పదార్ధంతో చైతన్యమూ పనితో బద్ధకమూ సంధి చేసుకున్న సాయంత్రపు వంతెన మీది చివరి వెలుతురు చుట్టూ రెక్కలు చాపుకుని వలయాలుగా తిరిగిన పావురమొకటి వేసటగా వాలిపోయాక ఏకాంతం సంగీతంగా మారే సుతిమెత్తని సవ్వడిని నింపుకోవడానికి సంచీలోని సంపదనంతా ఒలకబోసుకున్న వాడొకడు…
సంధ్యా సముద్రమూ చెరోవైపు నుంచి మీదకొచ్చి పడుతుంటే, తిరిగెళ్లే ప్రతి అలతో పాటు ఇసుకలోకి కూరుకుపోయే పాదాల్ని ప్రయాసతో పైకి లాక్కుంటూ దీపస్థంభానికి చిక్కుకుని రెపరెపలాడుతున్న గాలిపటంతో గుసగుసగా అన్నాడు నాకు తెలుసు ఓడిపోవడానికే మొదలెట్టాను ఈ ఆటని ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిగా నీ విషాదం మాత్రమే తోడుగా నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోక తప్పదని తెలిసీ కలిశాను నిన్ను వేసారేదాకా వెతుక్కుని మరీ!
ఒక్క నీటిచుక్కనీ కనపడనీయని వేదన మనసంతా గుర్రపుడెక్కలా పరచుకొని సలుపుతోంటే పగలంతా పరాయిదైన సగం ప్రాణాన్నిఆకలీ ఆరాటాల సరిహద్దు మీద రాబట్టుకోలేక చీకటిని పిలుస్తున్న చిట్టి నక్షత్రాలేవో దిగులు వెలుగులో ఏడుస్తున్నప్పుడు కొత్తవేపపూల వాసనలు పొద్దెరుగని పిచ్చితో చేలమీదుగా తోటల మీదుగా అన్ని దారుల్లోకీ ఒకేసారిగా పాకేవేళ…
సంతకం తప్ప మరొక్క అక్షరం కూడా లేని ఉత్తరాల్లాంటి రహస్యాల్ని కనపడ్ద ప్రతీ పొదలోకీ జారవిడుస్తూ సాగుతున్న రాత్రికి దారి చూపడానికి కోనేటి మెట్ల మీద నుంచి అరిటాకు దొప్పలో ఒక పద్యాన్ని నీళ్ల మీదకి వదిలేసి కమ్ముకుంటున్న శబ్దసమూహల్లోంచి ఎలానో విడిపడి గతజన్మలో పాడుతూ అసంపూర్ణంగా వదిలేసిన పదాలేవో వెంటపడి తరుముతున్నట్టు వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు.
ఆ చిట్టచివరి ఆనవాలు మిగిల్చి అతనేమయ్యాడో!
పద్యం మాత్రం రాత్రింబవళ్ళూ రొదగా వినబడుతూనే ఉందని ఆ దారి మీదుగా వచ్చినవాళ్లు చెబుతుంటారు.
(ఈమాట జులై 2013 సంచికలో ప్రచురితం)
‘very good website’
ayurbless team
visit my ayurveda free treatment website: http://ayurbless.blogspot.in