ఆకాశమంటే పొగకాదు, చెల్లాచెదురైన ధూళి మబ్బుల సమూహం కాదు. పదార్ధమూ, శూన్యమూ కాదు. కొన్ని అస్తిత్వాలు లేవని చెప్పడానికి ఎంత గట్టి ఋజువులుంటాయో ఉన్నాయని తెలుసుకోవడానికి అంతకంటే బలమైన నమ్మకం ఆసరాగా ఉంటుంది; దైవం లాగా, ఆకాశంలాగా. ఆ నమ్మకాల్లో ఉండే గొప్ప నిశ్చింత, నిబ్బరం, ఆనందం, ఆహ్లాదం- ఇవే వాటి రూపాలు, రూపాంతరాలు, అస్తిత్వాలూ. తన రూపరహిత స్వరూపాన్ని నీటిలో చూసుకునే అకాశంలాగే కవిత్వమూ చదువరి పొందే తాదాత్మ్యతలోనే తనని తాను పోల్చుకుంటుంది.
గీటురాయి మీద బంగారపు నిగ్గు తేల్చడానికి అలవాటు పడ్డ చేతికి ఒక మంచి గంధపు చెక్క దొరికినప్పుడు; ఆపరేషన్ టేబుల్ మీద కత్తికి సుతిమెత్తని పూలగుత్తి తగిలితే; రాళ్ళూ, కత్తులూ, కళ్ళద్దాలూ, చేతితొడుగులు అన్నీ పక్కనపెట్టి విమర్శించకుండా, విశ్లేషించకుండా; తాళం పారేసుకున్న ఇనప్పెట్టెలో ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన పసితనంతో కాసేపు కరువుతీరా కబుర్లాడుకుని ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా ఏమీ ఎరగనట్టు తిరిగి పనిలోపడి మామూలుగా అయిపోగలగడం – అప్పుడప్పుడూ మాత్రమే సాధ్యపడుతుంది.
తెగింపుతో- కనబడ్డ ప్రతి ఒడ్డు మీదనుండి జీవితంలోకి దూకటానికీ, అనుభవాల ప్రామాణికత ప్రకారం ఏర్పడ్డ సూత్రాల ఆధారంగా బతికెయ్యడానికీ మధ్య ఏవో కొన్ని సంఘటనలు ఒక సరిహద్దు రేఖను గీస్తాయి. ఒకసారి దాటేసి ఇటు వైపొచ్చాక మాములుగా నడుస్తూ వెనక్కి వెళ్లడం వీలవదు. ఆ గీతకి అనుమానం రాకుండా పెద్దరికంగా నటిస్తూ ఎవరూ చూడనప్పుడు ఒక తొక్కుడు బిళ్లని అటు గిరాటేసి ఒంటికాలిపై గెంతేసి ఒక్క ఉదుటున ఆ వైపుకి దూకెయ్యాలంతే…
ఒక్కోసారి పిల్లలకి తాయిలాలివ్వకుండానే, బతిమాలకుండానే, అసలు వాళ్లని పట్టించుకోకుండా బల్లమీద కాగితాలు పెట్టుకుని మనమేదో రాసుకుంటున్నప్పుడు, ఎందుకో తెలీకుండా, విడి సందర్భాల్లో ఎంత బుజ్జగించినా ఇవ్వని ముద్దొకటి ఊహించకుండా పెట్టేసి తమ దారిన తాము ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు- పదాల పటాటోపం లేకుండా, తెలుసుకోవడం తప్ప మరే ఉద్దేశమూ లేకుండా వాళ్లడిగే ప్రశ్నల్లోని నిజాయితీలాంటి స్వఛ్ఛమైన ప్రేమొకటి మనమీద మనకి వెల్లువెత్తుతుంది.
—-
ఇవ్వాళ నా గీటురాయికి గంధపు చెక్కా, నా కత్తి మొనకి పూలగుత్తీ, గీతకి అటువైపు విసిరెయ్యడానికి తొక్కుడుబిళ్ళా, నా రాతల మధ్యలో ఊహించని విరామంలాంటి లేతముద్దూ ఒకేసారి దొరికాయి.
—-
“క్షణం జీవితం చాలనిపిస్తుంది. కల్పాలు బ్రతికినా చాలదనిపిస్తుంది.” అని బీవీవీ ప్రసాద్ గారి “ఆకాశం” కవితల్లో చదువుతున్నప్పుడు “దాక్కోవడం కవిత్వం, దొరికిపోవడం కవిత్వం” వెరసి ”నాకు నచ్చిన భావాన్ని నీకు నచ్చిన మాటల్లో చెప్పడం కవిత్వం” అని చెప్పుకున్నమాటలు, శబ్ధాలలోపల దాచి కవి పంచిపెడుతున్న కలల్లా కనిపిస్తాయి.
(పుస్తకం.నెట్ లో ప్రచురితం)
“ఇవ్వాళ నా గీటురాయికి గంధపు చెక్కా, నా కత్తి మొనకి పూలగుత్తీ, గీతకి అటువైపు విసిరెయ్యడానికి తొక్కుడుబిళ్ళా, నా రాతల మధ్యలో ఊహించని విరామంలాంటి లేతముద్దూ ఒకేసారి దొరికాయి.”
కత్తిమొనకి పూలగుత్తి ఈ గుంపులోకి ఎలా చేరిందా అని ఆసక్తి!
“తెగింపుతో- కనబడ్డ ప్రతి ఒడ్డు మీదనుండి జీవితంలోకి దూకటానికీ, అనుభవాల ప్రామాణికత ప్రకారం ఏర్పడ్డ సూత్రాల ఆధారంగా బతికెయ్యడానికీ మధ్య ఏవో కొన్ని సంఘటనలు ఒక సరిహద్దు రేఖను గీస్తాయి. ఒకసారి దాటేసి ఇటు వైపొచ్చాక మాములుగా నడుస్తూ వెనక్కి వెళ్లడం వీలవదు. ఆ గీతకి అనుమానం రాకుండా పెద్దరికంగా నటిస్తూ ఎవరూ చూడనప్పుడు ఒక తొక్కుడు బిళ్లని అటు గిరాటేసి ఒంటికాలిపై గెంతేసి ఒక్క ఉదుటున ఆ వైపుకి దూకెయ్యాలంతే”
ఇపుడే మీ బ్లాగ్లోకి ఎంటరయ్యానండి. ఈ వాక్యాలు పట్టేశాయి. అనేక జంజాటాల్ని తొక్కుడుబిళ్ల ఆడినంత హాయిగా చెప్పొచ్చని ఇపుడే తెలిసింది. సాహిత్య పేజీల్లో తమను తాము కుదించేసుకోకుండా జాగ్రత్తపడి అస్తిత్వానేషణ సాగిస్తున్నవారనేకమంది ఉండొచ్చని అర్థమవుతోంది.