“అట్లా అని పెద్ద బాధా ఉండదు” అవే అవే పాదాల్ని పదే పదే బెంగగా కలగలిపి పాడుకునే మెలాంకలీ లోని నిరీహ తప్ప ఎక్కువగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. బహుశా అది “కేవలం దుఃఖానుభూతినైనా పొందలేని డెస్పరేటశక్తత“ కూడా కావచ్చు. మండే వెల్తురు తప్ప కప్పుకోని పూలనీ, అనాచ్ఛాదిత స్వేచ్ఛతో అహరహం చిగుర్లెత్తే సమస్త ప్రకృతిలోని జీవాన్నీ తనలో నింపుకోలేక ఆర్తిచెందిన కవి విషాదం కావచ్చు. “విషాదంలోంచి దుఃఖంలోకి/దుఃఖం లోంచి శోకంలోకి” ఆరోహించే లక్ష సారంగీల వేదనారాగాలు కావచ్చు.
“చితి-చింత” సంపుటిలోని “మో” కవితల్లో వికసించిన మందారాల్లా, “ఈ దుఃఖానికి మరికొంచెం వెలకట్టండని దీనంగా ఏడుస్తూ” మందారాలమ్ముకునే వాడి విఫల కాంక్షల గుర్తుల్లా, “ఎగరబోతూ ఎగరబోతూ నేల కూలిన గాలిపటం” పైని రికామీగాలి మోసుకొచ్చిన పాటల్లా, అట్టడుగున జివ్వున సెల ఊరుతున్న చెలమల్లా, పొడవూ వెడల్పుల కొలతలన్నిటినీ లోతులుగా మార్చుకున్న అభివ్యక్తులు కొన్ని బృందగానం చేస్తుంటాయి. “ఎంతో ఎత్తు మీంచి నీచంగా కిందికి చూచే ఆత్మ, ఏ దుఃఖాన్నైనా విదుల్చుకోగలదా? ” అని ప్రశ్నిస్తూ “చెప్పుల్లేక వేయించిన ఇసుక మీద పరపరా నడిచెళ్ళే” మో కవితా భావాల బహుముఖ రూపాల్లోని ఒక ముఖాన్ని ఇక్కడ కాసేపు చూసిపోదాం.
త్రికాల బాధితం
మనసు నుంచి బయటకు తప్పుకోవాలి
నేను
ఇంటిముంగిట నాల్క చాచి పడుకుని రొప్పే
కుక్క
లాగా కడకొక ఎంగిలి విస్తరాకేనా ఎవరేనా విసిరేస్తారని
చూస్తూ ఉండాలి కడు జాగరూకతతో
నిశ్చేష్టిత నిర్భాషిణి నిత్యం కుంగుతూండే సరస్సు మనసు
చూస్తూ ఉండాలి ఏ కమలం ఉబుకుతుందో పైకి.
ఒంటి మీద ఒక ఈగేనా వాలినా గుండ్రంగ గంతులు వేయాలి.
పైన బస్సు
కింద రైలు
మధ్య వంతెన
ఈ రెండూ
ఇహ పరాలు కోసుకున్న క్లారినెట్ స్పీడ్
రైలు నెత్తిమీద వొంతెన విరిగిపడిన జ్ఞాపకం.
ఇహం పొట్టి
పరం దూరం
వేగం ఒకటే
టైమ్ వేరు
టెన్స్ వేరు
ట్రైన్ పొడుగు
టెన్స్ పొట్టి
టైమ్ పొడుగ్గా పర్చుకున్న వెడల్పు.
వర్తమానపు విత్తు భవిష్యద్వృక్షం.
కొన్నాళ్లకా మర్రిచెట్టు భూతం.
ఆ మర్రి, రావి, జువ్విచెట్ల జుత్తు ఆకాశంలోకి
మనకిప్పటి భూతం భూమిలో వేళ్ళు.
భావం మారదు స్వభావం మారదు
పదం మార్తుంది క్రియాపదం మార్తుంది.
ఉదాహరణని క్షమించాలి
ఉదాసీనం పనికిరాదీ విషయాల్లో.
If you wrote to me tomorrow morning
I would kiss you in the evening.
వాన కురిస్తే మాత్రం వీలుండదు.
వీలు కుదరలేదూ అంటే వాన కురిసిందీ అని అర్ధం.
నీ ఉత్తరం, వర్తమానం లేదో
ఇట్లా వర్తమానం లేని నాలాటివాడు
గతంలోకీ భవిష్యత్తులోకీ, ఇంట్లోంచి బయటికీ
తిరుగుతూ నాల్క చాచుకుని కాపలాకాస్తుంటాడు
ఇహానికీ పరానికీ చెడుతూ.
—
వ్యాఖ్యానం:
మనసు- అత్యాశలు పోయి ఆకాశాల్లో తిరుగుతుంది. నిండుపచ్చటి ఆకులపైని ఎండమబ్బుల మిలమిలల్ని మేసి మనసు నింపుకుంటానంటుంది. సాధ్యాసాధ్యాలు, అవసరపు ఆకలీ, పగిలే దేహమూ, పోయే ప్రాణమూ లెక్ఖలేదు. మరి ఏదోలా బతకాలంటే, లేకలేక ఉన్న ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే బయటపడక తప్పదు మనసునుండి. ఊహల మత్తులో మూసుకుపోతున్న కనురెప్పల్ని నిలిపి- ఇటు చూడు దారిదే అని ఉసిగొల్పి చూపుల్ని తిప్పి “కడకొక ఎంగిలి విస్తరాకేనా ఎవరేనా విసిరేస్తారని చూస్తూ ఉండాలి కడు జాగరూకతతో.”
కుంగిపోతుంది మనస్సు అట్టడుక్కో లోలోతుల్లోకో, మరింత కిందకు కుదించుకుని ఏ పాతాళగంగలోనో మునగొచ్చనే ఆశతో లోపలికి అలలెత్తే సరస్సు లాగా. ఉపరితలం మీద మాత్రం “నిశ్చేష్టిత నిర్భాషిణి” లా నిశ్చలమై కనపడుతుంది. “ఏ కమలం ఉబుకుతుందో పైకి” అనే ఎదురుచూపుకి ఆయువు అనంతం కాబట్టి దొరికే ప్రతీ గడ్డిపువ్వునీ పోగు చేసుకుని, తాకే ప్రతీ మాములు గాలిని లోపలికి నింపుకుని, చివరికి “ఒంటి మీద ఒక ఈగేనా వాలినా గుండ్రంగ గంతులు వేయాలి” అని సమాధానపడుతుంది.
రెండు వేగాల మధ్య తేడాని సమన్వయం చేస్తూ ఒరుసుకుపోనివ్వకుండా మధ్యలో అడ్డుపడి నడిపే వంతెనలాంటి ఆధారమొకటి కూలిపోతే- సుఖానికి దుఃఖానికీ, ఉండటానికి లేకపోవడానికి మధ్య దూరం ఒక్క ప్రమాదమే కావచ్చు. కాలం నుంచి కాలానికి దూరం నుంచి దూరానికి చేరుకుని అక్కడ నిన్నని ఇక్కడి రేపటిగా మార్చే రైలు పొడుగు ముందు “టెన్స్” ఎలానూ పొట్టిగా కుచించుకు పోతుంది.
ఒకనాడెవరో నాటిన విత్తొకటి చరిత్రలోతుల్లోకి విశాలంగా వేళ్ళూని నేడొక మహావృక్షపు గతాన్ని సగర్వంగా కొమ్మకొమ్మకూ చాటుతుంది. కానీ ఏమో! మరెవరికో ఏ దారితప్పిన అర్ధరాత్రో ఆ గతం(భూతం) వికృతాకారమై “ఆ మర్రి, రావి, జువ్విచెట్ల జుత్తు ఆకాశంలోకి“ విరబోసుకుని భూతమై భయపెడుతుందేమో! కేవలం కాలం గడవడం వల్ల, పాతబడ్దం వల్ల, అలవాటు పడ్డం వల్ల, వస్తువులో లేని కొత్త భావమేదో కల్పించుకోదలచుకోవడం వల్ల- మూల స్వభావంలో లేని మార్పుని ఉందని నిర్వచించడానికి “పదం మార్తుంది, క్రియాపదం మార్తుంది.”
నమ్మకం ఉంటే ఎదురుచూడగలవు. ఏదురుచూస్తేనేగా నమ్మడానికి ఏదైనా ఆధారం దొరికేది? ఇప్పుడు తాకి నిద్రలేపితే రేపు నువ్వు రాగలవు. రాకుండానే ఎలా తాకేది? సమాంతర సమీకరణాలే అన్నీ. అందుకే అర్ధం చేసుకుంటావని ముందే చెబుతున్నాడు “వాన కురిస్తే మాత్రం వీలుండదు. వీలు కుదరలేదూ అంటే వాన కురిసిందీ అని అర్ధం.” చివరికి మిగిలే విలువేదో తెలిస్తే సమీకరణాల్లో అక్షరాలు ఇట్టే కనిపెట్టొచ్చు. కానీ తోచిన అక్షరాలు రాసుకుంటూ పోతే కానీ ఒక విలువకి చేరుకోలేము. తీరా ఆఖరు అంకె సరిగ్గా వచ్చేశాక అక్షరాలన్నీ తప్పంటారు మీరు. అందుకే నేనారోజే చెప్పానుగా అనే గొడవ ఈరోజు లేకుండా ఆ కబురేదో అందిస్తావని- అత్తరు చల్లిన ఉత్తరంలో గులాబి రేకలు మడిచి పంపకున్నా పెనుగాలికి గింగిరాలెత్తే ఏ ఎంగిలాకు తోనో పరాగ్గా విసిరేస్తావని “గతంలోకీ భవిష్యత్తులోకీ, ఇంట్లోంచి బయటికీ/ తిరుగుతూ నాల్క చాచుకుని కాపలాకాస్తుంటాడు/ ఇహానికీ పరానికీ చెడుతూ.”