కొన్ని త్రిపుర సందర్భాల్లో

త్రిపురని చదవడమంటే హాయిగా, అందంగా, కులాసాగా ఈలపాట పాడుకుంటూ అద్దంలో చూసి తల దువ్వుకోవడం కాదు. సూటిగా అద్దాన్ని గుద్దుకుని బద్దలు కొట్టుకుని లోపలికెళ్తూ గాజుముక్కల్ని జేబుల్లో కుక్కుకోవడం. త్రిపురని చదవడమంటే కథల్లో శైలినో, వస్తువునో, సందేశాన్నో నేర్చుకోవడమో రచయితని తెలుసుకోవడమో కాదు, నీలోపలి టెక్నిక్‌నీ నీలోలోపలి కండిషనింగ్‌నీ కడిగి పారేసి నిన్ను నువ్వు చదవడం నేర్చుకోవడం, అసలు తెలుసుకోవడమంటే ఏమిటో తెలుసుకోవడం. అసలు త్రిపురని చదవడమంటే మళ్ళీ మళ్ళీ శక్తి కూడగట్టుకు తెంపరిగా చదవడం అంటే సముద్రాన్ని ఉన్నపళాన తాగేసి కన్నీళ్ళుగా ఎప్పటికీ బయటికి పంపుతుండటం.

ఫార్మాలిటీస్‌కి అలవాటు పడి ఆ రాతల్ని కథలని పిలిస్తే అవొప్పుకోవు. తనలో తను మాట్లాడుకుంటూ, తన్ని తానే ‘నువ్వ’ని వేరు చేసి పిలుచుకుంటూ అనంతంలోకి విముక్తమయ్యే అంతస్సంఘర్షణలవి. తనకి తాను చెప్పుకునే మాటల్లోని నిజాలు, నిజాల్ని వెతుక్కుంటూ దొర్లిపోయే అబద్ధపు మాటల్లోని మెలికలు, మలుపులు, నిజానికి చేరుకునే దోవలో వగలు పోయే అబద్ధాల ఆకర్షణలోని వివశత్వాలు. ‘వచ్చిన పనేదో తెలుసుకోవాలి. అదవగానే దాటిపోవాలి’ అని స్టేట్మెంటిచ్చిన మరుక్షణంలోనే మణికట్టుపై గట్టిగా గిల్లుకుని ‘డ్రామాలాపి, వేషాలు తీసి ఆలోచించు’ అనుకోగల స్పృహపూర్వకమైన సంజాయిషీలు. కత్తిమొన లాటి నిజం బయటికొచ్చే లోపు ఎన్ని డొంకల్ని దాటుకుని ముళ్లపొదల్ని చీల్చుకుని మొద్దుబారిపోయి మురికి అంటించుకుని బయటికి ఎలా వస్తుందో చూసుకో పొమ్మనే హెచ్చరికలు. చివరికి నీ పేరు నువ్వు చెప్పుకోవడంలోనే ఎన్ని హావభావాలు ఎంత ఉత్ప్రేక్ష, పేరుతో పాటు మరెన్నో ధ్వనింపజేసే అతిశయోక్తి పలుకులు అవసరమా నీకు అన్న నిలదీతలు.

The only reading is re-reading కొన్ని పుస్తకాల విషయంలో the only living is re-living the moment లాగా అన్నమాట. మూస కథనాలకి, దాదాపు ఒకే లాటి శిల్పానికి అలవాటు పడిన ఇన్నేళ్లకి మొదటిసారి త్రిపురని చదివినప్పుడు ఎలా ఉంటుందంటే — మీగడ తెలుపు దిండ్లపైన సింహం తల, సర్పంలాగ కదిలే గ్రేస్, కామా లాగా నుదుటి పైకి పడిన జుట్టు పాయ, పేక కలిపినట్టు ఆలోచనల్ని కలపడం, మూతి పక్కనుండి ‘నాకేమీ ఆశలు లేవు’ అన్నట్టు దిగజారుతున్న మీసం, పిస్టల్ లాగ పొట్టికాళ్ళు ఆడిస్తూ నడిచి రావడం లాంటి ఉపమానాలతో, ‘నేపాలీ కళ్ళు ఏం చెప్పవు/ కళ్ళు సెయింట్‌వి, పెదవులు సిన్నర్‌వి/ శృంఖలాల కౌర్యం ఎంతో, స్వేచ్ఛ కూడా అంత భయంకరంగానూ ఉంటుంది,’ వంటి గమనింపులతో దృశ్యాన్ని కేవలం మరో దృశ్యం తోనో, వస్తువు తోనో పోల్చినట్టు కాక వాటి మూలాల్ని, స్వభావాల్ని , గుణాల్నీ సంస్కారాల్ని ఒక్కమాటలో ఊహకి అందించడం లాగ ఉంటుంది.

త్రిపుర బాల్యాన్ని ప్రేమించాడా? కాదేమో నిరంతరమూ బాల్యాన్నే జీవించాడేమో! వార్నిష్‌ని గీకి అడుగున ఏముందో చూడాలనుకునే కుతూహలం, అకారణంగా దారిన పోయే చీమని నలిపి చంపేసే అడవితనం, చేస్తున్న పనుల మధ్య, తెలుసుకునే విషయాల మధ్య సంబంధం లేని అధివాస్తవికతనం, జీవితానికంతటికీ సరిపడా ప్రేరణల్ని, అలవాట్లనీ మైక్రొస్కోపిక్ అద్దాల వెనక అణువులుగా పోగుచేసుకుంటూ ఏమెరగనట్టు నటించే తియ్యని కుట్ర — వీటన్నిటి కోసం బాల్యాన్ని ఒక లోపలి అరలో ఎక్కడో రహస్యంగా దాచుకునే బతికాడేమో!

రంగూన్‌లో ఇన్యాలేక్ కెరటాలు, మసక చీకట్లో గంగలో కదిలే పడవలు, విశాఖలో కొబ్బరిచెట్ల వెనక సూర్యోదయాలు, అరచేతి తాకిడితో అట్లాస్ పరిభ్రమణాలు, వీటన్నిటి మధ్యనుండీ కాళ్లకి చుట్టుకుంటున్న చీకటిని విదిలించుకు నడుస్తూ ఏవిఁటీ చెప్పి వెళ్ళాడు? సుఖమూ దుఃఖమూ అనుభవమూ వెంటనే జ్ఞాపకాలుగా మారుతూ ఆ మారుతున్న క్షణంలో వాటిని అనుభవాలుగా కాక విలువలుగా, పాఠాలుగా, గతంగా మార్చుకుంటూ జీవితాన్ని నిర్మించుకోవడం, లేక అవన్నీ కలిసి జీవితంగా, వ్యక్తిత్వంగా నిర్మించబడటాన్ని అతి దగ్గరగా చూసుకోవడం ఎలాగ, అనేనా?

నీది ఆకలి కాబట్టి తీర్చుకుంటావు. మరి నాది దాహం, ఎవర్తో చెప్పుకోను? అన్నవాళ్ళతో దేని గురించీ కబుర్లాడాడు? ఏకాంతమూ, నిశ్శబ్దమూ, బద్ధకమూ కుంగతీసి భయపెట్టి తరుముతాయి మనుషులను వలయాల్లోకి పనిలేని పనుల్లోకి. కరడు గట్టిన దయలోనూ, ఘనీభవించిన కౄరత్వంలోనూ, అల్పత్వాన్ని, అధైర్యాన్ని సహించలేని ఉక్కు పిడికిళ్ళలోనో ఉంది లోకం నడక అంతా, చరిత్ర గతి అంతా. మొత్తం మీద చూసినప్పుడు జీవితం అర్ధరహితమే ఐనా ఏ అనుభవానికది చాలా అర్ధవంతంగా,తీవ్రంగా, లోతుగా మూలాల్ని కదిలిస్తూ పెకలిస్తూ, ఊపుతూ ఉంటాయి. జీవితంతో దాని సాఫల్యంతో సంబంధం లేకుండా ప్రతీ అనుభవానికీ క్షణానికీ అస్తిత్వానికీ వాటి విలువ, ప్రత్యేకత, పవిత్రత వాటికుంటాయి. దూరం నుంచి ఏ అగాధం లోంచో, ఏ కొండకొస పైనుంచో చూస్తే మార్పులు మార్పుల్లాగ అనిపించవు అని కూడా చెప్పదలచుకున్నాడేమో!

పెద్ద గడకర్రొకటి నిలబెట్టి, అది నిలబడే లోపే పైఅంచుని పట్టుకుని పిల్ల కాలవ అవతలి గట్టుకు గెంతేసినట్టు- మాములుగా అందరిలానే హోటెల్లో కూచుని ఎవరి కోసమో ఎదురు చూస్తూ పన్లో పనిగా ‘ఈ కప్ లోది కాఫీ కాదు ఉత్త గోధుమరంగు వేడి’ అంటూ అస్తిత్వ సిద్ధాంతాల అవతలకి దుమికేస్తాడు. నిలువెత్తు శూన్యం — ఎన్ని అలవాట్లు కలిస్తే జీవితాన్ని నింపుతాయి? ఎడ్వెంచర్, తారుమారు చేసే మార్పు, ఇవన్నీ జీవితాన్ని త్వరగా అర్ధం చేసుకునేందుకు. లోతు పొడవూ వెడల్పూ కొలుచుకునేందుకు పనికొస్తాయని, నిజంగానే పనికొస్తాయేమో అని నమ్మకంగా అనుమానించాడా?

త్రిపుర వెతుకులాట — ప్రతీ ప్రశ్ననీ మరో పెద్ద ప్రశ్నతో రద్దు చేసి చివరికి మిగిలిన ఒకే ఒక్క ప్రశ్నను చూసి తనపై తాను జాలితో నవ్వుకుని నలుపు తెలుపుల్ని నిండుగా కలిపేసి చివరికి అసలు నేనెవరని? నేను, ఎవరు? నుదుటిపై పుట్టుమచ్చనా? కోటేరుగా ఉన్న ముక్కునా, కోటానుకోట్ల కణాల్లోంచి ప్రమాదాల్ని తప్పించుకు పుట్టేసిన ఒక… ఎవరెవరివో పూర్వీకుల పోలికలు ఆనవాళ్ళు వారసత్వాలు నానిండా. వాటిని ధ్వంసం చేసుకుంటూ, కూల్చుకుంటూ, సహజాతాలుగా వచ్చిన వాటిని నాశనం చేసుకుంటూ నేను మాత్రమే అవ్వగల నేను కోసం మరెవరి ముక్కో, గొంతుకో, అలవాటో, మూర్ఖత్వమో తెలివో సొంతమని నటిస్తూ — రుద్దబడిన విలువల్లో, రూపంలో అచ్చులో నొక్కబడిన నేను కాని నేను కోసం.

అసహనం — జీవితంలోని స్టేల్నెస్, రోజూ పొద్దున్నే ఒకేవేళకి రోడ్డు పైనుంచి వినపడే అదే తోటకూర కేక. ‘చచ్చిపోలేదు కానీ జీవితంలో మిగిలి ఉంది ఏదీ లేదు’ అనే మాట దగ్గర మొదలయ్యే ఆలోచనల గొలుసులు. ఒకేలా, అదేలా రోజూ బతికేసి తుప్పు పట్టిపోయిన ఉదయాలు. తవ్వుకున్న కన్నాల్లో బొరియల్లో నివసించే జంతువుల్లాగ బతకడాన్ని దాటి పైకెళ్లలేని మనుషులు, ఇలాగేనా ఇంతేనా అనే వేదన.

విషాదం — ఎర్రటి గాజుల వరసలో ఒక్కోదానిపై ముద్దిస్తున్నప్పుడు నీలోపలి ఏ గదిలోంచి ఎవరిదా ఏడుపు? ఎవరు నేర్పారు నీకు అన్నిటికీ చివరికి ప్రేమకీ, ప్రేమించానని చెప్పడానికి కూడా గిల్ట్ ఫీలవుతూ బతకమని. ఎవరు శాసించారిలా చిక్కు ముళ్ళు వేసుకుని బిగుసుకుని ఆ ఊపిరాడనితనమే సంస్కారమని? ప్రేమ, ఏడుపూ, కరుణా, జీవించడం, ఆత్మహత్య- the sincerest form of self-criticism ఇవన్నీ సిన్ అనీ?

అనివార్యత — ప్రేమకీ ద్వేషానికీ కారణాలు ఉన్నాయా? ముందవి పుట్టేస్తాయి. ఆనక తీరిగ్గా కారణాలు వెతుక్కుంటాం, ఎప్పుడో మెరుపుల్లా మెరుస్తాయి. ఇదీ అని చూసే లోపు మబ్బుల మధ్య మరక మిగిల్చి మాయమౌతాయి.

వేదన — బాధ ఉన్నందుకు కాదు అదెందుకో తెలీనందుకు. చివరికి కారణాలు వీగిపోతాయి ద్వేషం మాత్రం మిగుల్తుంది.

ఏమిటివి?

త్రిపుర ప్రతీ కథా ఒకదానికొకటి గొలుసులతో తగిలించిన రైలు పెట్టెల్లా, ఒక్కో కథా స్టేషను లాగా కొన్ని పాత్రలు చీకట్లో స్టేషన్లో వెలిగే దీపాల్లాగా, కొన్ని భాగాలుగా విడిపోయిన త్రిపుర అస్తిత్వం లాగా, ఆ అక్షరాలన్నిటిదీ కలిపి ఒకటే ఆలోచన, ఆవేదన ఆత్మలాగా…

శరీరమెంత బాధ పెట్టగలదో తెలిసి, గతమెంతలా గాయపరచగలదో అనుభవించి, ఆశ, సంతోషం కోసం వెంపర్లాట ఏ దారులు చూపిస్తాయో అర్ధమయి, తప్పులు ఒప్పుకున్నట్టు, గతాన్ని అనుభవపు దీపంగా వెలిగించుకుని ఆ వేడిలో రెక్కలు కాల్చుకుంటూ జ్ఞాపకాల సౌందర్యం నుంచి ఆత్మని కాపాడుకుంటూ మిగిలిన శేషప్రశ్నల కెరటాల్లోకి మనల్ని ఒక్కతాపు తన్నేసి ఆ నురగల విషాదంలో, సుస్పష్టమైన అయోమయంలో మనం ఏడుస్తుంటే, గమనించనట్టే “ఏదైనా దొరికిందా? దొరకదు నాకు తెలుసు. అదే లోకన్యాయం కూడా. మిగతాది మనం పర్గటోరియాలో కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. ఐనా, జవాబెందుకు నాకు?” అనేసి కర్టసీ కోసమైనా వెనక్కి తిరక్కుండా ‘హెమింగ్వే వాక్యం లాగ, నీట్‌గా బ్రిస్క్‌గా ఓవర్ టోన్స్ ఏమీ లేకుండా’ నడిచెళ్ళిపోయిన నిత్యపథికుడు త్రిపుర.

One thought on “కొన్ని త్రిపుర సందర్భాల్లో

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: