గుండెపొదిలోని శీతాంశుశరాలని చూసి జ్ఞాపకాల పక్షులు బెదురుతూ వచ్చి ఓ వరసలో కూర్చున్నప్పుడు- చీలిన చంద్రబింబాల్లాంటి తన అక్షరాల అరచేతుల్లోని మబ్బు పింజలతో వాటికి నుదురు తుడుస్తాడు కవి.
అన్నిటికన్నా భాషే ఎక్కువగా బాధించిందని అశ్రురహిత దుఃఖంతో లోలోకాలుగా ఊగిపోతుంటాడు. “నీతో ప్రత్యేకంగా మాట్లాడటం నీకే కాదు నాకు కూడా శిక్షే, ఐనా నాలో ఎవరు ఆమెకు దాసోహమయ్యారో తేల్చుకోవాలి, గులాబియానంలో వెళ్ళిపోతున్న హేమంతానికి పుప్పొడి దప్పిక తీర్చిమరీ పంపాలి” అంటూ కొలనుకీ, ఏరుకీ నచ్చజెప్పి, జలజలా అవి దారికడ్డు తప్పుకున్నాక “రెప్పలకింద దాచుకున్న రెండు పావురాల్నుండీ ఇక రహదారులేవీ తప్పించుకోలేవు, అందుకేగా ఒక్క కళ్ల కోసం ఈ సమస్త దేహాన్నీ మోస్తూ తిరుగుతున్నది.” అనుకుంటూ వివశత్వాన్ని నిభాయించుకుంటాడు.
పసునూరు శ్రీధర్ గారిలోని కవి “కొలనులోకి చేతులు జొనపకు పొద్దున్నే/అద్దం ముక్కలు గుచ్చుకుంటాయి” అని ఎవరో చెప్పగా విని మరో దారి లేక తన చుట్టూరా గాలిని వృత్తంగా తెగ్గోసి ఇక స్పృశించడానికేం లేదు అంతా స్పర్శాలోలత్వమే అనే నమ్మకం కుదిరాక, గిరులమీంచి దూకే భీకర ప్రవాహంలా కాక మోహపు పెదాల్ని తడిపే నాలుగైదు వానచినుకులుగా కవిత్వాన్ని చిలకరిస్తారు. ఆ వానలో కురిసిన అనేకవచనాల్లోని ఒక కవిత్వపు చినుకుని ఇక్కడ కొనగోటితో మీటుకుందాం!
మాయాదర్పణం
కన్రెమ్మల మీద వాలి
వడ్రంగిపిట్ట కోనేట్లో నీటిని చిలకరిస్తూ ఉంటుంది
ద్రవ వృత్తాలు ఒక కేంద్రం నుండి
వీడ్కోలు తీసుకున్నట్టుగా మభ్యపెడతాయి-
చీకటి కొమ్మకు వేలాడిన
దేహపంజరంలోకి
పొగవెన్నెలలా చొరబడిన పక్షి
తెరుచుకునే ఉన్న గవాక్షాల వంక కన్నెత్తైనా చూడదు!
వాక్య సర్ప పరిష్వంగంలో
చేతులు రెండూ వెనక్కి చుట్టుకుపోతాయి
రాత్రిని రెండు ముక్కలు చేసిన
దుప్పటి కిందే విశ్వమంత రాత్రి-
బయట చిన్ని శకలమొక్కటే
కాలిన కాగితంలా మబ్బుల మీంచి
దొర్లుతూ పోతుందనుకుంటా!
రావిచెట్టు గాలొక్కతే తురాయి శిరస్సును
జోకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది-
ఒక తులాదండ భారంతో
భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది
మాయాదర్పణమై కోనేరు
మాంత్రికుడినే పాత్రను చేస్తుంది!
వెలుగురేకలు వెదజల్లబడిందాకా
స్వీయబంధనంలో పక్షి
తలమునకలవుతూనే ఉంటుంది-
***
వర్షధారకీ కోనేటి అలకీ మధ్య చినుకుల కప్పగంతులు, పిట్ట ముక్కుకీ చెట్టు బెరడుకీ మధ్య పుట్టే టకటక శబ్దం, గులకరాయి కదలికకీ నీటి నిద్రకీ మధ్య కలల్లాగా వలయాలు- మాయేనా?
దృశ్యాలపై మెత్తగా మూత పెట్టే పూరెమ్మల్లాంటి కనురెప్పలూ, చిప్పిల్లిన తుంపరని పైన చల్లుకునీ తడవని తామరాకులు, ఆకుకదలికల సడిలో రాలిపడే పక్షి ఈకలూ- దర్పణాలా?
ఆలోచనలు ఒక మూలం దగ్గర మొదలై వేటికవి సుడులుగా తిరిగి, కన్నీళ్ళూ వేదనా ఒక ఘటనలోంచి ఊరి బయటపడక లోలోపల ఆర్తితో లుంగలు చుట్టుకుంటూ “ద్రవ వృత్తాలు ఒక కేంద్రం నుండి వీడ్కోలు తీసుకున్నట్టుగా మభ్యపెడతాయి.” లాంతరు చిమ్నీ లోపలివైపు మంచు ఆవిరి తుడిచి ఒత్తి అంటించిన కాసేపటికి మెల్లగా వెలుతురూ, సెగ పరచుకునే వ్యవధిలో చల్లటి స్తబ్ధత కరిగిపోయి, చేతన మిణుకుమనే రెక్కలను పంజరపు గదినిండా చాపుకుని వ్యాపించి “తెరుచుకునే ఉన్న గవాక్షాల వంక కన్నెత్తైనా చూడదు”.
పెగలని పదాలు లోలోపల ఒకదానికొకటి అల్లుకుని చిక్కుపడిపోగా, తెమిలిన వాక్యాలు, అనేసిన మాటలు, చెప్పేసిన పంక్తులు బయటికొచ్చెయ్యడం వల్ల పరిపూర్ణమయిన బలంతో వక్తను పెడరెక్కలు విరిచి కట్టి పెనవేస్తాయి. చేతుల ప్రమేయం లేక, చేతలుడిగి మాట్లాడ్దం తప్ప మరేం చెయ్యలేని నిస్సహాయత ఆ బంధనం పొడుగునా పామై జలదరింపజేస్తుంది. ఆ స్థితినే కాబోలు “వాక్య సర్ప పరిష్వంగం” గా భావించి అప్రమత్తుడవుతాడు కవి.
రాత్రివేళ లోకంలోని చీకటంతా దుప్పటి కిందా, కళ్ల వెనకా చిక్కనై మిగిలిపోయిన ఏ కాస్త ముక్కో పల్చగా గది బయటి వెన్నెలకింద గాఢత కోల్పోయి లేతరంగుగా “కాలిన కాగితంలా మబ్బుల మీంచి” తేలుతూ ఉన్న సమయం. ఊరంతా సద్దుమణిగి జోగుతున్నప్పుడు కాపలాగా ఒక్క రావిచెట్టు ఆకుచప్పుళ్ల అడుగులతో పహారా కాస్తూ నిద్రపట్టని ఏ ఒంటరి పిట్ట తలనో గాలి వేళ్లతో మెత్తగా నిమురుతుంది.
త్రాసులో పైకి లేచిన వైపుని విశ్వాన్ని ఆవరించుకున్న శూన్యానికి వదిలేసి, బరువెక్కిన వైపు మాత్రం తనవంతుగా తీసుకున్న భూమి కుంగిపోకుండా తులాదండ న్యాయం కోసం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ అద్దంలా ప్రతిబింబాల్ని చూపే కోనేటికి నీడల్ని మోసి విసుగొచ్చిందేమో! ఒక మాయగా, అనూహ్యంగా తానొక నీటిబొట్టుగా మారిపోయి ఒడ్డుపై నడుస్తున్న మనిషి కంటిపాపల్లో దాక్కుంటుంది. అలాంటప్పుడు “మాయాదర్పణమై కోనేరు మాంత్రికుడినే పాత్రను చేస్తుంది!” అని ఊహించడం ఒట్టి ప్రేలాపన కాదు.
“చీకటి కొమ్మకు వేలాడిన దేహపంజరంలోకి పొగవెన్నెలలా చొరబడిన పక్షి” తిరిగి తెల్లవారు ఝామున వెలుతురు కిరణాలుగా, రెమ్మలుగా, గింజలుగా అన్ని దిక్కుల నుండీ వెదజల్లబడటం చూసి తన రెక్కల దుప్పటిలో చుట్టేసుకున్న దేహాన్ని బంధవిముక్తం చేసి బయటికి ఎగరవేస్తుంది.
(సారంగ ఆగస్టు 2013 లో ప్రచురితం)
One thought on “అగరుపొగల వెచ్చలి”