ఊపిరిపాటకు చూపేదీ?

శిల్పాల్నీ, శిధిలాల్నీ
సాగరాన్నీ, నగరాన్నీ
మేల్కొలుపుతూ వినబడ్డాడతను
వేకువల్ని వణికించే వేణువుగా.

గాలి మడుగులో
రాగాల జాడలు పట్టుకుని
వెదుక్కుంటూ వెళ్ళి చూశానతన్ని
చూశానా? కాదు కరుణించి కనపడ్డాడు

పాట ఆపినపుడు
మురళితోబాటు మహాబలిపురాన్నే
సంచిలో పెట్టుకున్నాడా అని?
జలదరించిన ఉదయాలను సంగీతానికి వదిలి
రాత్రుల్ని కళ్ళుగా చేసుకున్నాడా అని?
అడగలేదు – ధ్యానానికి కొనసాగింపు మౌనమే కావాలని.
బాగా రాత్రయింది, తోడొస్తాను ఇంటిదాకా అంటే
నిశ్శబ్దంగా నవ్వాడు
చీకటి నా తోబుట్టువని మీకు తెలీదా? అన్నట్టు

వీడ్కోలు వేళ మాటల్లో మాటగా
రోజూ అడిగినా గుళ్ళోకి రావేమంటే?
పంచేంద్రియాలకు అందని
పరవశంతో గుసగుసగా
“రగసియం స్వామీ!
ఎనక్కు ఇంగెయే దరిసనమాగుం”
(రహస్యం స్వామీ! నాకు ఇక్కడే దర్శనమౌతుంది.)
అని నమస్కార ముద్రలో తడుముకున్నాడు
వేణువు వొంటిపైన తన ఏడు కళ్ళనీ…

(ఈమాట మే 2013 సంచికలో ప్రచురితం)

గాలి మళ్ళింది

“ఇహనో, ఇప్పుడో వచ్చేస్తారు వీళ్ళు
ఇదిగో బాబూ! మరికాసేపు ఉండకూడదూ?
ఒక్కత్తినే కదూ ఇంత పెద్ద ఇంట్లోనూ…”

సర్దుక్కూచుంటాడు ఆఖరి అవకాశంగా
గోడగడియారాన్ని గద్దిస్తున్నట్టుగా
ఇంకాసేపు చూస్తే అద్దాల వెనక బొమ్మలు
అరిగిపోతాయేమో అన్నట్టుగా

“దాటిపోయారు ఆ మనుషులు, ఆరోజులిలా ఉండేవా?
ఏ నలభయ్యేళ్ళో అవదూ, ఆయన కూడా… హూఁ
ఇదిగో నా చేతులు, వణక్కుండా పట్టుకోలేను దేన్నీ
మజ్జిగన్నం ఒలకబోసేస్తాననీ…
పనిపిల్లే పెడుతుంది చెంచాతో రోజూ,
తల్లెవరో, పిల్లలెవరికో?
మా అమ్మ పోయేనాటికి ఇంతపిల్లని…”

సాయంత్రపు దీపం పెట్టే వేళకి
ఎందుకో? రోజూ సరిగ్గా దీపాల వేళకే
గూట్లో చిలక్కి గుబులెత్తి
వినేవాళ్లొకరుంటే ఇక అదొక ధోరణి

వాచీలో వెలిగే అంకెల కన్నా
ఆవిడ మంచం కింద –
సగం తిన్నాక జారిపోయిన అరటిపండు పైని చీమల కన్నా
కిటికీ లోంచి కనపడే బస్టాప్ గుర్తుచేసే పనులకన్నా
అతన్ని భయపెట్టి తరిమేది మరేదో!

“ఎన్ని పుస్తకాలో, బొమ్మలు కూడా వేశాను,
అదిగో గోడ మీద నీటిరంగులతో
అమ్ములు గాడు ఇండియా వచ్చినప్పుడు
‘ఫన్నీ’ అన్నాడు. ఆ…హ్హా!! ఫన్నీ అట, పెంకి సన్నాసి!”

చుట్టు పక్కలంతా దీపాలు వెలిగినప్పుడు,
కొండెక్కలేని ఒత్తి రెపరెపలు లీలగా…
అతనికి ఉన్నపళాన బెంబేలౌతుంది
‘వెళ్ళొస్తా’ అనడానికి తడారిన నోరు పెగలదు.
వయసు తరుముతున్నవాడిలా
చకచకా, ఒక్క విసురుతో
మెట్లపైకి దూకి పలాయిస్తాడు…

“ఇదిగో! అబ్బాయ్…
… … …
… … …
ఇంతలోనే ఏవిటో ఆ మనిషి!
మరి కాసేపుంటే…
ఇహనో, ఇప్పుడో… వీళ్ళు రారూ?”

—-

(2-3-2013 న ఈమాట వెబ్ పత్రికలో ప్రచురితం)

భ్రష్టయోగి

తిరిగి దొరకడానిక్కాక వెతికించుకోవడానికే
తప్పిపోయిన ఒక పద్యంకోసం
రోజులతరబడీ, రాత్రులవెంబడీ
ఆకలీ ఆహారమూ తనకు తనే అయి
రాసుకున్నాడేవో కొన్ని సౌందర్యోన్మత్త గీతాల్ని…

కిటికీ అంచులు ఏటవాలు నీడల్ని ఇంటిగోడలపైకి జారవిడుస్తూ
ఏకాంతంలో బద్ధకంగా చల్లుకున్న దిగులు గింజల చుట్టూ
బూడిదరంగు పావురాలు రెక్కలు ముడుస్తూ తెరుస్తూ మసలినప్పుడు
పాదాక్రాంతమయ్యాడు ఆ మచ్చికైన హేమంతపు సాయంత్రాలకి…

పగడపు గోరింట పాదాలు ఇసుకలో గీసిన ఇంద్రధనస్సుని
తాడుపైన గారడీలాంటి చూపులతో కౌగిలించబోయి
అగ్గిపుల్లని చూసి అణువణువూ జలదరించిన అగ్ని పర్వతంలా
చర్రున వెనుతిరిగాడు అక్కడొక మల్లెల మంటను రాజేస్తూ…

జీవన్మరణాలు చెరిసగాలైన ఒకానొక లిప్తలో
నిద్రకు అలసటనీ, నిజాలకు ఆశల్నీ ధారపోసి
చిట్టచివరి పడవకు తెరచాపనెత్తుతున్నప్పటి ఒడ్డులా
ఒంటరిగా,
ఒక్కడుగా,
ఉండుండీ ఉప్పెనగా,
బావురుమన్నాడేవో గాజుపూల పగుళ్లని గుండెలోపలికి అదుముకుంటూ…

—–

(22-2-2013 న వాకిలి వెబ్ పత్రికలో ప్రచురితం)

వాంగ్మూలం (కథ)

వాంగ్మూలం

 

గుండె పగిలిపోతోందిరా చిన్నోడా..

యాభయ్యేళ్ల ఒంటరోడిని, తాగుబోతు నా కొడుకుని, అర్ధరాత్తుళ్ళు ఫోన్‌ చేసి “లవ్  యూ రా  బంగారుకొండా” అంటే సంస్కారపుజబ్బు ముదిరినోడివి కాబట్టి నా మత్తు సంగతి కనిపెట్టి నీ నిద్రమత్తుని దాచిపెట్టి “ఇవ్వాళ కూడా డోసెక్కువైందా?” అని విసుక్కోకుండా అడిగినప్పుడు ఎంత ముచ్చటేసేదిరా!

సఫరింగ్, సఫరింగ్, సఫ – రింగ్, టేబిల్ మీద ఖాళీగా గ్లాసుల అడుగుజాడల రింగులు. వలయాలు, వేదనా వలయాలు, శోధనా వలయాలు. కళ్ళు తిరిగి వళ్ళు తిరిగి… ర్రేయ్, ఇంతకుముందు ఇక్కడో నయాగరా ఉండాలి, సింకులో నీళ్లాపేసిన బాస్టర్డ్ ఎవడ్రా?  కాగితాలున్నయ్ కాబట్టి సరిపోయింది మాటలు కక్కడానికి.

పత్రికలో పడిన నీ ఒకేఒక్క కథ, ఆపైన నీ ఉత్తరాలు చూసి మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నేను ఊహించినట్టే ఉన్నావ్. ఐనా ఏం ఊహించాను నేను? తెలివి, మొండితనం, వయసులో ఉండే పట్టుదలా, అదే నాకు తెలిసిన నువ్వు, నాకెప్పటికీ దొరకని నాలాంటి నువ్వు, ఆ సాయంత్రం అంతసేపూ తాగుడూ వాగుడూ నాదే అయాక “అలాగ ఫోటోలో దేవుడిలా కూచుంటావేం? నిజంగానే తాగవా!” అని నేను దేవుణ్ణీ, నిన్నూ ఒకేసారి అనుమానిస్తే “తాగినవాళ్లని ఇంతదగ్గరగా కూడా ఎప్పుడూ చూళ్ళేదు మాస్టారూ!” అన్చెప్పి “కేవలం మీ కోసమే ఇంతసేపూ…” అన్న ముక్కని చెప్పకుండా అభిమానంగా నవ్వినప్పుడు; అప్పుడు గ్లాసు దించి మరోసారి నీ మొహంలోకి చూస్తే, ఎందుకో…

ఎందుకో! శివాని గుర్తొచ్చింది –

పెళ్లాం, బెటరాఫ్- ఇలా ఎలా రిఫర్ చేసినా చిరాకు పడేది శివాని, ఆ పేరు చూసే ప్రేమించుంటాను. సృష్టిలో ఎక్కువైపోయిన  ప్రతిదాన్నీ లయం చెయ్యడానికి, శివమెత్తినప్పుడు లయతో తాండవమాడ్డానికి తోడుండే శక్తి తన అస్తిత్వాన్నంతా ఆక్రమించకుండా ఎలాగాపాడో సగం శరీరం దగ్గరే! నిభాయించాడు, తట్టుకు నిలబడ్డాడు. మరి మాటలా! నాలాంటోడివల్ల కాలేదు. ఇందాకన్నాగా  ‘మా ఆవిడ’ అని తన గురించెవరికైనా చెబ్తే- ‘నేను నువ్వే అవుతాను కానీ, నీకు మరేదో ఎలా అవుతాను?’ అని పెళ్లిలో చదవని మంత్రాల్నేవో కొత్తగా నేర్పలేక మళ్ళీ వెంటనే మూగగా అయిపోయేది.

మూడేళ్ల కొడుకుపోయి ఎన్ని నెల్లకీ మనిషి కాలేదు. శరీరంకోసం తప్ప ఓదార్చడానికి ముట్టుకోడం రాని మగాణ్ణే అప్పటికి. తన ఏడుపు నన్ను అస్తమానమూ డిఫెన్స్ లో ఎందుకు పడేసేదో ఎప్పుడాలోచించినా అర్థం కాదు. సొంతసొత్తులా తప్ప సాటిమనిషిలా చూడలేనని తెలిశాక కూడా, ఎప్పటికీ చేతికి తగలని పచ్చగడ్డి పరకకోసం బీడునేలమీద తడుములాడినట్టు తనక్కావల్సిన దేనికోసమో చాన్నాళ్లు  నాదగ్గర వెతుకుతూనే ఉండేది. ఇప్పుడు నాకు పగులుతున్నట్టుగానే తనకీ గుండె ఎన్నిసార్లు పగిలి ఉంటుందో! ఒకరోజు నిజంగానే నా శక్తినంతా లాక్కుని జీవితాన్ని, మనుషుల్ని దేబిరించకుండా హుందాగా తనకి నప్పుతుందేమో అన్న ఆశతో మరే లోకానికో వెళ్లిపోయాక, వెళ్ళిపోయి రెండు పుష్కరాలు దాటాకా నువ్వు…

ఇప్పుడిదో కొత్త పిచ్చి – ’పిచ్చిలో ఉన్న ఆనందం పిచ్చోడికి తప్ప తెలీదు’ అని నేనంటే “నెరుడాని మీవాదం కోసం వాడేసుకుంటారు – స్పానిష్ మీ బలహీనత” అని నువ్వు ఎడ్మైరింగ్ గా నవ్వేవాడివి, “నువ్వు గత జన్మలో రష్యా వోడివిరా” అని నేనన్నప్పుడు కృతజ్ఞతతో నవ్వినట్టు…

“కథొకటుంది మాస్టారూ- మూడు ముక్కల్లో చెప్పొచ్చు. పెళ్ళాన్ని దారుణంగా చంపేసి రేప్పొద్దున ఉరికంబం ఎక్కబోతున్న హంతకుడి గురించి ఇద్దరు సెంట్రీలు మాట్లాడుకుని, నైట్ డ్యూటీలని బూతులు తిట్టుకుని ఒక దమ్ములాగి సెల్స్ లో రౌండులకెళ్ళటం మొదటి భాగం. చనిపోయిన భార్య ప్రియుడు, ఈ గొడవల్లో తను ఏ రకంగానూ ఇరుక్కోకుండా ఇన్‌ఫ్లుయెన్స్ తో ఎలా నెట్టుకొచ్చాడో; చిత్తుగా తాగి బార్లో ఫ్రెండ్స్ దగ్గర కోతలు కొయ్యడం రెండోది. ఖైదీ కొడుకు అనాథాశ్రమంలో భయంగా ముడుచుకుపడుకుని తను స్కూలుకెళ్ళి వచ్చేలోపు అమ్మా నాన్నా ఇద్దరూ కనపడకుండా పోవడమేంటో అర్థంకాక ఎక్కిళ్ళు బయటికి వినపడకుండా నోరుమూసుకుని, కాసేపటికి కళ్ళు తుడుచుకోకుండానే నిద్రపోవడం- ముగింపు ; అంతే కథ. మొత్తం కథలో ఆ హంతకుడిని నేరుగా చూపించకుండా పొగమంచు కప్పెయ్యాలన్నమాట, రాయొచ్చంటారా?” అని మొహమాటంగా సలహా అడిగినప్పుడు-

“నా అనుభవంలోంచి చూస్తే అంత గొప్పకథ కాదుకానీ, నీ వయసుకి గ్రాండ్ గానే ఉంటుందిలే, కానియ్”  అని ఉడికిస్తే “ఒక్కసారైనా అన్‌కండీషనల్‍గా మెచ్చుకోరుగా మీరు” అంటూ నువ్వు ఉక్రోషపడితే ’నాకేవఁవుతాడ్రావీడు? నిండా పాతికేళ్ళు లేవు, నాకొడుకే బతికుంటే వీడంతై, ఇలా లోలోపల దావానలంతో దహించుకుంటూ ఉండేవాడా?’ అనొక విపరీతపు ఆలోచన సెంటిమెంట్ తో సతమతం చేస్తుండేది.

“ఐనా పెద్దాయనా! మనమీకాలంలో పుట్టి ఈ చట్టాలు, ఇప్పుడున్న సమాజమే ప్రామాణికం అనేసుకుని ఏదో రాసేస్తాం కానీ; ఈ స్థలం, కాలం, ఇప్పటి నైతికత ఇవన్నీ అబద్ధం, అసంబద్ధం అయిన మరోచోట, నక్షత్రాల ధూళి రాలిపడే అనంతమైన శూన్యంలో, ఉల్కాపాతాల మౌనంలో కాంతియుగాలకవతలకి మేధస్సుని పంపి రాయగలిగితేనే సృజనకి అర్ధం” అని నువ్వూగిపోతుంటే పాతికేళ్ల క్రితపు నా ఆవేశమూ, దాన్లోంచి పుట్టి ఇప్పటికీ ఆగని నా అన్వేషణా గుర్తొచ్చేవి.

“ఏమన్నావు? స్థలం, కాలం – ఎన్ని స్థలాల్లో తిరిగాను, ఏ కాలాల్లో బతికాను. పిచ్చి పట్టినవాడిలా ఏ రైల్లో ఎక్కడ ఎక్కానో, అదెక్కడికెళ్తుందో తెలీకుండానే. నిద్ర లేచినప్పుడే స్టేషనొస్తే అదే నాఊరు. పడమటి కనుమల్లో ఏదో పల్లెటూరి హోటల్లో  టీకప్పులు కడగటంలో మొదటిసారి మెడిటేషన్‌ దొరికినప్పుడు, గోవాబీచ్ లగ్జరీ రిసార్ట్లో టాయిలెట్ల సఫాయీలో నాలుగు డబ్బులు పోగవగానే సింబాలిజం, ఫ్యూచరిజం, ఫిలాసఫీ అని ఇష్టమొచ్చిన పుస్తకాల కోసం ఖర్చు పెట్టేసినప్పుడు; నేనొదిలేసొచ్చిన ఎకౌంట్స్ మేనేజర్ పోస్ట్ లో గోతికాడ నక్కలా దూరి వారానికార్రోజులు సగం టీలు, సగం గాసిపింగూతో గడిపేసే శివప్రసాద్ కి ఫోన్‌చేసి ‘నిజంగానే నేను గొప్పగా బతుకుతున్నాన్రా ఫూల్’ అని పగలబడి నవ్వాలనిపించేది.

అజంతా గుహల్లో గైడుగా వెలగబెట్టినప్పుడు చరిత్రని పొయెటిగ్గా చెబుతుంటే ఆ కాసేపట్లోనే శిల్పి హృదయ రహస్యాల్ని కళ్లతో కొనేసుకోవాలని తపించి, కళలోని అందాన్ని తప్ప ఆత్మని పట్టుకోలేక అల్లాడే యాత్రీకుల అలసటని, ఫోటోల్ని తప్ప   జ్ఞాపకాల్ని దాచుకోలేని యాంత్రికతనీ చూసి జాలిగా ఓదార్చాలనిపించేది.

ఇంకా ఎన్నెన్ని స్థలాలు, ఎలాంటి అనుభవాలు!

దారంతెగి గాలివాటుకి ఎగిరిపోయి పతనమైన పతంగులు, వివస్త్రంగా ఉబ్బి వరదల్లో కొట్టుకోచ్చే దిక్కులేని శవాలు, ఇసుక తుఫానులు చెరిపేసిన ఎడారిఒంటెల ప్రయాణపు గుర్తులు, అసంతృప్త  ఆగ్రహాలు నిండిన సముద్రపు సుడుల్లో అలవాటుపడ్డ మొండి ధైర్యంతో సాగిపోయే ఓడలు చేరని తీరాలు.

ఏ స్థలాల్లోవి, ఏ కాలానివి ఈ జ్ఞాపకాలన్నీ?

తనలోని సుఖాన్ని తనకే తిరిగి ఇచ్చే మరో సాధనం కోసం వెర్రెక్కిన శరీరపు కేకలు, ఏ అస్థిపంజరాల్ని కప్పిన అవసరాల్నో చేరిన చోట- ఎవరివో స్త్రీ దేహాలు, స్నేహాలు, దాహాలు, మోహాలు. మొహంమొత్తుళ్ళు, విదిలింపులు, వదిలింపులు, డబ్బుల ఎరలు, ఏ చెట్టువో రాలి నీటివాలుకి కొట్టుకొచ్చిన అడివి పూలు – ఎటర్నల్ స్ట్రగుల్ ఆఫ్ ది యానిమల్ ఇన్‌స్టింక్ట్స్…

యుగాల తరబడి ఇందరు వెతుకుతున్న ఈశ్వరప్రేమ హౌరా నదికి అవతల ఎక్కడో ఏ ఇరుకు సందుల్లోనో దొరికినప్పుడు; బసంతీ! నా చెవిలో ఏదో అన్నావ్? ఆర్ట్ సినిమాలో నటన మర్చిపోయిన హీరోయిన్లాగా. మనసుతో శరీరాన్ని కోరుకోవడం మర్చిపోయిన చాలా ఏళ్లకి, పరిచయం పాతబడి వెళ్ళిపోతుంటే- నేనిచ్చిన డబ్బులు చనువుగా నా జేబులో తిరిగి పెట్టేస్తూ ఏమిటి బసంతీ అన్నావ్ నాకెప్పుడూ అర్థంకాని మరోలోకపు భాషలో!! ఎప్పుడో శివాని కోసం పిచ్చెక్కిపోయిన మొదట్లో భావుకత్వమంతా కళ్లల్లో వెలిగించుకుని నుదుటిమీద ఆర్తితో పెట్టిన ముద్దు, కామంతో కాదు, రిచువల్ గా, అలవాటుగా కాదు.. ‘ఐ కేర్ ఫర్ యూ’ ఆని అంత సున్నితంగా చెప్పడం మళ్ళీ నీదగ్గరే. ఒకసారెళ్ళిన చోటకీ, వదిలేసొచ్చిన మనుషుల దరిదాపుకీ వెళ్ళే అలవాటు లేదు నాకు. ఎక్కడున్నావో, ఎప్పుడైనా తలచుకున్నావో లేదో, అప్పటికి కష్టంగా అనిపించినా తప్పలేదు. నాకు తెలుసు నీతో నేనుండలేను, అసలెవరితోనూ, ఎక్కడా  ఉండిపోలేను శాశ్వతంగా, పదిహేనేళ్లవదూ? ’బై బై బసంతీ’ అనికూడా చెప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా లేటైపోతున్న ఏ రైలు కోసమో అన్నట్టు త్వరత్వరగా నడుచుకుని వచ్చేసి…”

ఎక్కడి చట్టం, సమాజం, నైతికత, నైతికాతీతత! నిజంగానే నువ్వు రాయగలవురా చిన్నోడా; నేనాగిపోయిన చోటునుంచీ ముందుకు కాకుండా పైపైకి వెళ్ళి,  నక్షత్రాల మధ్య ఖాళీలో గడ్డకట్టిన ఇంక్ పెన్నుని గట్టిగా విదిలించి కొట్టి… నీకా దమ్ముంది.

“ప్రయోగాల మీద అంత తపన ఉన్నవాడివి, ఈ మూడుముక్కల కథలెందుకు నీకు?” అనడిగితే “లేద్సార్, ఈ ఒక్కసారికీ రాధికకి మాటిచ్చాను. తను పనిచేసే వీక్లీలో స్టోరీసెక్షన్‌కి మారింది. మీకెప్పుడూ చెప్పలేదుకదా తను చాలా ఇంటెలిజెంట్ అండ్ సెన్సిబుల్ గా అనిపిస్తుంది” అని మురిసిపోయినోడివి – ఇన్ని నెల్ల తర్వాత మళ్ళీ మొన్ననగా ఫోన్‌ చేసి “మనకి నచ్చేది లోకంలో నిజంగా ఉందని తెలిసీ, అందుబాటులో ఉండీ, మనది కానప్పుడు, ఎలాగండీ తట్టుకునేది?” అని ఏదో గొప్ప ఆశాభంగాన్ని మగాడివి కాబట్టి ఏడవకుండా మానిప్యులేట్ చేస్తుంటే- ఏంట్రా ఇంత ముదురుగా మాట్లాడావ్! ఒకవేళ తాగి ఉన్నావా అని అనుమానమేసి పట్టరాని కోపమొచ్చింది.

————————

అప్పటిదాకా ఎక్కింది దిగితూ, అప్పుడే లోపలికి దిగింది నరాల్లోకి ఎక్కుతున్న మైకంతో, తడిపిన కొద్దీ ఎండిపోతున్న గొంతుతో- ఎక్కినమెట్లు దిగుతున్నానో, దిగవల్సిన మెట్లు ఎక్కుతున్నానో మెట్లకే తెలియాలి. నీడనుంచి నిజాన్ని విడదీసి చూపడానికి విషపుటాలోచనలు చేస్తున్న మోసపు ఉదయాన్న; నిశ్చింతగా పడుకున్న రాత్రినెవరో రాక్షసంగా నేల అడుక్కి తొక్కేస్తుంటే, ఆ ఊపుకి రోడ్డుమీద తూలిపడుతున్న ప్రతీదాన్ని కేర్లెస్ గా చూసుకుంటూ..

అదే మొదటిసారి పనిగట్టుకుని ఫలానా చోటకని అనుకుని ఎవర్నైనా చూడ్డానికి రావడం.

“మీ పుస్తకాన్ని ప్రచురిస్తాం” అని ఎవరైనా అడిగితే “చేసుకోండి, నాకెందుకు చెప్పడం?”

“మరి రాయల్టీలు?”

“ఊళ్ళో నా తమ్ముడున్నాడు, వాడికిచ్చెయ్యండి. నా తాగుడుకి డబ్బులు చాలక ఉత్తరం రాస్తే వాడే పంపుతాడు.”

అంత నిర్లక్ష్యం, అంత పొగరుబోతు దిలాసా! అలాంటిది నిన్న రాత్రి నువ్వు ఫోన్లో “దాందుంపా తెగ, దౌర్భాగ్యపు జీవితమండీ!” అనగానే ఈ టైంలో బస్సులుంటాయా అనే ఆలోచన లేకుండా నువ్వు పుస్తకాలు కొరియర్ పంపిన కవరు వెనక అడ్రెస్ పట్టుకుని, ఇందాకా వస్తే…

గది తలుపు తోసుకుని “నేనెవరో చెప్పుకోరా ఇడియట్?” అని నీ ఆశ్చర్యం చూద్దామనుకుంటే…

నీలాగే నీగది కూడా నేనకున్నట్టే ఉంది. నేలంతా పరుచుకున్న పుస్తకాలు, టేబుల్ మీద ఒలికిపోయిన ఇంకు మరకలు,  కానీ వంటి మీద స్పృహేదీ? పక్కన సూసైడ్ నోటేదీ? డస్ట్ బిన్‌ లో చింపిపారేసిన డైరీ కాయితాల మధ్యలో రెస్టిల్ షీట్లు ఏ వివరాలూ చెప్పవు. అసలెవరైనా ‘నా చావుకెవరూ కారణం కాదు ‘ అని రాశారంటే అ కారణమైన వాళ్లని కాపాడ్దానికే అని అర్థం. మరి అసలేమీ రాయకుండా ఇలాటి పని ఏ చివరి జ్ఞాపకాన్ని కాపాడ్డానికి?

పెద్ద పనిమంతుడిలా కథల్రాయడమే కానీ నిద్రమాత్రలేసుకునే ముందు చిన్న చీటీ ముక్క రాయాలనీ, ఆ రాసేముందు ఇంటిగోడలకి బీటలేస్తూ మొండిగా బతికే ఏ పిచ్చిపూలచెట్టునో గుర్తుతెచ్చుకుని బతకాలనీ, నీ ప్రాణమ్మీద నీకధికారం లేదనీ, నీ నిరాశకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ బతుక్కి లేదనీ, రెండు మైలురాళ్ల మధ్య నిశ్శబ్దంలో అలసట తీర్చుకోవాలే కానీ అర్ధాంతరంగా ఆగిపోకూడదనీ, ఇలాచేసిన నీ తలపొగరుకి శిక్షగా ’లవ్ యూ రా బంగారుకొండా’ అని ఇక నేనెప్పుడూ చెప్పబోననీ,

ఈమాత్రం ఊహించలేనివాడివా నువ్వు అని తలచుకున్నకొద్దీ…

గుండె పగిలిపోతోందిరా చిన్నోడా!

————*****————-

-స్వాతికుమారి బండ్లమూడి

swathikumari@gmail.com

అరచేతిలో ఆకాశం

ఆకాశమంటే పొగకాదు, చెల్లాచెదురైన ధూళి మబ్బుల సమూహం కాదు. పదార్ధమూ, శూన్యమూ కాదు. కొన్ని అస్తిత్వాలు లేవని చెప్పడానికి ఎంత గట్టి ఋజువులుంటాయో ఉన్నాయని తెలుసుకోవడానికి అంతకంటే బలమైన నమ్మకం ఆసరాగా ఉంటుంది; దైవం లాగా, ఆకాశంలాగా. ఆ నమ్మకాల్లో ఉండే గొప్ప నిశ్చింత, నిబ్బరం, ఆనందం, ఆహ్లాదం- ఇవే వాటి రూపాలు, రూపాంతరాలు, అస్తిత్వాలూ. తన రూపరహిత స్వరూపాన్ని నీటిలో చూసుకునే అకాశంలాగే కవిత్వమూ చదువరి పొందే తాదాత్మ్యతలోనే తనని తాను పోల్చుకుంటుంది.

గీటురాయి మీద బంగారపు నిగ్గు తేల్చడానికి అలవాటు పడ్డ చేతికి ఒక మంచి గంధపు చెక్క దొరికినప్పుడు; ఆపరేషన్ టేబుల్ మీద కత్తికి సుతిమెత్తని పూలగుత్తి తగిలితే; రాళ్ళూ, కత్తులూ, కళ్ళద్దాలూ, చేతితొడుగులు అన్నీ పక్కనపెట్టి విమర్శించకుండా, విశ్లేషించకుండా; తాళం పారేసుకున్న ఇనప్పెట్టెలో ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన పసితనంతో కాసేపు కరువుతీరా కబుర్లాడుకుని ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా ఏమీ ఎరగనట్టు తిరిగి పనిలోపడి మామూలుగా అయిపోగలగడం – అప్పుడప్పుడూ మాత్రమే సాధ్యపడుతుంది.

తెగింపుతో- కనబడ్డ ప్రతి ఒడ్డు మీదనుండి జీవితంలోకి దూకటానికీ, అనుభవాల ప్రామాణికత ప్రకారం ఏర్పడ్డ సూత్రాల ఆధారంగా బతికెయ్యడానికీ మధ్య ఏవో కొన్ని సంఘటనలు ఒక సరిహద్దు రేఖను గీస్తాయి. ఒకసారి దాటేసి ఇటు వైపొచ్చాక మాములుగా నడుస్తూ వెనక్కి వెళ్లడం వీలవదు. ఆ గీతకి అనుమానం రాకుండా పెద్దరికంగా నటిస్తూ ఎవరూ చూడనప్పుడు ఒక తొక్కుడు బిళ్లని అటు గిరాటేసి ఒంటికాలిపై గెంతేసి ఒక్క ఉదుటున ఆ వైపుకి దూకెయ్యాలంతే…

ఒక్కోసారి పిల్లలకి తాయిలాలివ్వకుండానే, బతిమాలకుండానే, అసలు వాళ్లని పట్టించుకోకుండా బల్లమీద కాగితాలు పెట్టుకుని మనమేదో రాసుకుంటున్నప్పుడు, ఎందుకో తెలీకుండా, విడి సందర్భాల్లో ఎంత బుజ్జగించినా ఇవ్వని ముద్దొకటి ఊహించకుండా పెట్టేసి తమ దారిన తాము ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు- పదాల పటాటోపం లేకుండా, తెలుసుకోవడం తప్ప మరే ఉద్దేశమూ లేకుండా వాళ్లడిగే ప్రశ్నల్లోని నిజాయితీలాంటి స్వఛ్ఛమైన ప్రేమొకటి మనమీద మనకి వెల్లువెత్తుతుంది.

—-
ఇవ్వాళ నా గీటురాయికి గంధపు చెక్కా, నా కత్తి మొనకి పూలగుత్తీ, గీతకి అటువైపు విసిరెయ్యడానికి తొక్కుడుబిళ్ళా, నా రాతల మధ్యలో ఊహించని విరామంలాంటి లేతముద్దూ ఒకేసారి దొరికాయి.
—-

“క్షణం జీవితం చాలనిపిస్తుంది. కల్పాలు బ్రతికినా చాలదనిపిస్తుంది.” అని బీవీవీ ప్రసాద్ గారి “ఆకాశం” కవితల్లో చదువుతున్నప్పుడు “దాక్కోవడం కవిత్వం, దొరికిపోవడం కవిత్వం” వెరసి ”నాకు నచ్చిన భావాన్ని నీకు నచ్చిన మాటల్లో చెప్పడం కవిత్వం” అని చెప్పుకున్నమాటలు, శబ్ధాలలోపల దాచి కవి పంచిపెడుతున్న కలల్లా కనిపిస్తాయి.

(పుస్తకం.నెట్ లో ప్రచురితం)

ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం

తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగినవాటిల్లో కాటమరాజు కథాచక్రం ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుధీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి ఆరుద్ర ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు. దీన్ని సశాస్త్రీయంగా మరికొంత సంస్కరించి పరిష్కరించాలని భావించినా, ’సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర’ రచన కారణంగా ఆ పని చెయ్యలేకపోయారు. సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రచన “కృతి యొక బెబ్బులింబలె శరీరపటుత్వమునాహరింప” అనే రీతిగా వారి జీవిత సమస్త శక్తిని పీల్చి వేసిన కారణంగా దీనిని పరిష్కరించలేకపోయారని ఈ నాటకానికి ముందుమాట రాసిన ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు అంటారు.

క్లుప్తంగా కథ, ప్రచారం:

శ్రీశైలం దగ్గర ఆవుల్ని మేపుతున్న కాటమరాజు, అక్కడ క్షామం రావడం చేత తన అనుచరులతో కలిసి ఆలమందలను తోలుకుని దక్షిణ భూములకు తరలి వస్తాడు. నెల్లూరిసీమను పాలించే నల్లసిద్ధి రాజుతో ఒక ఏడాది పాటు తమ పశువుల్ని అక్కడ మేపుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ ఒప్పందం కోసం రాజు దగ్గర మంత్రిగా ఉన్న ఖడ్గతిక్కన సాయాన్ని తీసుకుంటారు. ఐతే, నల్లసిద్ధిరాజు ఉంపుడుకత్తె కుందుమాదేవి (కన్నమదేవి) పెంపుడు చిలక ఆలమందలను బెదిరించడంతో దానిపై బాణం వేసిచంపుతారు కాటమరాజు అనుచరులు. దానికి ఆగ్రహించిన కన్నమదేవి తమ భటులతో వీరి పశువులను చంపిస్తుంది. ఆ విధంగా మొదలైన ప్రతీకారాలు, ఒప్పంద ఉల్లంఘనలు ఇరుపక్షాల వారినీ యుద్ధానికి ప్రేరేపిస్తాయి. యాదవులకు మొదట్నుంచీ సహాయం చేసిన ఖడ్గతిక్కన ఈ సంఘటనల నేపథ్యంలో వారితోనే యుద్ధంచేసి స్వర్గస్థుడౌతాడు. నల్లసిద్ధి రాజు, కాటమరాజు ముఖాముఖీ తలపడే యుద్ధ సన్నివేశంతో నాటకం ముగుస్తుంది. ఐతే విజయం ఎవరిది అనే విషయం అస్పష్టంగా ఉంది. ఇదే అస్పష్టత ఈ కథ మీద ప్రచారంలో ఉన్న ఇతర గాథల్లోనూ ఉన్నట్టు తెలుస్తుంది.

కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగాథలలోని వంశవృక్షాల వల్ల తెలుస్తోంది. పల్నాటి యుద్ధం క్రీ.శ 12 వ శతాబ్ధంలో జరగగా, కాటమరాజు ఎర్రగడ్దపాటి పోరు క్రీ.శ 1280 – 1296 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉన్నకాలంలో నల్లసిద్ధిరాజుకి, కాటమరాజుకీ జరిగింది.

కాటమరాజు కథాచక్రాన్ని యాదవభారతం అంటారు. ఈ కథలు రాయబడిన తాటాకు పుస్తకాలని “సుద్దులగొల్లలు, కొమ్ములవారు” అనే గాథాకారులు ఎద్దులపై వేసికొని ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడటం చేత “యాదవభారతం ఎద్దుమోత బరువు” అనే సామెత పుట్టింది. ఈ కథాచక్రాన్ని తొలుత శ్రీనాథకవి రచించాడనటానికి గాథాకవుల వాక్యాలు ఆధారంగా ఉన్నప్పటికీ శ్రీనాధ విరచితమైన కథ మనకి అందుబాటులో లేదు.

రచనారీతి, పాత్రల చిత్రిక:

మొత్తం ముప్పైనాలుగు రంగాలుగా విభజించబడ్డ ఈ నాటకరచన ఒకరంగం నుండి మరో రంగంలోని పాత్రలకూ, స్థలానికీ అత్యంత సహజంగా మారుతూ కథను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపిస్తుంది. మనకు ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఖడ్గతిక్కన కథలో ఖడ్గతిక్కన నాయకుడిగానూ, కాటమరాజు పుల్లరి ఎగ్గొట్టి మోసం చేసిన ప్రతినాయకుడిగానూ కనిపిస్తారు. అటువంటి బహుళప్రచారంలో ఉన్న పాత్రలను తీసుకుని కాటమరాజుని అవతారపురుషుడిగా, సౌమ్యుడు, మితభాషి ఐన ఉత్తముడిగా  చిత్రీకరించడం, దానిని పాఠకుడిచేత సందేహం లేకుండా ఆమోదింపజేయటం అంత సులభమైన పనేం కాదు. ఐతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇన్నేళ్ళుగా ఖడ్గతిక్కనకు ఉన్న కథానాయకుడి స్థానం మారినప్పటికీ, అతని వ్యక్తిత్వ చిత్రణ, ధీరత్వ వర్ణన,  పాత్ర ఉదాత్తత వంటి విషయాల్లో ఎటువంటి మార్పూ చెయ్యకుండా ఆ పాత్రపై పాఠకుడిలో ఆరాధనాభావాన్ని కలిగిస్తారు రచయిత.

కథానాయకుడైన కాటమరాజు మొదటినుంచీ ధర్మబద్ధుడిగా, ఆవేశం, ఆగ్రహం, విషాదం కలిగించే సందర్భాల్లో సంయమనం పాటించే వ్యక్తిగా, అవసరానికిమించి మాట్లాడని తత్వంగలవాడిగా, తన పశుగణాలపై, తమవారిపై అపారమైన అభిమానంగలవాడుగా కనిపిస్తాడు. ఇచ్చినమాటకు అతను కట్టుబడే విధానాన్ని నిరూపించడానికి ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే – దక్షిణాదికి పశువులతో సహా తరలివస్తున్నప్పుడు అది శత్రుసీమ కాబట్టి తన కొడుకుని పంపడం ఇష్టం లేని సవతితల్లి, అయితమరాజును పంపకుండా కొన్ని సాకులు ఏర్పరుస్తుంది. కానీ  అక్కడ కాటమరాజు తప్పక నెగ్గుకొస్తాడనే నమ్మకం లోలోపల ఉన్నది కావటం చేత సంవత్సరం తర్వాత తాము దక్షిణాదిన సాధించిన దానిలో తమ్మునికి వాటా ఇవ్వమని మాట తీసుకుంటుంది. ఐతే ఆమె చెప్పిన గడువుకి యుద్ధం మొదలౌతుంది. తాము నెల్లూరిసీమలో సాధించినది ఇదే కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడికి యుద్ధంలో భాగం ఇస్తానని కబురు పంపుతాడు కాటమరాజు.

“తమకు గురుతుల్యులైన బ్రాహ్మలతో యుద్ధం చెయ్యడం యాదవవంశ ఆనవాయితీ కాదని”, కాటమరాజు కత్తిని ఒరలో దించి ఒంటరివాడైన తిక్కన ముందు తలదించి నిలబడే సన్నివేశం నాయక పాత్రకు ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టింది.

ఇటుపక్క కత్తి దించిన వారిపై కదనం చేయలేక ఇంటికి తిరిగివచ్చిన ఖడ్గ తిక్కనను పిరికివాడిగా భావించి తల్లి, తండ్రి, భార్య హేయంగా అవమానిస్తున్నప్పుడు కనీసం నోరు మెదపక తిక్కన సహనం పాటించిన సందర్భంలో వ్యక్తిత్వం, బాధ్యత, యుద్ధనీతుల నిర్వాహణ లో సంయమనం సాధించడానికి ఆ పాత్ర వహించిన మౌనం అతని గంభీరతను నిరూపిస్తుంది.

ఎనిమిదవ రంగంలో బోయలు యాదవుల వల్ల తమ భుక్తికి ఇబ్బందిగా ఉందనీ, వేటలో తమకన్నా వారు చురుగ్గా ఉండటం వల్ల వేట తమవరకూ రావడం లేదనీ తిక్కన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు, ‘వాళ్లంత చురుగ్గా మీరు లేకపోవడం వాళ్ల దోషం కాదు’ అని సమాధానపరచి పంపుతాడు. అటువంటిది, ఒప్పందాన్ని అతిక్రమించి యాదవులు రాజ్యం దాడిచేశారన్న వార్త విని, యుద్ధం చెయ్యడానికి కృతనిశ్చయుడౌతాడు. రెండు సందర్భాల్లోనూ వేడుకున్నది తమ ప్రజలే అయినా, ఒప్పంద నియమాలను సూక్ష్మంగా విచారించి స్పందించే ధోరణి కనపడుతుంది.

తన మీద సీసపద్యం చెప్పిన కొమరభట్టుకి ఎత్తుగీతి పూర్తి చేశాక బహుమతి ఇస్తానన్న వాగ్దానానికి తిక్కన చివరి క్షణాల్లో సైతం కట్టుబడి తన ఉంగరం ఇచ్చి పంపడం ఒక ఎత్తయితే, తమతో ప్రాణాలొడ్డి పోరాడుతున్న శత్రుసేనలోని వీరుడిని చూసి ఆరాధనాభావంతో ఎన్నాళ్లక్రితమో ఆగిపోయిన పద్యాన్ని కొమరభట్టు పూర్తి చెయ్యడం ఆ సన్నివేశానికి కథలో ఉదాత్తమైన స్థానాన్ని కల్పించింది.

యుద్ధరంగం:

వీరరస ప్రధానమైన కథ కాబట్టి అయువుపట్టైన యుద్ధ సన్నివేశాలకి అవసరమైనంత భాగం ఈ నాటకంలో దక్కినట్టే కనిపిస్తుంది.

జిలుగుటమ్ములు పాతించి, పారాలు తవ్వించి, నిడిపట్టు, అలిమేక, దిగుమజవ వంటి వ్యూహాలతో కూడిన చక్రబంధాన్ని రచించి నల్లసిద్ధి ఆధునిక యుద్ధతంత్రాలతో సాయుధసేనతో సమరశంఖారావం చేస్తే..

అడ్దాయుకటువ, అమలచెలిక, కుందలింగముకొంద, తూమువేరులను కాపాడటానికి బొల్లావును నియమించి, గోసంగి బలాలు , భండన విక్రములైన యాదవవీరులు, ఏనుగులను చంపడానికి ఎద్దులు, అశ్వాలను చంపడానికి అక్షీణసంఖ్యలో ఆవులనూ తరలించి, స్థైర్యమే సైన్యంగా, ఆత్మబలమే అంగరక్షణగా కాటరాజు బలగం రణభూమిలోకి దిగినట్టు చిత్రిస్తారు రచయిత.

దొనకొండలో ఉండవలసిన దోరవయసు బాలుడు పోచయ్య యుద్ధభూమిలో బాలచంద్రుడివలే భయంగొల్పి , వీరాభిమన్యుడివలె విజృంభించి చివరకు రాజభటులు ప్రయోగించిన విలుమూకలకూ, చాయలబల్లాలకూ బలి అవుతాడు. ఈ రకంగానే మిగతా యాదవముఖ్యులంతా హతమౌతారు.

పతాక సన్నివేశంలో తలపడ్ద కాటమరాజు, నల్లసిద్ధి తమ తమ తప్పొప్పులపై, బలమూ, బలగాల ప్రస్థావనతో రాజనీతి గురించి మాట్లాడుకునే సన్నివేశం  సందర్భోచితంగా ఉంటుంది.

మోవాకుల మీద లేఖ రాయడం కోసం ఎర్రయ్య తాటిచెట్టుని పెకలించుకురావడం అంతకుముందే ప్రచారంలో ఉన్న వీరగాథల్లోనే ఉండటం వల్ల ఆరుద్ర గారు తేదలచుకున్న రామాయణ సామ్యానికి హనుమంతుడి బలానికి పోలిక సరిపోయింది.

భీకర యుద్ధసన్నివేశాల్లో, బీభత్సరసం ఆయువుపట్టుగా సాగే సందర్భాల్లో రంగస్థలం మీద చూపించడానికి ఉన్న పరిమితుల దృష్ట్యా అటువంటి సన్నివేశాల్ని ఛాయానాటకం టెక్నిక్ ద్వారా చూపించారు.

సందేశం:

యాదవులు రాచరికపు నాగరికతల దృష్ట్యా వెనకబడినవారు. దేశసంపదలోని స్వయంసమృద్ధికి ఆయువుపట్టైన పశుగణాన్ని ప్రాణాధికంగా కాపాడి అహర్నిశలూ వాటి క్షేమాన్ని కోరుకునే అమాయకజాతి. రాజులకి పశుగణాలు కేవలం సంపద ఐతే యాదవులకి అవి దైవ స్వరూపాలు. గోవుని మాతగా పూజించే భారతీయ సంస్కృతిని వంటబట్టించుకుని బొల్లావుని విష్ణుస్వరూపంగా ఆరాధించినవారు. అటువంటి ఒక నిర్మలమైన జాతిని, ఆ జాతి జీవనాధారమైన పశు సంపదను నిర్మూలించడానికి ఆధునిక పరికరాల్ని, మందుగుండునూ వాడి, ఆర్ధికంగా సాస్కృతికంగా వినాశనాన్ని కొనితెచ్చిన ప్రతిపక్షమే నెల్లూరిరాజులని నిరసించడమే ఈ నాటకంలోని ముఖ్యోద్దేశం.

అన్ని పాత్రలకూ సరిపడినంత స్థలమూ, అన్ని సన్నివేశాలకూ సమాన ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అంతర్లీనంగా తానుఎంచుకున్న కోణం నుండి కథను రసవత్తరంగా చూపించడంలో రచయిత సఫలీకృతుడయ్యాడనే చెప్పవచ్చు.

వచనంలో శబ్ధలయ

పద్యాలకైతే ప్రాసయతులు, గణాల గుణగణాల వల్ల స్వతహాగా శబ్ధ సౌందర్యం అబ్బుతుంది. వచనంలో ఆ లయను సాధించడానికి శబ్ధాల పలుకుబడిపై అవగాహన, నాటక ప్రదర్శనలో వాచకం పై పట్టు కుదరాలి. ఈ నాటకంలో అవి చక్కగా కుదిరాయి. సంభాషణలు హాయిగా లయాత్మకంగా సాగుతాయి.

మచ్చుకి కొన్నిమాటలు:

 • వెర్రిగొల్లలు వెక్కిరిస్తే నాదేం పోదు.  ఓండ్రకప్పకు నోరు గొప్పదే. దెబ్బల యెలుగులాగ మీరు బొబ్బరిస్తే ఏం భయపడం. గొల్ల వంకరబుద్ధి గొబ్బున మానండి.
 • మీరు ముడుపులోని కనకంలాంటివారు. మేము ముడుపుపైన ముద్రవంటివారం. ముద్రలుపోనిదే ముడుపుపోదు. మీరు కన్నయితే మేము కంటికి రెప్పల వంటి వాళ్లము, రెప్పకు హాని రానిదే కంటికి దెబ్బ తగలదు.
 • ఆవులు అల్లకల్లోలం చేస్తున్నాయి ప్రభూ! కొమ్ముటేనుగులను కూలదోస్తున్నాయి. అశ్వాలసేనపై అమాంతంగా పడుతున్నాయి.

తెలుగు నుడికారం, జాతీయాలు, వాడుక పదాలు:

ఈ నాటక రచనలో కథనాన్ని నల్లేరు మీద నడిపించి వీరరసాన్ని విరివిగా ఒలికించడానికి ఆరుద్ర ఎంతో చాకచక్యంగా అలవోకగా వాడిన జాతీయాలు ప్రధాన కారణం. తెలుగు భాష, వాడుక పదాలు, నుడికారం వంటివాటిపై ఆయనకున్న పట్టు ఎన్నోచోట్ల తేటతెల్లమౌతుంది. అటువంటి కొన్ని వాడుకలు:

 • పుల్లరి – కప్పం, సుంకం, శిస్తు వంటిది. పశువులను పరాయి గడ్దపై మేపుకోనిచ్చినందుకు ప్రతిగా చెల్లించవలసిన రుసుము.
 • శుద్ధకాంతలు – అంతఃపుర కాంతలని శుద్ధకాంతలు అని వ్యవహరిస్తారు, ఒకచోట
 • ఏరాలి కొడుకు – సవతి కొడుకు
 • పొరుపులు –  పొరపొచ్చాలు
 • రాణువలు- సేనలు
 • కూటయుద్ధం – అధర్మయుద్ధం
 • సాగుమానం: సహగమనానికి వికృతి రూపం కావచ్చు
 • సృగాలాలు – నక్కలు
 • కెంధూళి – గోధూళి కి మరో రూపం (కెంపు+ధూళి)

జాతీయాలు:

 • పుచ్చకాయల దొంగంటే భుజాలెందుకు తడుముకుంటావు?
 • అవ్వపేరే ముసలమ్మ
 • బావిలో నీళ్ళు వెల్లువపోతాయా?
 • మాణిక్యం మహారాజు శిరసున ఉండాలికానీ మసిపాతన ఉంటే ఏం లాభం?
 • వెర్రివాడు వేడుక చూడబోతే వెతకడానికి ఇద్దరూ, ఏడవడానికి ముగ్గురూ
 • మెడపట్టుకు గెంటుతూ ఉంటే చూరుపట్టుకు వేళ్ళాడే స్వభావం
 • ఏరునిండి పారితే వెంపలిచెట్టు ఆపగలదా?
 • ఆశీర్వదించేప్పుడు అధ్యాహారం ఉంచరాదే!
 • ఉడుమునకే గాని ఉత్తమునకు రెండు నాలకలుండవమ్మా!
 • శత్రువులను చంపి తలపూలు వాడకుండా తిరిగిరండి

పద్యాల పదును:

కంఠమెత్తి రాగాలాపన చెయ్యడానికి వీలైన పద్యాలు లేని నాటకాన్ని తెలుగువాడు ఆదరించడు అనే రహస్యాన్ని తెలిసినవాడు కావడం చేత అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కొన్ని చాటు పద్యాలను, వీరగాథల్లోని ద్విపద పంక్తుల్ని గ్రహించి కథలో ఉపయోగించారు. ఐతే వీటిల్లో ఏవి సేకరించినవి, ఏవి ఆయన రచించినవి అన్న సంగతి స్పష్టంగా లేదు.

రాగయుక్తంగా పాడుకోదగ్గవిగా, సరళంగా ఉన్న కొన్ని పద్యాలు:
సీ!!

సాబేతు ముసరతో ఆబోతు శుష్కించి
కంటి నెత్తుటిధార కార్చసాగె
రిల్లనొప్పి జనించి పుల్లావు వెతనొంది
నాలుగ్గడులుగూడ నడువలేదు
ముగ్గురోగముతోడ నిగ్గుచెడి పసరమ్ము
లుయ్యాలపోలిక నూగసాగె
నాలుకచేరితో నరములుబ్బిన గొడ్డు
“అంబా” యటంచైన నార్చలేదు.

పై పద్యంలో పశుజాతులు, వాటి వ్యాధులపై అవగాహన ఉన్నవాళ్లకి కాటకపరిస్థిని, అంటువ్యాధులను కరుణరసాత్మకంగా కళ్లకు కట్టారు.

సీ!!

వెండి కొండలదండు విహరించునట్లు
వెల్లావుమందలు వెడలసాగె
నల్ల మబ్బులమూక నభమువీడినభంగి
కర్రియావులమంద కదలసాగె
పొంగిపారిన నదుల్ భువిని వలంచెడి పోల్కి
లేగదూడలు త్రుళ్లసాగదొడగె
ఏడుసంద్రమ్ములు కూడినడచెడురీతి
ఎద్దులాబోతులు నేగసాగె

గీ!!

విచ్చుకత్తుల వారలు వింటిమూక
వేయ గుర్రాల కంపటీల్ వెంటరాగ
ధరణి కంపించ దిక్కులు దద్దరిల్ల
పశులమందలు నెల్లూరి పథముపట్టె

సీ!!

పోట్లాట కుడుముల వేట్లాటవంటిదా
క్రొవ్వి పోరికి కాలుదువ్వరాదు
ఆలమ్ముసేయుటపాలుపిండుటకాదు
బరితెగించి తొడలు చరచరాదు
కదనమ్ము చేయుట కావడిమోయుటా
కలహించి కచ్చలు కట్టరాదు
యుద్ధమొనర్చుట యెద్దులంతోలుటా
కావరమ్మున కత్తి కట్టరాదు

అని రాయశృంగారభట్టు యాదవులను హెచ్చరించిన సందర్భంలో రాజసూయ యాగం లో శిశుపాలుడు కృష్ణుని హేళన చేసిన పోలిక లీలగా గుర్తుకు వస్తుంది.

రమ్మను సిద్ధిభూవరుని రాణువతో కదనమ్ము సేయగా
రమ్మను. చేవదప్పి సమరమ్మును చేసెడి శక్తిలేనిచో
నమ్మకమొప్ప మాదుచరణమ్ములపై శరణంచువాలగా
రమ్మను. యుద్ధమందు తన రాకడ పోకడలొక్కటేయగున్.

బెజవాడ బెబ్బులి పెయ్యలెర్రయ లేచి
కోడెదూడల నుసికొల్పునాడు
వెలమవీరుడు మాదు చెలుడు రాఘవుడల్లి
మింటమంటలు కురిపించునాడు
అరిభయంకరమూర్తి అయితన్న యేతెంచి
రిపుల కుత్తుకలుత్తరించునాడు
గోసంగి బీరన్న కోపించి రుద్రుడై
కొగంవాల్ కత్తితో కోయునాడు

అని కాటమరాజు భట్టుని హెచ్చరించినప్పుడు “అలుగుటయే ఎరుంగని” అన్న తిరుపతి వెంకట కవుల పద్యం స్ఫురిస్తుంది.

స్వల్ప సందేహాలు:

కొన్ని సందర్భాల్లో “ఇక్కడ ఇలా ఎందుకు ఉందో!” అని చిన్నపాటి సందేహాల్ని కలిగించిన అంశాలు;

 • పదమూడవ శతాబ్ధానికి చెందిన కథలో “అలగాజనం, దొమ్మి” అనే పదాలు పొసగలేదేమో అనిపిస్తుంది.
 • సిరిదేవమ్మ ఏదో తప్పుడు కోరిక కోరి ఉంటుదన్న అనుమానంతో, “పాపనూకమ్మ లాగా నిన్ను కూడా ఒంటిస్థంభం మేడలో పెట్టిస్తాడు.” అంటాడు పోచయ్య. పాపనూకమ్మ దుష్టనక్షత్రంలో పుట్టి అరిష్టాలు సంభవిస్తున్నందున ఆమెని దూరంగా ఉంచడాన్ని, తప్పుడు ఆలోచనలకు శిక్షతో పోల్చడం అసమంజసంగా ఉంది.
 • మాలవాడి కొడుకు గోసంగి బీరన్నను “ఎడమరొమ్మిస్తే ఎడమైపోతాడని కుడిరొమ్ముకుడిపి అసమానంగా సాకేవు” అని సిరిదేవమ్మని ఉద్దేశించి అయితమరాజు అంటాడు. ఆ సందర్భంలో అది వెటకారంగా ధ్వనించినా, చివరికి యుద్ధ సందర్భంలో బీరన్న అదే మాట వాడుతూ తల్లి ఋణం  తీర్చుకోవలసి ఉందని కాటమరాజుతో అంటాడు. ఈ మాట అబద్ధమని కానీ, ఖండించినట్టు కానీ ఎక్కడా కనపడదు. మరి అటువంటి తరతమభేదాలు చూపని తల్లి, కళ్లల్లో నిప్పులు పోసుకుని కాటమరాజు పీడ విరగడ కావాలని చూస్తున్నట్టు రచయిత అగుమంచి ద్వారా చెప్పిస్తాడు. సిరిదేవమ్మ పాత్రలో ఈ వైరుద్ధ్యం కొంచం అసంబద్ధంగా అనిపిస్తుంది. కథకు రామాయణంతో పోలిక తీసుకురావడం కోసం ఈ పాత్రని కైకేయితో పోల్చినట్టుగా అనిపిస్తుంది.
 • బొల్లావు యాదవుల కులదైవమనీ, విష్ణుమూర్తి అంశమనీ చాలాసార్లు ఉటంకించబడుతుంది. కాకపోతే ఆ ఆవుయొక్క ప్రత్యేకత, విశిష్టతల గురించి యాదవులతో చెప్పించి ఉంటే బాగుండేది.
 • ఖడ్గ తిక్కన మరణించిన తర్వాత అతని భార్య జానమ్మ సహగమనం చేసిన సంగతి, ఈ కథలోని సహగమనాల విషయమూ గురించి చారిత్రకంగా ఆధారాలున్నప్పటికి, స్త్రీవాదం ప్రబలుతున్న ఆధునిక కాలానికి అణుగుణంగా ఆ విషయాలను ఆరుద్ర పరిహరించారని ముందుమాటలో చెబుతారు. ఐతే చరిత్ర ఆధారంగా రాసిన నాటకం కాబట్టి ఆ కాలపు ఆచారాలు, సాంఘిక పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి కీలకమైన ఇటువంటి సంగతులను రచయిత అభ్యుదయ వాదానికి అతీతంగా ప్రస్తావించి ఉంటేనే సముచితంగా ఉండేదేమో అనిపిస్తుంది. ఇదే నాటకంలో మరొక చోట ఇద్దరు భటులు మాట్లాడుకుంటున్న సందర్భంలో తాను ఓలి (కన్యాశుల్కానికి మరొక రూపం) చెల్లించి పెళ్ళాడిన సంగతి చెబుతాడు ఒక భటుడు. ఇది కూడా ఒకరకంగా దురాచారమైనప్పటికీ రచయిత ప్రస్తావించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
 • యుద్ధం మొదలవకముందు వరకూ ఇరుపక్షాలవారినీ (కన్నమదేవి, రాయశృంగార భట్టు మినహా)ధర్మబద్ధులుగా, నీతిపరులుగా చూపించి యుద్ధం మొదలెయిన తర్వాత నల్లసిద్ధిది అధర్మయుద్ధంగా చిత్రీకరించడానికి (ఆవులకి ప్రతిగా మందుగుండు సామాగ్రి వాడటం మినహా) చారిత్రకంగా ఆధారాలేవైనా ఉన్నాయా లేక కథానాయకుడి పక్షాన ప్రేక్షకుడిని నైతికంగా చేర్చడమే ప్రధాన కారణమా అన్నది ఒక సందేహం. కన్నమదేవి ఎంత కోరినా యాదవుల భక్తికీ, నమ్మకానికీ విలువనిచ్చి వారి బొల్లావుని కోరకపోవడం, చివరికి యుద్ధం జరుగుతూ ఉండగా కన్నమదేవి అకృత్యాలను తెలుసుకున్న నల్లసిద్ధి పక్షపాతం వహించకుండా ఆమెని శిక్షించడం వరకూ కూడా రాజు ప్రవర్తన సముచితంగానే అనిపిస్తుంది. పైగా ఆయన రాజ్యంలో లేనప్పుడు యాదవులు ఆవేశంతో చిలకను సంహరించడంతో మొదలై, కన్నమదేవి ఆగ్రహంతో అకృత్యాలు చేయించడం తిరిగి యాదవులు ఆవులతో దాడి చేసి రాజ్యంలో బీభత్సం సృష్టించడం వరకూ నల్లసిద్ధికి ఏమీ తెలియదు. అతడి ప్రమేయం ఏమీ లేకుండానే ఇరుపక్షాల మధ్యా ప్రతీకార వాంఛ తారస్థాయికి చేరుతుంది. తన రాజ్యమూ, ప్రజాజీవితమూ యాదవుల కారణంగా అల్లకల్లోలమైందనే విషయం మాత్రమే తెలిసిన రాజు యుద్ధ ప్రకటన చెయ్యడం ఔచిత్యలేమిగా అనిపించదు.
 • తమ కులదైవమైన బొల్లావుగురించి హీనంగా మాట్లాడిన చిలకను ఆవేశంతో సంహరించిన యాదవులకీ, తన ప్రాణప్రదమైన చిలుక మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆవులని చంపించిన కన్నమదేవికీ మధ్య అసంకల్పితంగా, తమ నమ్మకానికీ, అహానికీ భంగం కలిగిన సందర్భంలో ఏర్పడే స్పర్ధ మొదలౌతుంది. తర్వాతి రాయభారమూ, యుద్ధప్రారంభమూ నామమాత్రమే. ఈ మొదటి వరస ఆవేశాల్లో కాటమరాజు, నల్లసిద్ధి ప్రత్యక్షంగా పాత్రలు కారు. తమ పశువులకు, ప్రజలకు అపకారం జరిగిన తర్వాతనే వారిద్దరూ ఆగ్రహానికి లోనౌతారు. కాబట్టి కదనానికి ప్రేరేపించిన వారిగానో, శాంతి కాముకులుగానో వారిద్దరిలో ఎవరినైనా అభివర్ణించడం సబబుగా అనిపించలేదు. ఇది కూడా ఈ నాటకానికి కథానాయకుడైన కాటమరాజు పట్ల పక్షపాత ధోరణిగా అనిపిస్తుంది.

ఈ పుస్తకం ముందుమాటలో ఉదహరించిన దిగుమర్తి సీతారామస్వామి గారి అభిప్రాయాన్ని ఉల్లంఘించి నాటకాన్ని చూడకుండా కేవలం చదివి మంచిచెడ్దలు ఎంచబోవడం దుస్సాహసమే. ఐనప్పటికీ ఈనాటికీ అతి సులభంగా అర్ధమయ్యే భాషలో, చిక్కటి పొదుపైన సంభాషణలతో ఆంధ్రుల చరిత్రలోని ఒకానొక జానపదేతిహాసం దొరుకుతున్నప్పుడు నాటకం చూసే అవకాశం కోసం వేచిచూడకుండా చదివేయడమే మంచిపని. ఈ పుస్తకం ప్రచురణకర్తలు ‘స్త్రీశక్తి  ప్రచురణలు, చెన్నై’.

——

మొదటిసారిగా పొద్దులో ప్రచురించబడింది.

తెల్లరంగు సీతాకోకచిలుకలు

అనుమానం;

చిన్నరేఖ పక్కన మరగుజ్జు గీతలు

కంటికి సమాంతరంగా సాగని చూపులు

ఎక్కడానికీ, దిగజారడానికీ అవే మెట్లు

—–

నమస్కారం;

తిరుగు రైలు లేదని తెలిసీ మా ఊరొచ్చిన స్నేహితులకి

మనిషిగా ఎదగమని అడ్డుతొలగిన ఆనందానికి

వైరాగ్యాన్ని అలవాటు చేసినందుకు వంచనకి

—–

అవసరం;

గాయపడని చోట ముందు చూపుతో కాస్త మందు

ఆత్మను కాపాడుకోడానికి అహానికో చెంపదెబ్బ

ఇంకా నేర్చుకోని పాఠాలకి కాసేపు విరామ చిహ్నం

—–

మొదటి ప్రచురణ మాలికలో

లావానలం

నీటి మడుగుచుట్టూ రెల్లుగడ్డి పహారా

నిర్భయంగా సుడులు రేపుతూ కలల గులకరాళ్ళు


దివారాత్రాల రాపిడిలో కళ్ల వెనక రంపపు పొడి
సంధ్య
ప్రవహిస్తున్న లోకాన్ని వ్యధల ఊబిలోంచి అచేతనంగా చూస్తూ
ఆశ
కొడిగట్టిన ఆత్మకు కవిత్వపు కొన ఊపిరులూదుతూ
అక్షరం

—-

ఓదార్చేందుకు ఎవరూలేని మరోచోట
రాత్రంతా బాధను దింపుకోవడానికి అవనతమౌతున్న సూర్యుడు.

యుగాలనుండీ అలానే పడి ఉన్నా
చుక్కల్ని కలిపి ముగ్గు పెట్టే దిక్కులేక
పాడుపడ్డ ఆకాశం.

చావు గీటురాయి మీద తప్ప
జీవితాన్ని విలువకట్టలేని అల్పత్వంతో
కాలంతో బేరాలాడుతూ మనం.

——

మొదటిప్రచురణ పొద్దులో

ప్రాప్తం

మళ్ళీ ఉదయం వచ్చి వెలుతురు మరకల్ని అంటించేవరకూ
ఈ రాత్రి స్వచ్ఛంగా మలుగుతుంది.

పచ్చని ఆకు జీవితానికి –
పట్టుమని ఒక్కగానొక్క వసంతం వరంగా దొరుకుతుంది.

చంచల చిత్తానికి-
పంచేంద్రియాలతో పంచుకోలేని ధ్యాన భిక్ష క్షణమాత్రపు సౌఖ్యాన్నిస్తుంది

మృత్యువు పాదాలమీద పడ్డ అనుభవం
జ్ఞానం వైపు చూసి ఏదో సంకేతాన్నిస్తుంది.

(మొదటి సారిగా ఈమాటలో)

నిర్వేదన

తనువుని తెంపిన
తొలకరి మొలక
తరువుగా మారాలని
తడిమట్టి తపస్సు

విరబూసిన పరిమళాల్ని
చిరుగాలిపై రువ్వుతూ
మూలాల్ని దాచిన
మొక్క మిడిసిపాటు

తానెన్నటికీ చూడలేని
వసంతాలను వర్షిస్తూ
లోతుగా ఎదుగుతున్న
వేరు వినమ్రత

—————-

మొదటి ప్రచురణ పొద్దులో