకాల్లో చదివి అభిమానించిన ధీమాకొద్దీ అప్పట్లో ఒక ఉత్తరం రాశాను. గత పదేళ్ళుగా వాడేసిన కథాంశాలూ, శైలిలో వచ్చిన రొటీన్నెస్, ఇప్పటి పాఠకులకి దగ్గరవ్వడం కోసం తనకి తాను దూరమౌతున్న రచనాత్మ , ఒక అభిమానిగా నేను ఆశించినది దక్కక ఎంత మోసపోయానో ప్రతీపేజీని అందులోని వాక్యాల్నీ ఉదహరిస్తూ ఏదో పూనిన ఆవేశం లో రాసేశాను.

కొన్ని నెలల తర్వాత నాకు సమాధానం వచ్చింది సమీక్ష కోసం పంపిన తన కొత్త పుస్తకంతో పాటు. విమర్శలు, అబిమానులు, అరోపణలూ కొత్త కాకపోయినా సరైన సమయంలో నా అభిప్రాయం, దాన్లోని వాస్తవం పనికొచ్చాయనీ, ఆ సమీక్షలోని నిజాయితీ తనకి చాలా అవసరమని దాని సారాంశం.

కథ చెప్పడం పూర్తిచేసి చివర్లో ” అక్కడికి నేనెప్పుడొచ్చినా నాపనులతో ఎక్కువ సమయం దొరకలేదు. నువ్వే వస్తున్నావుగా, ఈ రెండ్రోజులూ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు.”

రెండ్రోజులేం ఖర్మ కొందరెన్నాళ్ళు మాట్లాడినా చెప్పవలసిన విషయాలు మిగిలే ఉంటాయి.

“అలాగే! ఎనౌన్స్‌మెంటొచ్చింది. ఉంటా మరి.”

******

రాత్రంతా నిద్రపోనివ్వని హృదయఘోషతో, ఎప్పుడూ స్వర్గాన్నే చూస్తుండటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయతతో… అర్థంలేని అలల హోరుతో సముద్రం నిరంతరంగా ఏడుస్తుందట. చిన్న పిల్లాడొచ్చి కాలింగ్ బెల్ కొట్టి పారిపోయినట్టు ఏవో పూర్తిగా గుర్తొచ్చీరాని జ్ఞాపకాలు. గవ్వలదండల్ని ఎమోషనల్‍గా బహుమతి ఇచ్చుకున్న అడాలసెంట్ స్నేహాలు, బీచ్ ఒడ్డున అమ్మతో గడిపిన ఆఖరి సాయంత్రం. ఆమె పోయాక ఒంటరితనంతో పొగిలి పొగిలి అలలతో పంచుకున్న వేదనా.. ఇంకా..

“నీ పాటికి ట్రైనింగ్ క్లాస్ ఎగ్గొట్టి ఇక్కడొచ్చి కూర్చున్నావ్. ఎండలో ఇసుక ముద్దలనుకుని అలలు నీ పాదాలపైకి ఎగబాకటం… చూస్తూ ఉండిపోవచ్చు కానీ, ఎంత చలికాలపు ఎండైనా ఇన్ని గంటలు కష్టమమ్మా!”

“నాఏడుపు మీకు నవ్వులాటగా ఉంది కదా!” గొంతులోకి ఉక్రోషం రాకుండా కష్టపడుతున్నాను.

“నీ వయసెంత?”

చటుక్కున సూటిగా చూస్తే నాకళ్ళలో అనుమానం కనిపించిందేమో, “ఏం లేదు, ఈ వయసుకే ఇంత మౌనంగా ఉండటం గంభీరంగా కనపడాలనా?”

“ఏం నా వయసులో మీరిలా ఉండేవారు కాదా?” విషయం నామీదినుంచి మళ్ళించాలని..

“అప్పుడేమిటి, ఇప్పుడు మాత్రం నీలా ఎందుకున్నాను”

“నాకన్నా పదేళ్ళు పెద్దేమో! యుగాలక్రితం పుట్టినట్టు మాట్లాడతారు.” అరచేతిలో గవ్వల్ని గలగల్లాడిస్తూ తడి తుడుస్తున్నాను.

“లాభం లేదు. నువ్వు ప్రేమించటం మొదలెట్టాలమ్మాయ్” ఒక నిట్టూర్పుతోపాటు సముద్రతీరాన్నీ వదలడానికి సిద్ధమౌతూ ఆయన..

“ఎవర్నో?” పాదాలమీద ఇసుక దులుపుకుని, కాలి పట్టీలు మెల్లగా విదిలిస్తూ లేచి నిలబడ్డాను.

“నిన్నూ, నీజీవితాన్నీ! అన్నట్టు, ప్రతిసారీ అలా అనుమానంగా చూడకు, నాకిబ్బందిగా ఉంటుంది” తడిచిన చెప్పుల్ని తొడుక్కుని నాముందుగా నడుస్తూ.. ” లలిత నిన్ను తీసుకురమ్మని గట్టిగా చెప్పింది. ఈ రెండ్రోజులు హోటల్ రూమ్ వద్దని చెప్పెయ్యి ” నా వైపునుంచీ అదే నిర్ణయమైపోయినంత ధీమాగా..

ఒక్కదాన్నీ విసుగుపుట్టించుకోవాలని నాకూ లేదు.
*********

ఓ….హో” ఆశ్చర్యాన్ని కొన్ని క్షణాలపాటు సాగతీస్తూ అప్పుడే విన్న విషయాన్ని మరోసారి మననం చేసుకున్నాను.

“ఐతే లలితా పబ్లిషర్స్ వెనకున్న కథ ఇదన్నమాట. అడపాదడపా పత్రికల్లో కథలూ, సీరియళ్ళూ రాసే ఈయన హఠాత్తుగా నవలలు, నాన్-ఫిక్షన్ పుస్తకాలు వేసెయ్యడం. కొత్తగా పాఠకుల మార్కెట్ని కదిలించడం వెనకున్న బలం.” భోజనాలయ్యాక లలిత చెప్పే మాటలు వింటూ సాలోచనగా అన్నాను.

“అవసరమనుకున్న సబ్జెక్ట్ మీద పబ్లిషర్లు ఆసక్తి చూపించక, రీసెర్చ్‌ని వదులుకోలేక అసంతృప్తితో ఉండేవారు. ఫార్చునేట్లీ.. పబ్లిషింగ్ కంపెనీలో నాఅనుభవం బాగానే పనికొచ్చింది.” తలోదిక్కుకి పడున్న రిఫరెన్సు పుస్తకాలని తీసి అరలలో సర్దుతూ చిరునవ్వుతో ముక్తాయించారు ఆవిడ.

“’ఉదయాన్నే లేవాలి. మీరు కానివ్వండి” దూరంగా టేబిల్ మీద కాగితాలు పరుచుకుని రాసుకుంటున్న ఆయన్ని కూడా ఉద్దేశించి హాల్లోంచి ఆవిడ లోపలి గదిలోకి వెళ్ళిపోయాక చేతిలో పుస్తకం తిరగేస్తూ ఉండిపోయాను. రచనల తాలూకూ నోట్స్ అనుకుంటా అది. అక్కడక్కడా కొన్ని వాక్యాలు కొట్టివేతలతో, దిద్దుబాట్లతో ఉన్నాయి.

ఏకాగ్రత కుదరక తిరిగి పెట్టేశాను. కొన్ని నిముషాల అర్ధవంతమైన నిశ్శబ్ధం తర్వాత, ఏదిముందు బయటపడాలో తెలీక ఎన్నో మాటలు ఒకదాన్నొకటి ఢీకొని లోలోపలే సమసిపోతుండగా..

“నీ బాధేమిటో, నీ ఆలోచనలేమిటో ఆయనతో చెప్పి చూశావా?” ఊహించని ప్రసక్తితో ఉలిక్కిపడి చూశా! పొద్దున రాగానే నాగొడవంతా ఏకరువు పెట్టిన సంగతి అప్పుడే నవ్వుతూ వదిలేశారనుకున్నాను.

తేరుకుని “వాదనలతో అభిప్రాయాలు మారతాయేమో కానీ జీవితాలు కాదు.” తేల్చేసినట్టుగా అన్నాను.

దించిన తల ఎత్తకుండా రాసుకుంటూనే “వాదించడం వేరు. నీ వాదాన్ని వినిపించడం వేరు”

రచనల్లో పనికొస్తాయి ఈ మాటల మెలికలు. “అర్థం చేసుకోలేని మనిషికి చెప్పీ ఏముపయోగం?”

ఆయన ఏమీ అనలేదు. మళ్ళీ నేనే ఇంకేదో చెప్పుకోవాలనిపించి..

” అంత అర్ధం చేసుకునే భార్య ఉండగా ఎన్నిమాటలైనా చెబుతారు. మీకెలా తెలుస్తుంది నా గొడవ?”

రాస్తున్న కాగితాలు మూసి నవ్వుతూ “నా కంప్లైట్లు నాకూ ఉన్నాయి. దానికేమంటావ్?”

కుర్చీలోంచి లేచొచ్చి పూర్తి చేసిన కథ ఫైల్ నాకిచ్చి “నేను చూసిన ఈ రెండేళ్లలో నువ్వో వ్యక్తిగా ఉద్యోగంలోనూ, అనుభవంలోనూ చాలా ఎదిగావు. ఆ సంగతి నీతోనే ఉంటున్న ఆయనకి కనిపించదేమో. బహుశా నీక్కూడా అనిపించకపోవచ్చు.” నాకెదురుగా ఉన్న సోఫా కవర్ సరిచేసి అక్కడ కూర్చుంటూ “ఈ లెక్కన నేనైతే నీతో చాలా దురుసుగా ప్రవర్తించలేదూ ఒక్కోసారి. నా కథల్ని కఠినంగా విమర్శించినప్పుడు? మరి నాకూ నీమీద గౌరవం, అభిమానం లేనట్టా?” సరిగ్గా నా కళ్ళల్లోకి చూసేలా తలెత్తి మోకాళ్ల మీద మోచేతులానించుకుని అప్పుడే పేపర్లు ఫైల్ చెయ్యడానికి వాడిన ప్లాస్టిక్ పంచ్‌ను రెండు చేతుల్లోకీ మార్చుకుంటూ నన్ను ఇరకాటంలో పెట్టేశారు.

తప్పించుకోలేక తల వంచేసుకుని కథ చదువుతున్నట్టు నటిస్తున్నానో, నిజంగా చదవడానికి ప్రయత్నిస్తున్నానో..

“తీరిగ్గా చదవచ్చు, ముందిటు చూడు” ఆయన చేతిలోని పేపర్ పంచ్ విడిపోయి రెండు భాగాలూ చెరో చేతిలోకొచ్చి, కత్తిరించబడ్డ గుండ్రటి కాగితమ్ముక్కలన్నీ ఒక్కసారిగా నేలరాలాయి అప్పటిదాకా ఆపుకొని తల పైకెత్తగానే బయటపడ్డ నా కన్నీళ్లతో పాటు.

నేల మీద మోకాళ్ల దండ వేసినట్టు వంగి మా ఇద్దరి మధ్యలో పడున్న కాగితం ముక్కలన్నీ ఏరి అరచేతిలో వేసుకుంటూ..

“అసంతృప్తి అనేది ఎవరి జీవితంలో ఐనా ఎంతోకొంత ఉండక తప్పదు. కొన్ని ఎప్పటవప్పుడే మరిచిపోవాలేమో! ఏమంటావ్?” నా సమాధానం కోసం పైకి చూసి బదులిచ్చిన బాష్పధారతో చలించిపోయి..

“ఏందుకు తల్లీ! నీమీద నీకంత జాలి.. ఊర్కో”

సున్నితంగా చేత్తో తల నిమురుతూ పక్కనొచ్చి కూర్చుంటే ఆ వాత్సల్యాన్ని,సాన్నిహిత్యాన్నీ కాదనుకోవడం అయ్యేపనేనా? మనసెరిగిన అమ్మ దూరమయ్యాక, క్రమశిక్షణ పేరుతో మొదట్నుంచీ దూరంగా ఉన్న నాన్న, తన అవసరాలు తప్ప మరో ఆత్మీయతని ఆశించలేని, అందించలేని భర్త, మనసువిప్పి మాట్లాడేంత స్నేహాన్ని ఎవరితోనూ చెయ్యనివ్వని ఇంట్రావర్షన్ – ఎన్నేళ్ళుగా పేరుకుపోయిందో.. దుఃఖం!కాసింత ఓదార్పు దొరికితే మరింతగా పెల్లుబుకి అహాన్ని ముంచేయడమేగా దాని లక్షణం.

********

ఇంకా రాత్రి ఎనిమిదైనా కాలేదు, వచ్చేపోయే జనం మధ్యలో చిక్కటిచలి లైట్ల వెలుతురు చాటున కిటకిటలాడుతోంది. ట్రాఫిక్ మీద అపనమ్మకంతో బాగా ముందు బయల్దేరొచ్చానేమో నేనెక్కాల్సిన ఫ్లైట్‍కి మరోగంట టైముంది. ఒక్క గంటేమిటి రాబోయే ఋతువులన్నిటికీ సరిపడా ఆనందాన్ని, ఒక జీవితకాలం పాటు తోడుండే జ్ఞాపకాల్ని సంపాదించుకున్నానీ రెండ్రోజుల్లో. పొద్దునే లేచి అప్పట్లో అమ్మతో పాటు వెళ్ళే గోపాలపురం గుళ్ళో తిరుప్పావై వినొచ్చి, నే చదువుకున్న కాలేజ్ లైబ్రరీలో నా చోటునోసారి ఆత్మీయంగా తడిమి చూసుకుని, ఆరోజుల్లో ఇక్కడ అద్దెకున్న ఇంటి పక్కన తమిళ వాళ్లతో మాట్లాడి….

ఇవన్నీ అతి మామూలు, చిన్న చిన్న సంగతులు. కానీ పోగొట్టుకున్న మనుషులు, గతంలో వదిలి వచ్చిన స్థలాలూ, జ్ఞాపకాలూ తర్వాత అమూల్యమైన విలువని అపాదించుకుని బెంగగామారి మనిషిని తినేస్తున్నప్పుడు ఈమాత్రం సంగతులే మనుగడకో కొత్త అర్థాన్ని చూపిస్తాయి. అందులోనూ ఉద్వేగాన్ని పంచుకుంటూ, పాతగుర్తులతో మనసు వికలమైనప్పుడు ఊరటనిస్తూ వెంటఉన్న వ్యక్తి వల్ల మరింత తృప్తిగా అనిపించింది.

అంతేనా లేక రేపెప్పుడో కలగబోయే బెంగకు కొత్త పునాది పడుతుందో?

“మాటల్లో పడి మర్చిపోయాను. ఇది నీకోసమే.. చదువుతూ ఉండు, అర్జెంట్ ఫోనొకటి మాట్లాడొస్తా” పాకెట్‌బుక్‌లో మడత పెట్టున్న కాగితమొకటి నాచేతికిచ్చి రింగవుతున్న ఫోన్ నోరునొక్కి ఆయన దూరంగా వెళ్ళిపోవడం చూస్తునే ఆత్రంగా, కొంచం అనుమానంగా తెరిచానా ఉత్తరాన్ని..

జగతీ,

నీ ఆవేదన అర్ధమైంది. కానీ నీ ఆలోచనే భయపెడుతుంది.

మనమనుకునేవి అవతలి వాళ్ళు అర్ధం చేసుకోవట్లేదని బాధపడతాం కానీ అదే సమయంలో ఆ వ్యక్తి దేనిగురించి బాధపడుతున్నాడో అనే కనీస ఆలోచన కూడా రాదుకదా! అదే మనిషిలో ఉన్న మంచి విషయాల్ని చాలా కన్వీనియెంట్ గా స్వీకరించేస్తాం కానీ లోపాల్ని మాత్రం ప్రత్యేకంగా గమనిస్తూ మితిమీరిన గుర్తింపునిస్తూ ఉంటాం ఎన్నోసందర్భాల్లో.

మనిషిగా ఆనందంగా ఉండటానికి చాలా కావాలి; ప్రేమ, గౌరవం, సరదా, సంతోషం ఇవన్నీ. అన్నీ ఒక్కరినుంచే దొరకాలంటే అయ్యేపనేనా? మనిద్దరి స్నేహంలో ఉన్నఆరాధనా, నువ్వొక మేనేజర్‌గామాత్రమే తెలిసిన వాళ్లనుండి వచ్చే గౌరవమూ అన్నీ ఒక్క మనిషినుండే ఆశించడం నీ నిరాశకి మూలమని నాకనిపిస్తుంది.

ఒకరి అలవాట్లలో నీచమైనవి, ఆలోచనల్లోకెల్లా హీనమైనవి, మాటల్లోకెల్లా పరుషమైనవి.. అన్నిటినీ ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ కూడా మచ్చలేని అంకండిషనల్ ప్రేమ ఎవరికైనా ఎలా సాధ్యం?

అసందర్భమైనా మరొక్క విషయం – చాలా సార్లు అడిగావు నాకిష్టమైన పుస్తకం ఏదని. ’నా డైరీ ’. చదవటానికీ, రాయటానికీ కూడా బాగుంటుంది. జీవితం కూడా డైరీనే. పాత సంగతులు చదివి ఊరుకోవడం కాదు, కొత్త ఆశల్ని అందంగా, తెలివిగా రాసుకోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ నీకు తెలీదనో, నువ్వేదో అజ్ఞానంలో ఉంటే ఉన్నఫళాన ఇది చదివి మారిపోవాలనో నా ఉద్దేశం కాదు. ఒక్కసారి నీలోకి నువ్వు తరచిచూసుకుని నీ ఎమోషన్లకి నీమీద పెత్తనమివ్వకుండా జాగ్రత్త పడమని సలహా ఇవ్వడం..

మీరూ నాకే చెబుతారా అని మళ్ళీ నీ ముక్కు ఎర్రబడితే, కళ్ళు చెమ్మయితే; సారీ! నే తిరిగొచ్చేలోగా తుడిచేసుకో. పాఠాలెన్ని చెప్పినా, ఎంత కరుగ్గా ఆక్షేపించినా నీ నిస్సహాయతా, బాధా చూడాలంటే నాకు గుండెను కోస్తున్నట్టు ఉంటుంది.

————————

ఉత్తరం మడిచి హాండ్ బాగ్ లోకి తోశాను. చిత్రంగా కోపం,బాధా లేవు. కొన్ని విషయాలు తెలుసుకోవటానికి అడుగుతాం, కొన్నిమాత్రం తెలిసీ అడుగుతాం. ఒక్కో సమయంలో పరిష్కారాలు చూపించడం కన్నా సమస్యని ’అర్థం చేసుకోవడమే’ పెద్ద ఊరట. ఈయనింకా రాలేదేమిటా అని ఎంట్రన్సు వైపు చూస్తుంటే మహాబలిపురం వెళ్ళిన మాటీమ్‌మేట్లంతా అప్పుడే హడావిడిగా గ్లాస్‌డోర్ నెట్టుకుని లోపలికొస్తున్నారు.

*********

ఒక చేతిలో టీవీ రిమోట్‌తో, మరో చేతికీ, చెవికీ మధ్య సెల్తో ఇబ్బంది పడుతూ తలుపు తీశాడు హరి, శంఖు చక్రాలతో ప్రత్యక్షమైన విష్ణుమూర్తిలా. అవతల వైపు ఎవరు మాట్లాడుతున్నారో “ఏరా! అప్పుడే నిద్రపోయావా? పదింటికల్లా పడుకోవటానికి, ఇంటితిండి తినడానికీ రాసిపెట్టుండాలి. నువ్వు లక్కీరా.” నా వైపొక అసహనపు చూపు పడేసి తలుపేసుకునే బాధ్యత నాది కాబట్టి ఫోన్‌తో బాల్కనీలోకెళ్ళిపోయాడు. టీవీలో చిన్న పిల్లల పెద్ద తరహా డాన్సుల ప్రోగ్రాం హోరెత్తుతుంది. విసుగ్గా ఆపెయ్యబోయి ఎందుకో వాల్యూమ్ మాత్రం కొద్దిగా తగ్గించి లోపలికెళ్ళాను.

విసుగుకి పైమెట్టు నిర్లిప్తత ఐతే దాన్నెక్కకుండా కొత్తదారిలో జీవితాన్ని మరల్చడం.. నావల్లవుతుందా?

—————–XXXXX——————–

“అంతే! నే రాయగలిగిన కథ. మీ అభిప్రాయం చెప్పనే లేదు?” సెల్లో మరో కాల్ వెయిటింగ్ వస్తుంటే ఇక ఆగలేక అడిగేశా. పూర్తిచేసి పంపి ఇన్ని రోజులైనా ఏం మాట్లాడలేదంటే.. నచ్చలేదేమో!

“చెప్పటానికేం లేదు నాదగ్గర. ఒట్టి ‘థాంక్స్’ తప్ప.” ఆయన మాటల వెనకెప్పుడూ ఒక చిరునవ్వు లయ.

“అదేమిటి?” అయోమయం నాకు.

“నా మీద నమ్మకం, నా మాటల మీద విలువ ఉంచినందుకు..” నన్ను మరో మాట చెప్పనివ్వకుండా లైన్ కట్ చేసిన శబ్ధం.

జీవంలేని హృదయంలో పట్టనంత ప్రేమను నింపి, దాన్ని అనుభవించేలోగానే అధిగమించి ఆలోచించడమూ తనే నేర్పి, అమాయకపు ఉద్వేగాల్ని లొంగదియ్యడానికి వివేకాన్ని అరువిచ్చి,చివరికి కృతజ్ఞతలు కూడా చెప్పుకోనివ్వకుండా దారికి ఎదురొస్తే.

ఈ మనిషినేమనాలి? తప్పించుకుని ఎటెళ్లాలి?

***********

మొదటి ప్రచురణ పొద్దులో

2 thoughts on “రసమయం జగతి

  1. baavindi. itivruttam kottadi kaakpoeyinaa manasuku hattukuneatatlu raasaaru.alaa endukannaanantea : unconditional love and acceptance jariginappudu we accept the person with all his/her follies.ayitea irksome heart gaabatti adi maatimaatikii manani question cheastuntundi.manaki manam samaadhaanam cheppukoeleanappudu, manam eakaantaannoe, manaki uurata nichchea vaari saanidhyaannoe koerukuntaam. anta maatram cheata vaaru goppavaaru, vaariloe ivea loepaalundavani guarantee leadu. kaakapoetea vaari ninchi manam atuvanti situation ni edurukkoemu. endukantea, akkada relationship, inkaa mana expectations kuudaa maari poetaayi.avunannaa,kaadannaa idi vaastavam. anyway, mii saili, character portrayal naaku nachchindi….”ఇవన్నీ అతి మామూలు, చిన్న చిన్న సంగతులు. కానీ పోగొట్టుకున్న మనుషులు, గతంలో వదిలి వచ్చిన స్థలాలూ, జ్ఞాపకాలూ తర్వాత అమూల్యమైన విలువని అపాదించుకుని బెంగగామారి మనిషిని తినేస్తున్నప్పుడు ఈమాత్రం సంగతులే మనుగడకో కొత్త అర్థాన్ని చూపిస్తాయి. అందులోనూ ఉద్వేగాన్ని పంచుకుంటూ, పాతగుర్తులతో మనసు వికలమైనప్పుడు ఊరటనిస్తూ వెంటఉన్న వ్యక్తి వల్ల మరింత తృప్తిగా అనిపించింది.””….విసుగుకి పైమెట్టు నిర్లిప్తత ఐతే దాన్నెక్కకుండా కొత్తదారిలో జీవితాన్ని మరల్చడం.. నావల్లవుతుందా?”

    —————–XXXXX——————–
    “ఒక్కసారి నీలోకి నువ్వు తరచిచూసుకుని నీ ఎమోషన్లకి నీమీద పెత్తనమివ్వకుండా జాగ్రత్త పడమని సలహా ఇవ్వడం..” really good.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: