నేనడిగే ప్రశ్నలన్నిటినీ వినకు. అనుమానాల వంకతో బుకాయించే వీల్లేకుండా చేసే సమాధానాలు నీకు తెలిసినా చెప్పకు. ’నేనంటే నీకు అయిష్టం కదా? లోకంతో మననిలా కట్టిపడిసేది ఇంకా మిగిలున్న మన పాత్రల నటన మాత్రమే కదా?’ అని మాట తూలిన ఆ ఉన్మాద సమయాల్లో; ఇన్ని యుగాల బట్టీ ఎవరెవరో ఎవరెవర్నో అడక్కుండానే వదిలేసి వెళ్ళిపోయిన ప్రశ్నలన్నిట్నీ, ఒకవేళ అడిగానే అనుకో! విననట్టు ఉండిపో, ’అవున’ని నీకు ఎంత నిక్కచ్చిగా తెలిసినా సరే చెప్పావంటే నామీద ఒట్టే!
అవును భయమే, అడక్కముందే అన్ని నిజాల్నీ ఇచ్చేసేవాళ్లంటే! కాస్త వెలుతురు కావాలంటే ఆకాశాన్ని ఉదారంగా మన దోసిట్లోకి విసిరేసేవాళ్లంటే. అందుకే కాబోలు “నేను పక్షి కోసం ఎదురు చూస్తున్న పంజరాన్ని” అన్న కాఫ్కా గొంతుక వినబడుతూనే ’నాకిదంతా ఇవ్వొద్ద’నే పెనుగులాట త్రిపుర కవిత్వంలో మెలితిరిగింది. “అతను మిగతా అందరివాళ్లలాగే ఉంటాడు/కాకపోతే అతని కళ్ళు ఒక రకంగా చూస్తుంటాయ్/అంతకంటే మరేం లేదు.” అని సర్ది చెప్పుకోడానికి చేసిన ప్రయత్నంలా ఉంటాయి త్రిపుర కాఫ్కా కవితలు. “నీకో నిర్ణీతమైన వస్తువు కావాలనుకుంటే నువ్వో ఖచ్చితమైన మనిషివవ్వాలి. నువ్వా మనిషిగా తయారయ్యాక నీకా వస్తువెలానూ అవసరం ఉండదు.” అన్న జెన్ తాత్వికతలోని శున్యార్ధపు నిశ్శబ్ధమూ; ఆలోచిస్తుండటమూ, ఆలోచిస్తున్నట్టూ నటించడమూ ఒకటేననే కవి ఆరితేరినతనమూ ఉన్న కవితొకటి ఇక్కడ;
ఓ కాఫ్కా బర్నింగ్ థీం
పళ్లమధ్య ఓ సిగరెట్టుంచుకుని
ఓ మోస్తరుగా అలసిన నీ మనస్సు తలుపుల్ని అరమూసి
నాలుగు గోడల్నీ ఓసారి ఖాళీ కళ్లతో చూసి
నీ దహన సంస్కారాన్ని ఇప్పుడు జాగ్రత్తగా చూస్తున్నావ్
చుట్టూ లోపలా చేరిన తొక్కూ తొటారం అంతటికీ
నిప్పంటించి మంటపెట్టి
ఖాళీ గదిలో వున్న నువ్వు
ఒక విసుగు అంచు నవ్వు సగం నవ్వి
ఏకాంతపు కారణం స్పష్టంగా తెలియని నిరాశని
ఒక పొగ వలయంగా గాలిలోకి వదిలేశావ్
ఆ మంటలో కాలుతూ అంతా నువ్వే
పొగలోంచి సగం మాడిన ఎగిరే కాగితపు ముక్కల్లాగా
నీ అస్థిరత్వపు తునకల్లాగా
ఓ సీతాకోక చిలుక హఠాత్ చపలత్వపు ఎగురుళ్ళులా
కాని నువ్వు వాటికి నిజంగా నువ్వు కాని లాగా
నువ్వు అందరికీనూ ఎవరికేనానూ అనేలాగా
చచ్చిపోయిన కాఫ్కా అద్దెగది లోని
యిటుకల్ని వీధిలోకి
ఒకటీ ఒకటీ విసిరి
వేలం వేసి అమ్మినట్లుగా
అంతా అస్థిరంగా ఖాళీగా వేడిగా
దిశలేని ఎగురుడుగా
ఒక మంటగా.
—–**——
వ్యాఖ్యానం
శ్రద్ధగా చదువుతున్న పుస్తకాన్ని అకారణంగా పక్కన పెట్టేసి అన్నాళ్ళూ కుర్చీలకి పట్టిన దుమ్మునంతా దులిపేసి, అద్దాలమీది మరకలు తుడిచేశాక ఇక పుస్తకమూ, ఆలోచనా అనవసరం అనిపించే సందర్భాలుంటాయి. ఇక చెయ్యవలసింది దులపడమూ, శుభ్రం చెయ్యడమూ, సిద్ధం చేసుకోవడమూ తప్ప చదవడానికేం లేదని అప్పటికప్పుడే తేలిపోయే సమయాలొస్తాయి. అప్పుడు మనసు తలుపుల్ని సగం తెరిచేసరికి ముంచుకొచ్చిన అలసటో, మిగతా సగాన్ని తెరవనియ్యకుండా ఆజన్మాంతమూ పడ్డ అవస్థో తేలకుండానే, అప్పటిదాకా ఉంటున్న దేహపుగదిలోని “నాలుగు గోడల్నీ ఓసారి ఖాళీ కళ్లతో చూసి” ఒక నిష్క్రమణకు సన్నాహం మొదలౌతుంది.
కూడబెట్టటమూ, పోగుచెయ్యడమూ తలచుకుని అప్పటిదాకా గర్వంతో నవ్వుకున్న నవ్వు కాస్తా విసుగు స్వరంలో అంతమౌతుంది. తెలుసుకున్నవీ, నేర్చుకున్నట్టు నటించినవీ అన్నీ పేరుకుపోయి అస్తిత్వ రాహిత్యాన్ని దాదాపు అసాధ్యం చేస్తుంటాయి. తేలిగ్గా నవ్వుతూ, నడుస్తూ ఖాళీ చేతులూపుకుంటూ వెళ్ళిపోవాలంటే ఇన్నాళ్ళూ అవిరామంగా మేట వేసుకున్నదాన్నంతా, వెలుగుతున్న సిగరెట్టు మొనతో నిర్మోహంగా అంటించేసి “ఏకాంతపు కారణం స్పష్టంగా తెలియని నిరాశని/ఒక పొగ వలయంగా గాలిలోకి” వదిలేయక తప్పదప్పుడు.
నిలకడలేనిదీ, నిలవలేనిదీ అంతా కరిగిపోయాక, బరువులేనివన్నీ గాలివాటున తేలిపోయాక, ఉలిపిరి కాగితాల్ని ఊదారంగు మంట మసిచేసి వదిలాక మిగిలిపోయే అక్షరాలు, ఊహలు ఎవెర్నుండి ఎవరిపైకో “ఓ సీతాకోక చిలుక హఠాత్ చపలత్వపు ఎగురుళ్ళులా” వెళ్ళి వాలిపోతాయి. ఆ ముగిసిపోయిన అస్థిరత్వం ముక్కలుగా, నీలోపల గతించిన నీలాటి మరికొందరుగా, మరికొందరిలో ఇంకా మిగిలిపోయిన నీ ఆనవాళ్ళుగా, నువ్వొకప్పుడు ఉండి వదిలిపోయిన మరకగా, ఎప్పటికీ లోకంనుండి తుడిచెయ్యలేని చరిత్ర గుర్తుగా మిగలక తప్పదు.
వీలునామాల్లో చేరని విలువలేని వస్తువులు, ప్రచురించడానికి ఇష్టపడని డైరీలూ మాత్రమే వదిలేసి, మౌనంగా రాసుకోవడం తప్ప మరేం చేతగానితనానికి క్షమాపణలు కూడా చెప్పకుండా, నిర్లక్ష్యంగా తెల్లవారు ఝాము నిద్రలోంచి నడుచుకుంటూ నిశ్శబ్ధంగా వెళ్ళిపోతాడు రచయిత. రేపటి తరాల్లో ఎవరికో ఇతను వదిలెళ్ళిన తలరాతలు ఆ ఖాళీ గదిలో అదృశ్యంగా “దిశలేని ఎగురుడుగా/ఒక మంటగా” కదులుతుంటాయి.
——*—–
(సారంగ జూన్ 2013 సంచికలో)