ఇప్పుడెందుకిలా?

అయ్యో! దిగులు..
మరో మనిషితో చెప్పుకోలేనంత,
మాటల ఆసరాతో దింపుకోలేనంత..

రోజూలానే ఆ సాయంత్రమూ –
లోతుతెలీని లోయలాంటి
ఒంటరితనంలో,
రాలిపడుతున్న
ఉసిరిచెట్టు ఆకుల మధ్య-

కుర్చీ చేతులకి మోచేతులప్పజెప్పి,
ఒళ్ళో పుస్తకం మీద
మసగ్గా అలుక్కుపోయిన
తడి అక్షరాలవైపు
పట్టలేనిజాలిని
ప్రసరించుకున్న
పల్చటి జ్ఞాపకాల్లా..
ఇప్పుడెందుకిలా??

————–

మొదటి ప్రచురణ ఈమాటలో

తమకరందం

ఆశలాంటి ఆకాశాన్ని..
కాసేపైనా కప్పుకోనివ్వక
ఆరాటపు మబ్బులు.
విశ్వగానంలో వాయులీనమవకుండా
విశృంఖల ఉద్రేకాలకి
మృణ్మయ దేహపు హద్దులు.

విషాదాగ్నిలో
వియోగ వీక్షణాల్ని విదిలిస్తూ
కంటిరెప్పల జంట తపస్సు.

సంయోగ సహయోగాల్లో వివశివమెత్తిన
వాఙ్మయపు నిశ్వాసల బరువు మోయడానికి..
అచ్చుల పిచ్చి ఆసరా.
కోట్లాది అణువుల లయవిన్యాసపు ఫలశృతిగా
సుఖమయ గంధాలనూ
రసహీన స్వప్నాలనూ
సగపాలుగా విరగ్గొడుతూ కన్నీటి ఉప్పదనం.

————–

మొదటి ప్రచురణ పొద్దులో

రసమయం జగతి

ఎంతో ఇష్టమైన పాటని రింగ్‌టోన్‌గా పెట్టుకోవటం ఎంత బుద్ధితక్కువ పని! ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వచ్చి, ఏదో శత్రుత్వం ఉన్నట్టు వీలైనంత త్వరగా పాట ఆపెయ్యాలి.

తడిచేతిని కర్చీఫ్‌తో తుడుచుకుని, ఫోన్‌ తీసి ‘విరించి’ అన్న పేరును చూస్తూ ‘హలో’ అన్నాను.

అటువైపు అలికిడి లేదు.

“మాట్లాడరే?” ఖాళీ అయిన లంచ్‌బాక్సును సర్దుతూ అన్నాను.

“ఓ… జగతీ, హలో” అవతలనుంచి.

“ఏమిటంత పరధ్యానం?” చెప్పటానికి పెద్ద విషయాలేం లేకుండా ఫోన్ చెయ్యరే ఎప్పుడూ!

“ఒక కథ రాయాలి.. “

“ఏమిటో సబ్జెక్ట్?”

“నీ గురించే”

“నా గురించి రాయడానికేముంది?”

“అదే నాకూ అర్ధం కాక…”

“టీజ్ చెయ్యడం కూడా మొదలెట్టారా?”

“……….”

“ఐతే మీకథ రెండు రోజుల క్రితం మొదలౌతుందేమో.”

“అంతకుముందు సంగతులతో మొదలెట్టి నువ్వే ఎందుకు రాయకూడదు?”

“……….”

“దీనిక్కూడా ఎందుకంత ఆలోచన?”

“ఎక్కడి నుంచి మొదలెడితే బావుంటుందో అని..”

“ఆహా! ఇక ఉంటా మరి.. నీకూ నీకథకి మధ్య నేనెందుకు.”

————————XXXX——————-

మధ్యాహ్నం మెయిల్ చూసినప్పటినుండీ ఒకటే పరధ్యానం, చెన్నైలో మా టీముకి రెండురోజులపాటు మేనేజ్మెంట్ ట్రైనింగ్. నేరుగా ఫన్‌ట్రిప్ అంటే ఫండ్స్ రావని, చెప్పుకోవడానికి గొప్పగా ఉండదనీ ఈ ట్రైనింగ్ ముసుగు. అక్కడికెళ్ళాక ఇంగ్లీష్ వ్యక్తిత్వ వికాస పుస్తకాలని కాసేపు వల్లించి ఐపోయిందనిపించెస్తారు ఎలాగూ.

అదెలాఉన్నా మళ్ళీ చెన్నై వెళ్లాలన్న నా కోరిక తీరుతున్నందుకు చెప్పలేనంత ఉత్సాహంగా ఉంది. హరితో ఇదివరికెన్నో సార్లు ‘ఒకసారి వెళ్ళొద్దాం’ అన్నాను. “ఇప్పుడెవరున్నారక్కడ? ఐనా చూద్దాంలే,” అంటాడు. వాయిదా వెయ్యడమంటే, ’వద్దు’ అని సామరస్యంగా చెప్పడం. ఇప్పుడు ఆఫీస్‌టూర్ కాబట్టి ఏమంటాడో! వీక్లీ టార్గెట్ పూర్తిచేసి ఇంటికెళ్ళేసరికి తలలో యుద్ధం జరుగుతున్నంత నొప్పి.

“ఏమిటింతాలస్యం? కొత్తగా ప్రమోషనొచ్చిన వాళ్ళకి ఇల్లు గుర్తురాదేమో, నేను మధ్యాహ్నం కూడా తినలేదు”తలుపు తీస్తూనే నైట్‌డ్రెస్లో, చేతిలో టీవీ రిమోటుతో నామీద కంప్లైంట్లతో సహా సిద్ధంగా ఉన్నాడు.

‘నువ్వాలస్యంగా వస్తే కంపెనీకోసం, మన ఫ్యూచర్‍కోసం కష్టపడ్డట్టు, అదే నేనైతే ఇల్లు గుర్తు లేనట్టూనా? అంత ఆకలున్న వాడివి వండుకోలేకపోయావా?’ ఇవేమీ అనలేదు, కొన్ని విషయాలు మాట్లాడి తలనొప్పి పెంచుకోవడం కన్నా త్వరగా పని చేసుకుంటే పడుకోవచ్చు. ఒక నీరసపు నవ్వు నవ్వి “వచ్చే వీకెండ్ చెన్నైలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది కొత్త మేనేజర్లకి” చాలా అసందర్భమైన సందర్భంలో ’కొత్త’ అనే పదాన్ని స్ట్రెస్ చేస్తూ చెప్పాను.

ఎదురు సమాధానం చెప్పకపోవడంతో అప్పటికే గిల్టీగా అనిపించినట్టుంది, “మనకి దొరికే రెండ్రోజులూ ఇలా ఆఫీస్ పనంటే.. విల్ మిస్ యూ! మానడానికి కుదరదా?”

‘నువ్వు నీ స్నేహితులతో షికార్లలోనో, ఇంట్లో టీవీలోనో మునిగిపోతే, నేను ఇల్లు శుభ్రం చేసుకుంటూ రాబోయే వారానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ప్రతివారం నేను .. విల్ యూ రియల్లీ మిస్ మీ?’ “ఊహూ, కుదరదు, పెర్ఫార్మెన్స్ ఎప్ప్రైజల్లో నెగెటివ్ వస్తుంది” నటనని మించి జీవించాను. మిస్సింగూ, వల్లకాడూ కాదు. ఆమాట కొస్తే ఎన్ని వారాంతాలు నేను లేకుండా నువ్వు స్నేహితులతో అరకులు, అజంతాలూ తిరగలేదు?

“చెత్త పాలసీలు. ఆడవాళ్ళకి ఎన్ని ఇబ్బందులుంటాయి?. ఇంతకీ లేడీ కొలీగ్స్ వస్తున్నారుగా! సర్లే వంట మొదలెట్టు.”

“ఎవరూ లేరు, ఒక్కదాన్నేగా మా టీంలో అమ్మాయిని” నిజమే అయినా, కసిగా చెప్పి నాపనైపోయినట్టు వీలైనంత నెమ్మదిగా లోపల్నుంచి వంట గది తలుపు నెట్టాను, చిరాకు శబ్ధమై బద్ధలవకుండా.

’నా గురించి నేను నిరంతరం తెలుసుకోవాలంటే ఎప్పుడూ నా పక్కన ఉండే నువ్వే నాకున్న ఏకైక ఆధారం’ అనుకున్నాను పెళ్ళైన కొత్తలో, అతుక్కుపోయి ఉన్నా వేరు వేరు దిక్కులకేసి చూసే బొమ్మా బొరుసుల్లా ఏకమైపోయిన జీవితం మనది. కానీ ఒకళ్ళనొకళ్ళం తెలుసుకుంటున్నామో, మిస్‌లీడ్ చేసుకుంటున్నామో అర్ధం కావట్లేదు. కొన్ని విషయాలు నీకు కేవలం అలవాట్లకు సంబంధించిన సమస్య. కానీ అవి నా విలువలకూ, వ్యక్తిత్వానికీ సరిపడనప్పుడు .. సారీ నేను మారలేను.

మొదట్లో ఒకసారడిగాను నానుంచి నువ్వేమాశిస్తున్నావని. “నాకు మా అమ్మలాగా ఎప్పుడేం కావాలో చూసుకోవాలి. మావాళ్ళతో గౌరవంగా, కలుపుగోలుగా ఉండాలి, వంట బాగా రాకపోయినా పర్లేదులే.. మరి నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావ్?”

“జీవిత కాలపు స్నేహం”

నీకు బాగా నవ్వొచ్చినట్టుంది “స్నేహం మాత్రమేనా? భార్యాభర్తలమే అయిపోయాం కదా”

నిజమే! ఇప్పటికీ భార్యభర్తలమే.. అరమరికల్లేని స్నేహంమాత్రం లేదు.

ఒకరిపై ఒకరం ఆధారపడి ఉండటాన్ని, అలా ఉండక తప్పని అవసరాన్ని.. దీన్నేనా మనం సహజీవనమని లోకాన్ని భ్రమింపజేస్తున్నాం?

……

నొప్పి నిదానించి కలలకు, కలతలకూ అందని మత్తు నిద్ర నాలోకి మెల్లగా జారుకుంటుంది. – థాంక్స్ టు పెయిన్ కిల్లర్స్.

ఏమిటో కలలోని మెలకువలాంటి వెచ్చదనం, చుట్టూ మూడేళ్ళుగా అలవాటైన వివశత్వపు కదలిక.

విసుక్కోలేదు, విదిల్చి కొట్టలేదు..

’ఆప్ట్రాల్ ఐ టూ నీడ్ యూ’

కొన్ని నిముషాలైతే మాత్రమేం? మనసుల మధ్య మొహమాటాలన్నీ పటాపంచలైపోయి, ప్రపంచమంతా అనవసరమనిపించేటంత పిచ్చిఆవేశంలో కాలిపోతూ.. ఆలోచనలూ, ఆరోపణలూ అన్నీఅనవసరమైపోయి.. ధ్యానమా, యోగమా?

సపది మదనానలో…

“ఇవ్వాళ బాస్ పిలిచాడు”

“ఊ..” దహతి మమ..

“ఈసారి రివిజన్లో నన్ను ప్రమోట్ చెయ్యొచ్చనిపిస్తుంది”

దహతి మమ మానసం..

“మన వాళ్ళేలే”

“అహా”….దేహి ముఖకమల..

“లోన్ పెట్టయినా కార్ కొనాలి. లేకపోతే ఎవడూ లెక్క చెయ్యడివ్వాళ.. ఎమంటావ్?”

“ష్హ్…..షటప్ హరీ”

“నీకు కెరీర్‍మీదా ఫ్యూచర్‍మీదా బొత్తిగా ధ్యాస ఉండదెందుకో”

“మరే,నిజం”

చీకట్లో నిశ్చలంగా చెట్టు కొమ్మలపై నిద్రిస్తున్న పక్షిగుంపుని టపాసులు పేల్చి చెదరగొట్టినట్టు…

ఏకాగ్రతలేని ఏకత్వ సాధన దేనితో సమానం, దేనికన్నా హీనం?

*******

మౌనంగా సెల్‍ వైబ్రేషన్ మోడ్లో గిలగిల్లాడుతుంటే తీసి ’విరించి’ అనే పేరు వెలుగుతుంటే’ ఏమిటింత పొద్దున్నే’ అనుకొంటూ పలకరించాను.

“నువ్వెక్కడ” అటునుండి..

“ఎయిర్‌ పోర్ట్‌లో.. బయల్దేరటానికి మరోఅరగంట పట్టొచ్చు”

“టైమ్ తెలీకుండా ఒక కథ చెప్పనా?”

“కొత్త కథ రాస్తున్నప్పుడే నేను గుర్తొస్తాననుకుంటా! ” బొత్తిగా నిజంలేని ఆరోపణ. ఎప్పట్లానే ఆయన కథ మంత్రముగ్ధంగా సాగిపోయింది. ఏసమయంలో ఐనా తనకథని, దాని వెనకున్న మధనని నాతో చెప్పగల చనువు, దాన్ని నిరంకుశంగా విమర్శించగల అధికారమూ నాకు ఈ రెండేళ్ల పరిచయంలో ఎప్పుడొచ్చాయో తెలీదుకానీ దానికి ముందు ఒక దశాబ్ధం నుంచీ ఆయన్ని పత్రికల్లో, పుస్తకాల్లో చదివి అభిమానించిన ధీమాకొద్దీ అప్పట్లో ఒక ఉత్తరం రాశాను. గత పదేళ్ళుగా వాడేసిన కథాంశాలూ, శైలిలో వచ్చిన రొటీన్నెస్, ఇప్పటి పాఠకులకి దగ్గరవ్వడం కోసం తనకి తాను దూరమౌతున్న రచనాత్మ , ఒక అభిమానిగా నేను ఆశించినది దక్కక ఎంత మోసపోయానో ప్రతీపేజీని అందులోని వాక్యాల్నీ ఉదహరిస్తూ ఏదో పూనిన ఆవేశం లో రాసేశాను.

కొన్ని నెలల తర్వాత నాకు సమాధానం వచ్చింది సమీక్ష కోసం పంపిన తన కొత్త పుస్తకంతో పాటు. విమర్శలు, అబిమానులు, అరోపణలూ కొత్త కాకపోయినా సరైన సమయంలో నా అభిప్రాయం, దాన్లోని వాస్తవం పనికొచ్చాయనీ, ఆ సమీక్షలోని నిజాయితీ తనకి చాలా అవసరమని దాని సారాంశం.

కథ చెప్పడం పూర్తిచేసి చివర్లో ” అక్కడికి నేనెప్పుడొచ్చినా నాపనులతో ఎక్కువ సమయం దొరకలేదు. నువ్వే వస్తున్నావుగా, ఈ రెండ్రోజులూ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు.”

రెండ్రోజులేం ఖర్మ కొందరెన్నాళ్ళు మాట్లాడినా చెప్పవలసిన విషయాలు మిగిలే ఉంటాయి.

“అలాగే! ఎనౌన్స్‌మెంటొచ్చింది. ఉంటా మరి.”

******

రాత్రంతా నిద్రపోనివ్వని హృదయఘోషతో, ఎప్పుడూ స్వర్గాన్నే చూస్తుండటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయతతో… అర్థంలేని అలల హోరుతో సముద్రం నిరంతరంగా ఏడుస్తుందట. చిన్న పిల్లాడొచ్చి కాలింగ్ బెల్ కొట్టి పారిపోయినట్టు ఏవో పూర్తిగా గుర్తొచ్చీరాని జ్ఞాపకాలు. గవ్వలదండల్ని ఎమోషనల్‍గా బహుమతి ఇచ్చుకున్న అడాలసెంట్ స్నేహాలు, బీచ్ ఒడ్డున అమ్మతో గడిపిన ఆఖరి సాయంత్రం. ఆమె పోయాక ఒంటరితనంతో పొగిలి పొగిలి అలలతో పంచుకున్న వేదనా.. ఇంకా..

“నీ పాటికి ట్రైనింగ్ క్లాస్ ఎగ్గొట్టి ఇక్కడొచ్చి కూర్చున్నావ్. ఎండలో ఇసుక ముద్దలనుకుని అలలు నీ పాదాలపైకి ఎగబాకటం… చూస్తూ ఉండిపోవచ్చు కానీ, ఎంత చలికాలపు ఎండైనా ఇన్ని గంటలు కష్టమమ్మా!”

“నాఏడుపు మీకు నవ్వులాటగా ఉంది కదా!” గొంతులోకి ఉక్రోషం రాకుండా కష్టపడుతున్నాను.

“నీ వయసెంత?”

చటుక్కున సూటిగా చూస్తే నాకళ్ళలో అనుమానం కనిపించిందేమో, “ఏం లేదు, ఈ వయసుకే ఇంత మౌనంగా ఉండటం గంభీరంగా కనపడాలనా?”

“ఏం నా వయసులో మీరిలా ఉండేవారు కాదా?” విషయం నామీదినుంచి మళ్ళించాలని..

“అప్పుడేమిటి, ఇప్పుడు మాత్రం నీలా ఎందుకున్నాను”

“నాకన్నా పదేళ్ళు పెద్దేమో! యుగాలక్రితం పుట్టినట్టు మాట్లాడతారు.” అరచేతిలో గవ్వల్ని గలగల్లాడిస్తూ తడి తుడుస్తున్నాను.

“లాభం లేదు. నువ్వు ప్రేమించటం మొదలెట్టాలమ్మాయ్” ఒక నిట్టూర్పుతోపాటు సముద్రతీరాన్నీ వదలడానికి సిద్ధమౌతూ ఆయన..

“ఎవర్నో?” పాదాలమీద ఇసుక దులుపుకుని, కాలి పట్టీలు మెల్లగా విదిలిస్తూ లేచి నిలబడ్డాను.

“నిన్నూ, నీజీవితాన్నీ! అన్నట్టు, ప్రతిసారీ అలా అనుమానంగా చూడకు, నాకిబ్బందిగా ఉంటుంది” తడిచిన చెప్పుల్ని తొడుక్కుని నాముందుగా నడుస్తూ.. ” లలిత నిన్ను తీసుకురమ్మని గట్టిగా చెప్పింది. ఈ రెండ్రోజులు హోటల్ రూమ్ వద్దని చెప్పెయ్యి ” నా వైపునుంచీ అదే నిర్ణయమైపోయినంత ధీమాగా..

ఒక్కదాన్నీ విసుగుపుట్టించుకోవాలని నాకూ లేదు.
*********

ఓ….హో” ఆశ్చర్యాన్ని కొన్ని క్షణాలపాటు సాగతీస్తూ అప్పుడే విన్న విషయాన్ని మరోసారి మననం చేసుకున్నాను.

“ఐతే లలితా పబ్లిషర్స్ వెనకున్న కథ ఇదన్నమాట. అడపాదడపా పత్రికల్లో కథలూ, సీరియళ్ళూ రాసే ఈయన హఠాత్తుగా నవలలు, నాన్-ఫిక్షన్ పుస్తకాలు వేసెయ్యడం. కొత్తగా పాఠకుల మార్కెట్ని కదిలించడం వెనకున్న బలం.” భోజనాలయ్యాక లలిత చెప్పే మాటలు వింటూ సాలోచనగా అన్నాను.

“అవసరమనుకున్న సబ్జెక్ట్ మీద పబ్లిషర్లు ఆసక్తి చూపించక, రీసెర్చ్‌ని వదులుకోలేక అసంతృప్తితో ఉండేవారు. ఫార్చునేట్లీ.. పబ్లిషింగ్ కంపెనీలో నాఅనుభవం బాగానే పనికొచ్చింది.” తలోదిక్కుకి పడున్న రిఫరెన్సు పుస్తకాలని తీసి అరలలో సర్దుతూ చిరునవ్వుతో ముక్తాయించారు ఆవిడ.

“’ఉదయాన్నే లేవాలి. మీరు కానివ్వండి” దూరంగా టేబిల్ మీద కాగితాలు పరుచుకుని రాసుకుంటున్న ఆయన్ని కూడా ఉద్దేశించి హాల్లోంచి ఆవిడ లోపలి గదిలోకి వెళ్ళిపోయాక చేతిలో పుస్తకం తిరగేస్తూ ఉండిపోయాను. రచనల తాలూకూ నోట్స్ అనుకుంటా అది. అక్కడక్కడా కొన్ని వాక్యాలు కొట్టివేతలతో, దిద్దుబాట్లతో ఉన్నాయి.

ఏకాగ్రత కుదరక తిరిగి పెట్టేశాను. కొన్ని నిముషాల అర్ధవంతమైన నిశ్శబ్ధం తర్వాత, ఏదిముందు బయటపడాలో తెలీక ఎన్నో మాటలు ఒకదాన్నొకటి ఢీకొని లోలోపలే సమసిపోతుండగా..

“నీ బాధేమిటో, నీ ఆలోచనలేమిటో ఆయనతో చెప్పి చూశావా?” ఊహించని ప్రసక్తితో ఉలిక్కిపడి చూశా! పొద్దున రాగానే నాగొడవంతా ఏకరువు పెట్టిన సంగతి అప్పుడే నవ్వుతూ వదిలేశారనుకున్నాను.

తేరుకుని “వాదనలతో అభిప్రాయాలు మారతాయేమో కానీ జీవితాలు కాదు.” తేల్చేసినట్టుగా అన్నాను.

దించిన తల ఎత్తకుండా రాసుకుంటూనే “వాదించడం వేరు. నీ వాదాన్ని వినిపించడం వేరు”

రచనల్లో పనికొస్తాయి ఈ మాటల మెలికలు. “అర్థం చేసుకోలేని మనిషికి చెప్పీ ఏముపయోగం?”

ఆయన ఏమీ అనలేదు. మళ్ళీ నేనే ఇంకేదో చెప్పుకోవాలనిపించి..

” అంత అర్ధం చేసుకునే భార్య ఉండగా ఎన్నిమాటలైనా చెబుతారు. మీకెలా తెలుస్తుంది నా గొడవ?”

రాస్తున్న కాగితాలు మూసి నవ్వుతూ “నా కంప్లైట్లు నాకూ ఉన్నాయి. దానికేమంటావ్?”

కుర్చీలోంచి లేచొచ్చి పూర్తి చేసిన కథ ఫైల్ నాకిచ్చి “నేను చూసిన ఈ రెండేళ్లలో నువ్వో వ్యక్తిగా ఉద్యోగంలోనూ, అనుభవంలోనూ చాలా ఎదిగావు. ఆ సంగతి నీతోనే ఉంటున్న ఆయనకి కనిపించదేమో. బహుశా నీక్కూడా అనిపించకపోవచ్చు.” నాకెదురుగా ఉన్న సోఫా కవర్ సరిచేసి అక్కడ కూర్చుంటూ “ఈ లెక్కన నేనైతే నీతో చాలా దురుసుగా ప్రవర్తించలేదూ ఒక్కోసారి. నా కథల్ని కఠినంగా విమర్శించినప్పుడు? మరి నాకూ నీమీద గౌరవం, అభిమానం లేనట్టా?” సరిగ్గా నా కళ్ళల్లోకి చూసేలా తలెత్తి మోకాళ్ల మీద మోచేతులానించుకుని అప్పుడే పేపర్లు ఫైల్ చెయ్యడానికి వాడిన ప్లాస్టిక్ పంచ్‌ను రెండు చేతుల్లోకీ మార్చుకుంటూ నన్ను ఇరకాటంలో పెట్టేశారు.

తప్పించుకోలేక తల వంచేసుకుని కథ చదువుతున్నట్టు నటిస్తున్నానో, నిజంగా చదవడానికి ప్రయత్నిస్తున్నానో..

“తీరిగ్గా చదవచ్చు, ముందిటు చూడు” ఆయన చేతిలోని పేపర్ పంచ్ విడిపోయి రెండు భాగాలూ చెరో చేతిలోకొచ్చి, కత్తిరించబడ్డ గుండ్రటి కాగితమ్ముక్కలన్నీ ఒక్కసారిగా నేలరాలాయి అప్పటిదాకా ఆపుకొని తల పైకెత్తగానే బయటపడ్డ నా కన్నీళ్లతో పాటు.

నేల మీద మోకాళ్ల దండ వేసినట్టు వంగి మా ఇద్దరి మధ్యలో పడున్న కాగితం ముక్కలన్నీ ఏరి అరచేతిలో వేసుకుంటూ..

“అసంతృప్తి అనేది ఎవరి జీవితంలో ఐనా ఎంతోకొంత ఉండక తప్పదు. కొన్ని ఎప్పటవప్పుడే మరిచిపోవాలేమో! ఏమంటావ్?” నా సమాధానం కోసం పైకి చూసి బదులిచ్చిన బాష్పధారతో చలించిపోయి..

“ఏందుకు తల్లీ! నీమీద నీకంత జాలి.. ఊర్కో”

సున్నితంగా చేత్తో తల నిమురుతూ పక్కనొచ్చి కూర్చుంటే ఆ వాత్సల్యాన్ని,సాన్నిహిత్యాన్నీ కాదనుకోవడం అయ్యేపనేనా? మనసెరిగిన అమ్మ దూరమయ్యాక, క్రమశిక్షణ పేరుతో మొదట్నుంచీ దూరంగా ఉన్న నాన్న, తన అవసరాలు తప్ప మరో ఆత్మీయతని ఆశించలేని, అందించలేని భర్త, మనసువిప్పి మాట్లాడేంత స్నేహాన్ని ఎవరితోనూ చెయ్యనివ్వని ఇంట్రావర్షన్ – ఎన్నేళ్ళుగా పేరుకుపోయిందో.. దుఃఖం!కాసింత ఓదార్పు దొరికితే మరింతగా పెల్లుబుకి అహాన్ని ముంచేయడమేగా దాని లక్షణం.

********

ఇంకా రాత్రి ఎనిమిదైనా కాలేదు, వచ్చేపోయే జనం మధ్యలో చిక్కటిచలి లైట్ల వెలుతురు చాటున కిటకిటలాడుతోంది. ట్రాఫిక్ మీద అపనమ్మకంతో బాగా ముందు బయల్దేరొచ్చానేమో నేనెక్కాల్సిన ఫ్లైట్‍కి మరోగంట టైముంది. ఒక్క గంటేమిటి రాబోయే ఋతువులన్నిటికీ సరిపడా ఆనందాన్ని, ఒక జీవితకాలం పాటు తోడుండే జ్ఞాపకాల్ని సంపాదించుకున్నానీ రెండ్రోజుల్లో. పొద్దునే లేచి అప్పట్లో అమ్మతో పాటు వెళ్ళే గోపాలపురం గుళ్ళో తిరుప్పావై వినొచ్చి, నే చదువుకున్న కాలేజ్ లైబ్రరీలో నా చోటునోసారి ఆత్మీయంగా తడిమి చూసుకుని, ఆరోజుల్లో ఇక్కడ అద్దెకున్న ఇంటి పక్కన తమిళ వాళ్లతో మాట్లాడి….

ఇవన్నీ అతి మామూలు, చిన్న చిన్న సంగతులు. కానీ పోగొట్టుకున్న మనుషులు, గతంలో వదిలి వచ్చిన స్థలాలూ, జ్ఞాపకాలూ తర్వాత అమూల్యమైన విలువని అపాదించుకుని బెంగగామారి మనిషిని తినేస్తున్నప్పుడు ఈమాత్రం సంగతులే మనుగడకో కొత్త అర్థాన్ని చూపిస్తాయి. అందులోనూ ఉద్వేగాన్ని పంచుకుంటూ, పాతగుర్తులతో మనసు వికలమైనప్పుడు ఊరటనిస్తూ వెంటఉన్న వ్యక్తి వల్ల మరింత తృప్తిగా అనిపించింది.

అంతేనా లేక రేపెప్పుడో కలగబోయే బెంగకు కొత్త పునాది పడుతుందో?

“మాటల్లో పడి మర్చిపోయాను. ఇది నీకోసమే.. చదువుతూ ఉండు, అర్జెంట్ ఫోనొకటి మాట్లాడొస్తా” పాకెట్‌బుక్‌లో మడత పెట్టున్న కాగితమొకటి నాచేతికిచ్చి రింగవుతున్న ఫోన్ నోరునొక్కి ఆయన దూరంగా వెళ్ళిపోవడం చూస్తునే ఆత్రంగా, కొంచం అనుమానంగా తెరిచానా ఉత్తరాన్ని..

జగతీ,

నీ ఆవేదన అర్ధమైంది. కానీ నీ ఆలోచనే భయపెడుతుంది.

మనమనుకునేవి అవతలి వాళ్ళు అర్ధం చేసుకోవట్లేదని బాధపడతాం కానీ అదే సమయంలో ఆ వ్యక్తి దేనిగురించి బాధపడుతున్నాడో అనే కనీస ఆలోచన కూడా రాదుకదా! అదే మనిషిలో ఉన్న మంచి విషయాల్ని చాలా కన్వీనియెంట్ గా స్వీకరించేస్తాం కానీ లోపాల్ని మాత్రం ప్రత్యేకంగా గమనిస్తూ మితిమీరిన గుర్తింపునిస్తూ ఉంటాం ఎన్నోసందర్భాల్లో.

మనిషిగా ఆనందంగా ఉండటానికి చాలా కావాలి; ప్రేమ, గౌరవం, సరదా, సంతోషం ఇవన్నీ. అన్నీ ఒక్కరినుంచే దొరకాలంటే అయ్యేపనేనా? మనిద్దరి స్నేహంలో ఉన్నఆరాధనా, నువ్వొక మేనేజర్‌గామాత్రమే తెలిసిన వాళ్లనుండి వచ్చే గౌరవమూ అన్నీ ఒక్క మనిషినుండే ఆశించడం నీ నిరాశకి మూలమని నాకనిపిస్తుంది.

ఒకరి అలవాట్లలో నీచమైనవి, ఆలోచనల్లోకెల్లా హీనమైనవి, మాటల్లోకెల్లా పరుషమైనవి.. అన్నిటినీ ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ కూడా మచ్చలేని అంకండిషనల్ ప్రేమ ఎవరికైనా ఎలా సాధ్యం?

అసందర్భమైనా మరొక్క విషయం – చాలా సార్లు అడిగావు నాకిష్టమైన పుస్తకం ఏదని. ’నా డైరీ ’. చదవటానికీ, రాయటానికీ కూడా బాగుంటుంది. జీవితం కూడా డైరీనే. పాత సంగతులు చదివి ఊరుకోవడం కాదు, కొత్త ఆశల్ని అందంగా, తెలివిగా రాసుకోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ నీకు తెలీదనో, నువ్వేదో అజ్ఞానంలో ఉంటే ఉన్నఫళాన ఇది చదివి మారిపోవాలనో నా ఉద్దేశం కాదు. ఒక్కసారి నీలోకి నువ్వు తరచిచూసుకుని నీ ఎమోషన్లకి నీమీద పెత్తనమివ్వకుండా జాగ్రత్త పడమని సలహా ఇవ్వడం..

మీరూ నాకే చెబుతారా అని మళ్ళీ నీ ముక్కు ఎర్రబడితే, కళ్ళు చెమ్మయితే; సారీ! నే తిరిగొచ్చేలోగా తుడిచేసుకో. పాఠాలెన్ని చెప్పినా, ఎంత కరుగ్గా ఆక్షేపించినా నీ నిస్సహాయతా, బాధా చూడాలంటే నాకు గుండెను కోస్తున్నట్టు ఉంటుంది.

————————

ఉత్తరం మడిచి హాండ్ బాగ్ లోకి తోశాను. చిత్రంగా కోపం,బాధా లేవు. కొన్ని విషయాలు తెలుసుకోవటానికి అడుగుతాం, కొన్నిమాత్రం తెలిసీ అడుగుతాం. ఒక్కో సమయంలో పరిష్కారాలు చూపించడం కన్నా సమస్యని ’అర్థం చేసుకోవడమే’ పెద్ద ఊరట. ఈయనింకా రాలేదేమిటా అని ఎంట్రన్సు వైపు చూస్తుంటే మహాబలిపురం వెళ్ళిన మాటీమ్‌మేట్లంతా అప్పుడే హడావిడిగా గ్లాస్‌డోర్ నెట్టుకుని లోపలికొస్తున్నారు.

*********

ఒక చేతిలో టీవీ రిమోట్‌తో, మరో చేతికీ, చెవికీ మధ్య సెల్తో ఇబ్బంది పడుతూ తలుపు తీశాడు హరి, శంఖు చక్రాలతో ప్రత్యక్షమైన విష్ణుమూర్తిలా. అవతల వైపు ఎవరు మాట్లాడుతున్నారో “ఏరా! అప్పుడే నిద్రపోయావా? పదింటికల్లా పడుకోవటానికి, ఇంటితిండి తినడానికీ రాసిపెట్టుండాలి. నువ్వు లక్కీరా.” నా వైపొక అసహనపు చూపు పడేసి తలుపేసుకునే బాధ్యత నాది కాబట్టి ఫోన్‌తో బాల్కనీలోకెళ్ళిపోయాడు. టీవీలో చిన్న పిల్లల పెద్ద తరహా డాన్సుల ప్రోగ్రాం హోరెత్తుతుంది. విసుగ్గా ఆపెయ్యబోయి ఎందుకో వాల్యూమ్ మాత్రం కొద్దిగా తగ్గించి లోపలికెళ్ళాను.

విసుగుకి పైమెట్టు నిర్లిప్తత ఐతే దాన్నెక్కకుండా కొత్తదారిలో జీవితాన్ని మరల్చడం.. నావల్లవుతుందా?

—————–XXXXX——————–

“అంతే! నే రాయగలిగిన కథ. మీ అభిప్రాయం చెప్పనే లేదు?” సెల్లో మరో కాల్ వెయిటింగ్ వస్తుంటే ఇక ఆగలేక అడిగేశా. పూర్తిచేసి పంపి ఇన్ని రోజులైనా ఏం మాట్లాడలేదంటే.. నచ్చలేదేమో!

“చెప్పటానికేం లేదు నాదగ్గర. ఒట్టి ‘థాంక్స్’ తప్ప.” ఆయన మాటల వెనకెప్పుడూ ఒక చిరునవ్వు లయ.

“అదేమిటి?” అయోమయం నాకు.

“నా మీద నమ్మకం, నా మాటల మీద విలువ ఉంచినందుకు..” నన్ను మరో మాట చెప్పనివ్వకుండా లైన్ కట్ చేసిన శబ్ధం.

జీవంలేని హృదయంలో పట్టనంత ప్రేమను నింపి, దాన్ని అనుభవించేలోగానే అధిగమించి ఆలోచించడమూ తనే నేర్పి, అమాయకపు ఉద్వేగాల్ని లొంగదియ్యడానికి వివేకాన్ని అరువిచ్చి,చివరికి కృతజ్ఞతలు కూడా చెప్పుకోనివ్వకుండా దారికి ఎదురొస్తే.

ఈ మనిషినేమనాలి? తప్పించుకుని ఎటెళ్లాలి?

***********

మొదటి ప్రచురణ పొద్దులో

ఇది వెన్నెల మాసమనీ

కొత్తగా వెల్ల వేసిన డాబా పిట్టగోడ మీద వెల్లికిలా పడుకుని ఆకాశాన్ని నిరాటంకంగా అనుభూతి చెందుతున్నాను ప్రతి రెండు నక్షత్రాల మధ్య దూరాన్ని లెక్ఖ కట్టుకుంటూ..
“అక్కా!ఇదే నెల?” నా చెల్లెలు. ఇదెప్పుడొచ్చిందో పైకి.
“వెన్నెల” తన్మయంగా చెప్పాను.
“ఒసే…య్.. ఇక్కడ్నుంచి తోసేస్తాన్నిన్ను.తెలుగు నెలల్లో ఇదే నెలా అని?”
“అబ్బా! ఏమిటే నీ గోల? కార్తీకం. అసలిక్కడికెందుకొచ్చావ్?” ఇది నిజంగా అన్నంత పని చెయ్యగలదు. జాగ్రత్తగా పిట్టగోడ దిగి డాబా మెట్ల మీద కూర్చోబోతుంటే విరగబడి నవ్వుతుందెందుకో. “ఏవిటే, వెర్రి నవ్వూ, నువ్వూనూ?”
“ఏం లేదు.నీ బట్టల్నిండా వెన్నెల”
అబ్బా సున్నం అంటింది. అవును వెన్నెల పిండారబోసినట్టుంది అంటాం కదా, సున్నమేసినట్టుంది అని కూడా అనొచ్చు ఇకనుంచి. నా అద్భుతమైన అలోచనని పంచుకుందామంటే  ’అక్కా! అసలు శనగపిండి తెల్లగా ఉందదు కాబట్టి బియ్యప్పిండి అనుకుందాం. అయినా అసలు పిండి ఎందుకారబోస్తాం? పురుగు పడితే కదా! మరి వెన్నెలకి పురుగు పట్టినట్టా?” అని గతంలో ఒకసారి ఈ పిల్ల నాకు విరక్తి తెప్పించిన విషయం గుర్తొచ్చి ఊరుకున్నా.
“మరైతే, శరదృతువన్న మాట!” వదలకుండా పక్కనొచ్చి కూచుంది. ఫర్లేదే దీనికి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. “ఊ!! బావుంటుంది కదా. నాకు భలే ఇష్టం వెన్నెలంటే.”
“అబ్బ ఛా! ఎవరికుండదు ఇష్టం. నీకు ఉండడం ఏదో గొప్పైనట్టు.” ఒక్కమాట సవ్యంగా రాదు దీని దగ్గర. ఏదో కాసేపు ఆనందపడనివ్వచ్చుగా.
“నువ్వు పక్కనుంటే ఆ ఇష్టం కాస్తా కష్టమౌతుందే. నే కిందకెళ్తున్నా. ఒక్కదానివే ఊరేగు.” ఒక దణ్ణం పెట్టి తులసికోట దగ్గర ప్రమిద లో నూనె పొయ్యడానికెళ్ళిపోయా!

*******

ఏదో పంచవర్ష ప్రణాళికలని పెద్ద గొప్పగా చెబుతారు కానీ ఐదేళ్లంటే ఏ మాత్రం? ఐదు వసంతాలని సంవత్సరాలని లెక్కెట్టే బదులు పది వెన్నెల మాసాలనుకోవడం మనసుకి చల్లగా ఉంటుంది కదా. కింద ఇంట్లో సన్నాయి మేళం. పెరట్లో వెన్నెల పందిరి కింద పెళ్ళి మండపం. మళ్ళీ కొత్త సున్నాలు వెలవెల బోయేలా కొత్తపెళ్ళికూతురి తలంబ్రాల చీరలాంటి స్వచ్చమైన తెల్లటి వెన్నెల సిగ్గుల మొగ్గలారబోసుకున్నట్టు.

“ఏమ్మా! కనిపించిందా అరుంధతి?” అదే డాబా మీద పురోహితుడు నా సమాధానమొస్తే పని కానిచ్చి వెళ్ళొచ్చని తొందర పడుతున్నాడు.  కొత్తచేతిలో ఇమిడిపోయిన చిటికిన వేలు సన్నగా వణుకుతుంది, మరి కొంగుముడి కూడా కంపిస్తుందేమో తెలీదు. ’కనపడినట్టే ఉంద” ని తల ఊపితే కిందకు రాలిన పసుపు రవ్వల్లాంటి తలంబ్రాల వెన్నెల.

“వెళ్ళొస్తానమ్మా!” అప్పగింతలయ్యాక కారెక్కుతూ ఎవర్నుద్దేశించన్నానో కూడా చెప్పలేను.
ఇంజన్ స్టార్ట్ అయి కదలబోతుంటే మనసాగక అద్దం దించి మళ్ళీ ఓసారి చెయ్యూపుతుంటే తిరిగి ఊపుతున్నవాళ్లలో చెల్లి కనపడలేదు.
“అదెక్కడమ్మా?” నాప్రశ్న హడావిడిలో ఎవరికీ వినపడనట్టుంది. అనుమానమేసి పైకి చూస్తే డాబా పిట్టగోడ మీద అటుతిరిగి కూర్చుని వెక్కెక్కి ఏడుస్తుంది వెర్రిగా  పిచ్చితల్లి.
ఉన్నట్టుండి నాకళ్లనిండా ఆత్మీయపు కన్నీటి వెన్నెల.

********

మొదటి ప్రచురణ ఆంధ్రజ్యోతి నవ్యలో 18-07-2010

హృదయము సంకెల జేసి

 

గేట్ తీస్తూనే చెప్పుల అరకేసి చూడవసర్లేదు, లోపల శబ్ధాల్ని ఆలకించి పసిగట్టాల్సిందేం లేదు. నువ్వు లోపల ఉండుంటే  మనసుకి ముందే తెలిసిపోతుంది. లేనందుకు కాదు బాధ.. ఉన్నావేమో అని కాసేపు ఆశపడే అదృష్టం లేదని.

అప్పటిదాకా తనలో ఉన్న మనిషి వెళ్ళిపోయినా కాసేపలా ఊగుతూ జ్ఞాపకాల ఊయల.

 నా మటుకు నాకు నువ్వు లేకపోవటమంటే అసలేమీ లేకపోవటం. నీకు వీడ్కోలు చెప్పి వెనక్కు తిరగ్గానే ప్రపంచమంతా పరాయిదైపోతుంది. Whenever you are not around, I terribily miss myself. బహుశా నీ ఉనికే లోకం వైపు సారే నా చూపులో జీవాన్ని నింపుతుంది. అరచేతి ఆలింగనంలో సెల్ ఫోన్ బిగుసుకుపోతుంది. “ఎలా ఉన్నావు” అని నువ్వడిగిన మాటలో కూడా ప్రపంచానికర్ధం కాని రహస్యమేదో నాకే చెప్తున్నట్టు తోస్తుందెందుకు? అయినా మాట్లాడితే బాధ పోతుందనుకోవటం పిచ్చితనం. కేవలం పొడి పొడి మాటలు గాయాన్ని మాన్పకపోగా నొప్పిని కదిల్చి వదిలితే, ఏ జారిపడిన సంతోష క్షణాల కోసమో దిగులు వృత్తంలో పిచ్చిగా వెంపర్లాడే గడియారపు ముళ్ళమైపోమూ! నీతో ఎంతసేపు గడిపానన్నది కాదు ,ప్రతి రోజూ నిన్ను కలుస్తాననే నమ్మకంతో రోజంతా ఉత్సాహంగా పనిచెయ్యటం; అదొక నిశ్చింత.  ఈ రాత్రికి కూడానిన్ను చూడకుండా నిద్ర పోవాలి అనే ఆలోచన చాలు మనసుని మెలిపెట్టడానికి.

 ఒకప్పుడు ప్రకృతంతా ప్రేమమయంగా అనిపించేది. నాలోని ఆర్తిని మొత్తం అందుకోవడానికో మనిషి దొరికాక ఇక కవిత్వంతో అవసరం పడలేదు.ఇప్పుడో! గుండెను మోయలేనంత బరువెక్కించే భావశూన్యం. నువ్వు లేకపోవటం వల్ల బాధో, ఓంటరిగా ఉండటం వల్ల బాధో తేల్చుకోవడానికి జనంలోకేళ్తే చుట్టూ ఉన్న మనుషుల రూపంలో ఒంటరితనం మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జనసందోహపు తలుపు సందులో చూపుడు వేలుపడి బయటికి పొంగలేని బాధ గడ్డకట్టి అక్కడో నల్లటి మచ్చ.

 వాన ముసురులా ఎడాపెడా జ్ఞాపకాలు, తలపుల్ని తడిపేస్తూ.

’ఎదురుచూపు లోని ఉద్విగ్నత ఎదురు చూసిన వస్తువులో లేదు. కలలు కన్నప్పటి ఆనందం అవి నిజమవ్వటంలో లేదు.’ అని నువ్వన్నప్పుడు ప్రేమలో కుడా ఇంత ప్రాక్టికల్‍గా ఎలా ఉంటారో? అనిపిస్తుంది. సందేహాన్ని నిందగా మార్చి ’నా అందం, వయసు అంటేనే నీకు ఆకర్షణ’ అని ఆమాటకూడా బయటికనేస్తే..ఒక భావగర్భితమైన నవ్వుతో నువ్వంటావు..

“మల్లెపువ్వుని గుండెమీదో, గుళ్ళోనో ఉంచి ఉన్నతంగా ప్రేమించగలిగినప్పుడు, వాడిపోయాక పుస్తకం మధ్యలో పెట్టుకుని గుర్తుంచుకున్నప్పుడు, ఆ పువ్వు కొంత సేపైనా అందంగా ఉండటం నా ప్రేమకి సంబంధించి కేవలం యాదృచ్చికం. నీ రూపం, నడక, కదలిక, మొత్తంగా ఒక సున్నితత్వపు గ్రేస్‍ని, విషాదంలోని నిశ్శబ్ధపు భారాన్ని, విరహంలోని వివవశతను, ఆకులుగా రేకులుగా, రంగులుగా విడదీసి అస్వాదించటం నాకు రాదు. నువ్వు నువ్వుగానే నాకిష్టం. నీకన్నా అందమైన, తెలివైన, సుకుమారమైన వాళ్ళు ఎందరున్నా నీలో నాకు దొరికే unique combination మాత్రం మరెవర్లోనూ కనపడదు.”

ఈ మాటలు తలచుకున్న ప్రతి సారీ శరీరమంతా మొద్దుబారి పోతుంది, కదిలితే ఈ తన్మయత్వమంతా ఎటు పోతుందో అని భయం.

 ఏకాంతంలో ఒక ప్రేమగీతం మనసునిండా గింగిర్లు తిరుగుతుంటే, అంత ప్రేమనీ ఒక్క పిలుపుతో గొంతుదాటనిద్దామంటే ఎవరున్నారు నా దగ్గర? పలికే వారు లేరని పెదవులాగాయేమో కానీ, తుడిచేవారు లేరని కన్నీళ్ళాగవు. వణికించే చలిగాలులాగి వసంతపు చల్లటి గాలులు తోలేలోపు, పోనీ ఆ కాస్త వెచ్చదనమూ వేడి సెగలైపోయే లోపు కొన్ని నిముషాల్ని ఎలాగో గుప్పిట పట్టి ఉంచుతాను. ఆదమరచి ఏ రాలుతున్న పూల కోసమో దోసిలి ఒగ్గి వదిలేసేలోపు నువ్వొచ్చి అపురూపంగా అందుకుంటావా?

(మొదటి ప్రచురణ ఆంధ్ర జ్యోతి నవ్య లో – 03-06-2010)

మానస వీణ – మధుగీతం

నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడుతున్నప్పుడు ఆ సంగమ సరిగమ స్వర పారిజాతాలతో తేటలూరు తెలుగుకు పుష్యమి పువ్వుల పూజ చేసిన పాటలూరివాడు మన వేటూరి. తన కవనాలలోని తొలిప్రాస తియ్యదనం తెలిసిన వాడు కనకనే సినీ యవనికపై మధుసంతకాలతో మృదుపాణి అయ్యాడు. ఆ కలం పిలిచినా, పలికినా రాగమే, అక్షరాలు పదబంధాలై చేరువైనా, చిలిపి విరుపుల మెరుపులై దూరమైనా ఆనందమే. సత్యసాధనకు, సత్వశోధనకు ప్రాణమైన సంగీత సరస్వతికి ప్రధమంగా గాన సరసీరుహ మాలికలర్పించి శృతి నీవు గతి నీవు అని నమస్కరించి, చంద్రకళాధర సహృదయుడినీ నాదశరీరాభరుడినీ స్మరించుకుని, మరి శ్రీరాముని సంగతేమిటంటే ’ఎరిగిన వారికి యదలో ఉన్నాడు, ఎరగని వారికి ఎదుటనే ఉన్నాడు’ అని వేదాంత ధోరణిలో దిగుతాడీ సుందర రాముడు.

పాపి కొండల నలుపు కడగలేక నవ్వుకున్న గోదావరి ఉరకలై ఆయన ఒడిలోనికి ఉరికితే ఏమీ ఎరగనట్టు కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అని బుకాయించాడు. సుడులు తిరుగు శుభగాత్రి తన కవితా గంగోత్రిని జీవనవాహినిగా చేసుకుని శరదృతు కావేరి వంటి ప్రవాహ ఉధృతినీ చూపించారు. ఇన్ని సాహితీ నదుల్లో మనని ఓలలాడించి, ప్రణవ/ప్రణయ సాగర సంగమాలు మాత్రం భారత భారతి పదసన్నిధిలోనే జరగాలని పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు.

భూలోకుల కన్నుసోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తానని మాటిచ్చి శబ్ధానువాద వెన్నెలని రప్పించి, ఆనక వచ్చాక నల్లని కురుల నట్టడువుల్లో ఆయన మాయమైపోతే.. నీశాంత మహీచ శకుంత మరందం వినపడేదాకా ఎదురుచూడక తప్పలేదు. కలిసే ప్రతి సంధ్యలో ప్రతి గొంతులో అల్లాడే గుండే పిలుపుల్ని, నిదురించు వేళ హృదయాంచలాన అలలై పొంగే భావ భంగిమల్ని అభినయ వేదంగా, ఆంగికమౌ తపముగా ఆచరించాడు.

ముకుళించే పెదవుల్లో మురిపాల్ని చక్కిలిగింతల రాగంలో శృతిచేసి, ఋతువుల్లో మధువంతా శ్రోతలకి సగపాలు పంచారు. ఆయన కలమొచ్చి కురిసేదాకా ఎవరూ అనుకోలేదు భావుకత్వమొక శ్రావణ మేఘమని, ఆ వానలో తడవడమొక తీరని దాహమని. ఆ వర్షాకాలం కాస్తా వెళ్ళిపోతుంటే సరస్సులో శరత్తు కోసం తపస్సులు చేసి జగాలులేనీ సీమలో, యుగాలు దాటే ప్రేమలో రససిద్ధిని సాధించారు. ఇంత శృంగారాన్నీ ఒలికించి సన్నాయి జళ్ళోంచి సందేళ లాగేసిన సంపెంగ సంగతి మాత్రం దాటేస్తారు. అదేమంటే మరునికి మర్యాదలు చేసి చేసి అలసిపోయానంటారు.

ఆయన ప్రౌఢభాషా ప్రయోగాలని, యావదాంధ్ర అచ్చెరువున విచ్చిన కన్నులతో చూస్తుంటే, తను మాత్రం నేనింకా బాలగోపాలుణ్నే అంటూ సెంచరీలు కొట్టే వయస్సుల్ని, బౌండరీలు దాటే మనసుల్నీ ఆకట్టుకున్నాడు. టప్పులూ,టిప్పులూ, దుప్పటి చిల్లులూ అంటూ చిలిపితనాన్ని ఆరబోసాడు. మొదటిగా చిలక్కొట్టుడు కొట్టిననాటినుండీ ఆ మాస్ పాటలకి వెర్రెక్కిన వాళ్లని చూసి, నన్నీ పాటల్లోకి ’ఈలకొట్టి లాగుతారు ఆంద్రా జనం’ అని ముచ్చటగా విసుకున్నాడు.

ఇన్ని దారుల్లో ఏకకాలంలో నడుస్తూనే ’ఏదారెటు పోతుందో ఎవరినీ అడగక’ అని తాత్వికతను రంగరించి ’నేను నేననుకుంటె యదచీకటి’ అని విశాలత్వాన్ని ఉద్భోదించారు.బహుశా సురసీమల సినిమాలకు తన అవసరముందని వెళ్ళిపోతూ కూడా ’గతించిపోని గాధ నేన’ని ముందు తరాలకి భరోసా ఇచ్చిన దీరోధాత్తుడు వేటూరికి ఇదొక పాటపోగు.

శిశిరానికి చోటీయకు..

ఇంత చిన్న జీవితానికి అంతలేసి వేదనలెందుకిస్తావు స్వామీ! పంచుకునే హృదయమేమో అనంతమైన సంశయాల ఆవల, ఇక ఈ బరువంతా అక్షరాలపైకి దింపుకోవాల్సిందే. తనువు కృశించి, మనసు దహించి.. రేపటిపై ఆశ నశించి… ఒక్క క్షణం, ఈ నిరంతరాయ నిర్వేదం నుండి విడిపడి, ఒక్క తేలికపాటి క్షణం నా అస్తిత్వమంతా తుళ్ళిపడేంతగా నవ్వే అదృష్టం ఎప్పటికి?

కొన్ని సంభాషణల్ని రికార్డ్ చెయ్యసర్లేదు, రాసి పెట్టుకోనవసర్లేదు . అతన్తో మాట్లాడిన ప్రతి మాటా అచ్చుతప్పులతో సహా గుర్తుంటాయి.
బాగా గిలకొట్టి మూత తీయగానే సీసా లోని ద్రవం బుస్సున పొంగినట్టు అణిచి పెట్టిన ఆక్రోశమంతా ఏకాంతం దొరగ్గానే ఎగదన్నుకొస్తుంది.
*****

’ఏమిటింకా ఉన్నావ్?’ మాములు పలకరింపులా అనిపించటానికి గొంతుని ఎంత మోడ్యులేట్ చేసుకున్నా ’థాంక్స్, నాకోసమింతసేపున్నావ్’ అనే కృతజ్ఞత దాగలేదు.
చాలా ఫార్మల్ గా నవ్వి ’కొంచం పనుంది’ అన్నాను. దారుణమైన అబద్ధం, మధ్యాహ్నం నుంచి ఖాళీ గానే ఉన్నాను. ఆ విషయం తనకి తెలుసు. ’మరి నువ్వు?’ ఏం చెబుతాడో చూద్దామని.. .

’ఏం లేదు. లాస్ట్ డే కదా. డెస్క్ లో ఉన్న నా వస్తువులన్నీ తీసి సర్దుకుంటున్నాను.’
’హ్మ్మ్!కాఫీ?’ చివరిసారి నాతో కలిసి కాసేపు కూర్చోవూ అనే అభ్యర్ధన ని చాలా కాజువల్ గా మార్చాను.
’ తప్పకుండా, పద వెళ్దాం.’ నిన్ననే ఖాళీ అయిన టేబుల్ అరలని ఇప్పుడే సర్దటం పూర్తయినట్టు నిట్టూర్చి లోపలకి తోశాడు.

ఆఫీస్ కాఫెటీరియా లో కూర్చున్నాం. ఆ చుట్టు పక్కలంతా సాయంత్రం షిఫ్ట్ జనాల భోజనం బాక్సులు, అక్కడక్కడా టేబుళ్ల మీద తాగి వదిలేసిన పేపర్ టీ కప్ లు. డ్యూటీ అయిపోయి బయల్దేరిన హౌస్ కీపింగ్ స్టాఫ్ యూనిఫామ్ లేకుండా చూస్తే కొత్త మనుషుల్లా ఉన్నారు. ఇందాకట్లాగా ’ఈ టేబుల్ కొంచం తుడువు బాబూ’ అని చెప్పాలంటే ఇప్పుడు అధికారం లేనట్టు అనిపిస్తుంది. అప్పుడే డ్యూటీ లోకి వచ్చి ఎర్రటి డ్రెస్ వేసుకున్న కొత్త అబ్బాయి ఎందుకో పొగలు కక్కుతున్న టీ కప్ లా అనిపించాడు.
’సో. ఏమంటున్నాడు జిడ్డు కృష్ణ మూర్తి?’ టేబుల్ మీద వేళ్లతో గీస్తూ మాటలు మొదలెట్టాడు.

నిన్ను నువ్వు అర్ధం చేసుకోవటానికి ఇతురులతో నీకున్న సంబంధాలే ఆధారం.  ఆఫ్టరాల్, సమాజమంటే నీలాంటి నువ్వు లు నాలాంటి నేను లు కొందరి మధ్య ఉండే సమీకరణాలే కదా. నీ అభిప్రాయం తో నిమిత్తం లేకుండా సమస్య ని యాధాతధం గా చూడగలిగితేనే గమనం.
’ఏముంది! క్రియేటివిటీ, రియాలిటీ, క్రియేటివ్ రియాలిటీ. సృజన కి పరిపూర్ణత, గమ్యమూ లేదట, నిశ్శబ్ధం లాగానే.’

పక్క టేబుల్ మీద ఇద్దరమ్మాయిలు ట్రైనింగ్ విశేషాలు ఉత్సాహం గా మధ్యల్లో పెద్దగా నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు. బహుశా, కొత్తగా ఉద్యోగం లో చేరినట్టున్నారు.

“మరి మన జనం ఏమంటున్నారు నా గురించి?”
నిక్షేపం లాంటి ఉద్యోగం వదిలేసి బొమ్మలేసుకుంటాను అంటే కామన్ సెన్స్ ఉన్నవాళ్ళెవరైనా ఏమంటారు? వెర్రి అంటారు, కొంచం మొహమాటముంటే ’ఆల్ ద బెస్ట్’ అంటారు.
“కొందరు నమ్మట్లేదు. ఏదో ఆఫర్ ని దాచి ఇలా చెప్పావని వాళ్ల అనుమానం.”
“ఊ!! అనుకోనిద్దాం. అవునింతకీ నాకిచ్చిన గిఫ్ట్ నువ్వేనా సెలెక్ట్ చేసింది. అది చూసి తెగ నవ్వుకున్నా.”
ఒక్క క్షణం చివుక్కుమనిపించింది. ఆ బహుమతి ఒక పెయింటింగ్. దాదాపు నిర్మానుష్యం గా ఉన్న రైల్వే స్టేషన్ లో బెంచ్ మీద ఒంటరిగా పుస్తకం చదువుకుంటూ ఓ కుర్రాడు, ఆ ప్లాట్ఫామ్ కి ఒక వైపు నుండి మరోవైపు కి గొలుసు ఆకారం లో ఒంపు తిరిగిన ట్రాక్. చాలా ముచ్చటగా అనిపించింది. కానీ ఇంతలా నవ్వుతాడనుకోలేదు.
“నీకు నచ్చుతుందనుకున్నా. టైం లేక ఈ దగ్గర్లో ఉన్న చిన్న షాప్ లో కొన్నాం.” ఛ, సంజాయిషీ కూడా ఇవ్వాల్సొచ్చింది.
“నవ్వితే నచ్చనట్టేనా? కొనేప్పుడు దాని కింద సంతకం చూడలేదా! పోయిన వారమే పూర్తి చేసి అక్కడిచ్చా.కొత్త స్టోర్ కదా డబ్బులివ్వలేదింకా. ఇవ్వాళెళ్ళి తెచ్చుకోవాలి”
“ఓహ్! నిజమా. ఇంకా నా టేస్ట్ ని ఎగతాళి చేస్తున్నావని ఫీలైపోయా” చిన్నగా నవ్వేశా.

“ఏమిటి, ఫేర్వెల్ మీటింగా?” ఓ కొలీగ్ అటుగా వెళ్తూ పలకరించాడు. కొందరి వెటకారం లో మాటల శాతం కనిపెట్టడం కష్టమే.ఇట్నుంచి యే సమాధానం లేకపోయినా ధారాళం గా అనుచిత సలహాలిస్తూ కాసేపక్కడే కూర్చున్నాడు. ఏ మాత్రం చనువు లేకపోయినా మరొకరి వ్యక్తిగత నిర్ణయాలపై చాలా అధికారం తో మాట్లాడెయ్యడం కొందరికలవాటు. ఇదెదో ముదిరే ముందే ముగించాలని ఏదో అనబోయేంతలో అవతలివైపు నుండొచ్చింది సమాధానం క్లుప్తం గా  “థాంక్స్” అని. వెళ్ళిపొమ్మనే హెచ్చరిక అర్ధమైందనుకుంటా ’సరే మరి. నా షిఫ్ట్ మొదలౌతుంది, వస్తా’ అంటూ నిష్క్రమించాడు

కొన్ని సందర్భాలు చాలా చిరాకెత్తిస్తాయి. బయటికి రాలేని అసహనం అన్ని వైపుల్నించీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతా సవ్యం గా ఉన్నప్పుడు ఎవరో వచ్చి కనీసం మాట్లాడుకోలేనంత ఇబ్బందిని మన మధ్య పెట్టేసి జారుకుంటారు. నాకే ఇలా ఉంటే ఇంతసేపూ ఒక ఉపన్యాసానికి సబ్జెక్ట్ గా మారిన తన పరిస్థితి ఊహించుకోవాలి. లేత ఎరుపు లోకి మారిన ఆ చేతి వేళ్ళు చూడగానే  టేబిల్ మీద స్క్రిబ్లింగ్ పాడ్, పెన్సిల్ ఆ వైపు కి నెట్టి అరచేత్తో కప్ తిప్పుతూ కూర్చున్నాను. చేదెక్కిన నాలుక మీద చల్లారిన కాఫీ రుచి ఉప్పగా తగిలింది. ఆ ఉప్పదనపు పుట్టిళ్ళను దాయడానికి టిష్యూ పేపర్ తీసుకుని కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ నిల్చున్నాను. పుష్య మాసపు  చలి గాలులు తెరచిన అద్దాల్లోంచి తడి చెక్కిళ్ళను ఆరబెడుతున్నాయి. దూరం గా కొండరాళ్ళకవతల దీపాల కొలువులా చిన్న బస్తీ, మధ్యలోంచి కొన్ని క్షణాలు లయబద్ధం గా సాగుతూ లోకల్ ట్రైన్. కంపార్ట్మెంట్ డోర్ లో పక్కపక్కన నిల్చుని ఒకేసారి ప్రకృతి ని ప్రేమించటం,  పరిగెడుతున్న చెట్ల ని చూస్తూ హృదయం లోంచి తొణికిన పారవశ్యాన్ని పంచుకోవటం, చుట్టుముట్టిన మనుషుల సొదలో, రొద లో సైతం ఏకాంతాన్ని జంటగా అనుభూతించడం.. మళ్ళీ మళ్ళీ దొరకదా! ఈ జీవితానికింతేనా?

నిముషాలుగా పిలవబడే కొన్ని ఆవేదనల నిశ్శబ్ధం తర్వాత ఊహించకుండా వచ్చిందా ప్రశ్న “కెన్ యు వెయిట్ ఫర్ మీ?”
“వ్వాట్?” నిజం గానే అర్ధం కాలేదు నాకు.
“ఏం లేదు. ఫేర్వెల్ మెయిల్ రాసేసొస్తాను.”
ట్రాక్ కి ఇవతలి వైపు కొలిమి లో కొడవళ్ళు కాలుతున్నాయి, పైగా సుత్తి దెబ్బలేమో!
“సరే బయట గేట్ దగ్గరుంటాను, వచ్చెయ్.” ఎదురుగా కూర్చుని మరికాసేపు నీ మొహం చూసే ధైర్యం లేదు నాకు.  స్క్రిబ్లింగ్ పాడ్ మీద గీస్తున్నది పూర్తి చేసి నా చేతికిచ్చి నేను ఆశ్చర్యం గా చూస్తుండగానే వర్క్ స్టేషన్ దగ్గరికెళిపోయాడు.

సెక్యూరిటీ రిజిస్టర్ లో సంతకం బరికి లిఫ్ట్ దగ్గర హౌస్ ఫుల్ కోలాహలం లో ఇమిడే మూడ్ లేక మెల్లగా మెట్లు దిగి గేట్ దగ్గర కి నడిచాను. సిటీ అంతా మెల్లగా స్వెట్టర్ల లోకి దూరుతుంది. కాంపౌండ్ గోడ పక్కన  పానీ పూరీల బండి పొగలు కక్కుతుంది. కుతూహలం ఆగక కాగితాలు తిప్పి చూస్తే….వావ్! అనుమానం లేదు, కంటి కింద పుట్టుమచ్చతో, కాఫీ కప్ చేతిలో తిప్పుతూ ఉన్న అది నా బొమ్మే, సంతకానికి పైన ఉర్దూలా కనిపించే తెలుగు రాతలో ’నేను చెయ్యవల్సిన పని నాకన్నా ముందు నీకు తెలియటం .. వింతగా లేదూ?’ టప్ మన్న శబ్దం లేకుండానే ఆ కింద సంతకం తడిచి అలుక్కుపోయింది.

“అయింది. నీ బస్టాప్ ఇక్కడేగా, జాగ్రత్త, నేనెళ్ళొస్తా” ఇదే ఆఖరు సారని తెలిసినా రేపు కలవబోతున్నంత మాములుగా ఎలా మాట్లాడతావ్?
“సరే! కీప్ ఇన్ టచ్” నేను మాత్రమెందుకు తగ్గడం.


“ఒక మాట”

“నాకోసం ఎదురు చూస్తావా?”
“ఊ?? కమ్ ఎగైన్” ఈసారి నిజంగా అర్ధమయ్యి కూడా అడిగాను.
“బహుశా కొన్ని నెలల పట్టొచ్చు, లేకపోతే ఒకట్రొండు సంవత్సరాలు. నా నమ్మకాన్ని .. కనీసం నా మూర్ఖత్వాన్ని ప్రూవ్ చేసుకోవటానికి, అప్పటిదాకా ?”
కరిగేవరకూ ఎవరికీ తెలీదు హిమనగం లో కూడా నీరే ఉందని. ఆ కళ్ళద్దాల వెనక ఎర్రటి జీర చాలు లోలోపలి మధనాన్ని బయటపెట్టడానికి.
“తప్పకుండా! నీ కోసం కాదు నా కోసం” ఇక దాచటమెందుకు? రెప్పల చాటున నీలోత్పలాల్ని నీళ్ళాడనివ్వచ్చు.
పానీ పూరీ బండి మీద పెద్ద శబ్దం తో ఏదో మసాలా పాట వినిపిస్తుంది.
గజిబిజి వాహనాలు, మతిలేని వేగాల మధ్యలో రోడ్డు దాటుతూ అతను, వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకుండా. పైన అసందర్భం గా మొహమంతా మసి పూసుకున్నట్టు ఆకాశం..
అహ! కాదు.
నల్లగా మసకేస్తేనూ.. మబ్బుతునకనుకున్నా,
సన్నగా కరిపోతుంటే.. నిన్నటి అమావాస్య చెదిరిన మెరుపు మరకని చూస్తున్నా,
సంజెగాలి అటు మెసలి గగనపు కాన్వాస్ మీద రంగులన్నీ ఒలకబోసుకుంటే గానీ తెలీలేదు.
భాస్కరా!
నువ్వెళుతున్నా వస్తున్నా
వర్ణార్ణవమేనని!!

********

‘మోహ’మాటాలు

మాటల మారాకులేసిన వసంత వనాల్లో
తడి చూపుల తుమ్మెదలదేమో మౌనభాష
మధూలిక రాలి బదులిచ్చేవరకూ
పరిప్రశ్నలన్నీ ప్రభవ వేదనల్లోనే

పున్నమి తో పోటెత్తిన సముద్రపు హోరులో
సైకత తీరపు నిశ్శబ్ధ ఘోష వినబడుతుందా?
తడి పొడుల సంధిలో తపించే కల్పాల కాలమంతా
చలి వెన్నెల్ని ఊపిరి నెగళ్ళతో కాచుకోవాలిక

తనూవల్లకి పై నిక్వణించిన తమకానికి
పిల్లగాలి పరవళ్ళెత్తే పిల్లనగోవి పాటతో
సడి రాత్రి సన్నజాజి సరాల సందట్లో
జత గాత్రాల జుగుల్బందీ  వీలౌతుందా?

అసంబద్ధం

చుట్టూరా దట్టం గా పొగమంచు, కిందంతా దళసరిగా మంచు. ఆ పొగలోంచి, మంచు మీంచి వెళుతున్నాను. అంటే నడుస్తున్నానని కాదు, వాహనమ్మీదా లేను. మరి తేలుతున్నానా, మత్తులో పేలుతున్నానా? ఎలానో ప్రయాణిస్తున్నాను. మనుసంభవం చదువుతూ పడుకున్నానేమో ప్రవరుడి లేపనం కాళ్ళకంటుకున్నట్టుంది. అంటే పడుకున్నాక నిద్రలోనో కల్లోనో నడుస్తూ .. సారీ తేలుతూ ఎక్కడికెళ్తున్నాను, ఐనా అర్ధరాత్రి ఈ పొగమంచేమిటీ ? ఇందాకట్నుంచీ ఈ పక్కనే ఏమీ మాట్లాడకుండా నడుస్తున్నదెవరో, ఉన్నట్టుండి ఆగిపోయి నది ఒడ్డున కూచున్నాడు. ఆ నది అప్పటిదాకా ఎక్కడుందో అతను కూచున్నాక చూస్తే కాళ్ల దగ్గర కదుల్తూ నీళ్ళు, ఎంత పొడవుందో కనపడటం లేదు. అతను కూర్చునే సరికే నేను అప్పటికే అక్కడ చాలా సేపట్నుండి ఉన్నాను. మరి ఇందాకట్నుంచీ అతన్తో నడిచేది ఎవరు? నా గురించి అతనేదో మనసులో గొణుక్కుంటున్నాడు. మనసులో అని ఎందుకన్నానంటే పెదవులు కదలకుండానే అతననుకునేది నాకు వినిపిస్తుంది. వినపడ్డమంటే చెవులకి కాదు, అతను అనుకుంటున్నట్టు అనిపిస్తుంది.

మెలకువలో ఉన్నప్పుడు ఒక్కోసారి ’ఇది కలా!?’ అనుకుంటాం కానీ ఆ అనుకోవడం లో అతిశయమే తప్ప నిజయితీ ఉండదు. కానీ కలలో ’ఇది నిజమా’ అని సందేహం వస్తే మాత్రం తేలేదాకా రకరకాలుగా ప్రయత్నల్చేస్తాం. నా పక్క వ్యక్తి ఏదో బాధలో ఉన్నాడు. కదలకుండా ఎదురుగా ఉన్న కొండ వైపే చూస్తూ ఉన్నా అతని లోపల్నుంచి వెక్కిళ్ళు వినపడుతున్నాయి (ఇందాక చెప్పినట్టుగానే వినిపించడమంటే అనిపించడం. ఐనా ఈ లోగా నది కొండలా ఎలా మారిపోయిందో.) నాకు ఓదార్చాలనిపించింది, ఇంతకీ ఎందుకేడుస్తున్నాడో. ఒకసారి భుజం చరిచి ధైర్యం చెప్పబోతే నేనూ బిగుసుకుపోయా, అంటే ఇందాకట్నుంచీ అలా కదల్లేని స్థితిలోనే ఉండి ఉంటాను, కానీ కదలాలనుకోకపోవడం వల్ల తెలీలేదు. కనీసం కళ్ళు తిప్పి అతన్ని చూద్దామన్నా వీలు కావట్లేదు. ఇంతకీ అతన్ని నేను ముట్టుకుని ఓదారిస్తే ఫర్లేదా,ఏమైనా తప్పా? అసలు నేను ఆడా, మగా? ఏమో మెలకువొస్తే గానీ గుర్తురాదు. ఆ పక్కనున్న వ్యక్తి మగవాడనుకున్నాను ఇందాకట్నుంచీ సరిగా చూడ్డానికి వీలు చిక్కక. అదీ ఖచ్చితం గా చెప్పలేను నిద్రలేచేదాకా, కానీ లేచాకా ఆ వ్యక్తి ఉండొద్దూ కనిపెట్టడానికి.. అతను ప్రస్తుతం నిద్ర లో ఉండి నా కల్లోకొచ్చాడు కాబోలు, బహుశా ముందు మెలకువొచ్చేస్తే ఉన్న ఫళాన మారిపోతాడో, మాయమౌతాడో ఈ పరిసరాల్లాగా.

ఐనా ఇప్పుడు కదల్లేకపోతేనేం, అతని బాధ నాకర్ధమైనట్టు నా ఓదార్పూ అతనికి అర్ధమై ఉంటుంది. ’అతను’ అన్నానేమిటీ అనుమానమింకా తీరకుండానే. ఏదో ఒకటనాలిగా కాసేపు సాటి స్వప్న శకలమై ఈ ఒంటరి నిద్రా జగం లో నాకు తోడున్నందుకు. అమ్మో! ఈ వ్యక్తి లేకపోతే ఇంత సుదీర్ఘమైన రాత్రి దాటటానికి కలలు తప్ప వేరే దారి లేని నిశని ఎలా గడపాల్సొచ్చేదో. అనుకోగానే చెప్పలేని అభిమానం ఉప్పొంగింది. ’మంచో చెడో! మనం కలిసి ఉన్నాం. ఖాళీ గా, శూన్యం గా ఉండేకన్నా వెక్కిళ్ళు పెట్టి ఏడవటం కొంచం నయమే అనుకో. కానీ, ఏదో కులాసాగా కాసేపు మాట్లాడ్డానికి సాటి మనిషున్నప్పుడు కూడా ఎందుకు? ఈ కన్నీళ్లని ఏకాంతం కోసం దాచుకోరాదూ.. ఐనా ఇది కలేగా, ఈ కష్టం నీకు నిద్ర లేచాక (గుర్తు)ఉండదులే.” అని లోపల్నుంచే అనునయించబోయా. అతని మొహం లో భావాలు చదవడానికి మేము ఎదురు బొదురూ కూర్చోలేదాయె, తిరిగి చూద్దామంటే ఇందాకట్లానే కదల్లేకపోయాను.  కానీ పక్క వ్యక్తి కదిలి వెళ్ళిపోతున్న అలికిడి (అంటే నిజం గా శబ్ధమవ్వలేదు. ఐనా తెలుస్తుందిగా కదలిక).”నీకేం. కాసేపుంటే లేచి మెలకువలో పడిపోతావ్. నా జీవితమే ఈ కలైనప్పుడు, నా కష్టాలు, సుఖాలూ అన్నీ ఇక్కడే తీరాలి.” అనుకుంటూ గొణుగుడు దూరమైపోయింది.

వెళ్తూ వెళ్తూ అతననుకున్న మాటలే మననం చేసుకుంటున్నాను. ఈ చలి కి శరీరం తో పాటు ఆలోచనలూ గడ్డకట్టేట్టున్నాయి. త్వరగా మెలకువచ్చేస్తే బావుణ్ణు. ఎవరైనా లేపకూడదూ, ఫ్రాయిడూ..??

శ్రీ కృష్ణ శ్రీ తిలక్ శాస్త్రి!!

“వేళ కాని వేళ లలో, … దారి కాని దారులలో, ….” వెళ్లకూడదని తెలిసీ ఆ దారంట బయల్దేరాను. అనుకున్నట్టుగానే ఆ ఇంటిముందుకి రాగానే
“ఆగక్కడ ఆగక్కడ అగాగు అక్కడనే” అనెవరో పిలవటం వినిపించింది. ఇంకెవరు, భయపడినట్టుగానే సౌమ్య. అసలు బ్రతకనేర్చిన వారెవరైనా సౌమ్య కి కనపడతారా? కనపడెను పో దారి మార్చి పారిపోక అక్కడే ఉంటారా? ఎందుకంటారేమిటి మనిషి కనపడగానే “రివ్యూ రాశారా?” అంటుంది. అసలు ఏదేనా రాయలంటే ముందు మరేదైనా చదవాలి కదా! ఆ తర్వాత బద్ధకాన్ని నిద్రపుచ్చి అలవాటు లేని పనైనా ఆలోచించాలి కదా, ఎంతకష్టమెంత కష్టం.నా తలమునకల్లో నేనుండగానే కనిపెట్టేసినట్టుగా “రావోయి లోనికి సందేహం దేనికి?” అని మళ్లీ పిలుపు. ఇక తప్పక ’ఏం చేస్తున్నవమ్మా?’ అని అడుగుతూ లోపలికి అడుగుపెట్టాను. అమె సీరియస్ గా తలపైకెత్తి “రాస్తున్నానొక గీతి, చేస్తున్ననొక హేతి.. నా మనః కార్మిక శాల.. కక్కేది భావాగ్ని పొగలు” అని వెంటనే తలదించుకు రాసుకుంటుంది. ఐనా గీతం రాయడం దేముంది ’నవల్లు నవల్లు రాసేస్తున్నారు. వర్ణణీయ వస్తువే తిరగబడి వర్ణిస్తుంటే..”

నా తలపోతల్ని చెదరగొదుతూ “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు” అని ఒక చూపు చూసింది నాకేసి. “ఆ.. ఇప్పటిదాకా ఎక్కడుంటాయి వర్షాకాలం కూడా వచ్చేస్తేను” అని తప్పించుకోజూశాను. ఐనా వదలదు కదా ” పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవీ?” అని తగులుకుంది. “ఇంకా రెక్కలూ, గుర్తులూ ఎక్కడమ్మాయ్, వరదలోచ్చి ఊళ్ళే మాయమౌతుంటేనూ” నా టీవీ వార్తా జ్ఞానం బానే అక్కరకొచ్చింది.

ఇక నేరుగా విషయం లోకి దిగి “పుస్తకం సంగతి గుర్తు లేదా?” అని నిలదీసింది. “ఏమీ లేదు చిన్నమ్మా! చేతిలో కంప్యుటర్ లేదు, చేతి నిండా సమయం లేదు. నువ్వడిగేదేమో పెద్ద పని” భలే సాకు కనిపెట్టేశా. వ్యంగ్యం గా నవ్వి “నిజం గా నేను చూశాను నేస్తం! నీ శ్రుతి మించిన చాటింగ్ ని, జీ మెయిలింగ్ నీ, ఆర్కుటింగ్ నీ.. ప్రతి పోస్టు చివరా బ్లాగుల్లో కామెంటింగు ని” హతవిధీ! గుట్టు రట్టయింది. “ఆకలీ, దాహమూ, చింతలూ వంతలూ” ఇన్నిటిమధ్య నా వల్ల కాదు అని చెప్పి జారుకోబోయి వెనక్కి తిరిగి ఒక్కసారి చూద్దును కదా ఆమె కళ్ళల్లో “విచ్చిన రెండు కల్హార సరస్సులు” ఉండబట్టలేక ’ఏడవకండేడవకండ’ని ఓదార్చబోయాను. “ఏనసహాయురాల నేనభాగ్యురాల” అని తను వాపోతుంటే ’కర్కశ శిలయు నవజీవ కళల దేరి’ నట్టు, నిజం చెప్పొద్దూ మొన్న పండక్కి నే చేసిన మైసూర్పాక్ కన్నా కఠినమైన నా మనసు కూడా ’కవిత్వం పేరెత్తితే చాలు కరిగిపోతుంది మనసు’ అని నీరవటం మొదలెట్టింది.

“కనీసం దీపావళి పండక్కైనా నాకోసం ఒక వ్యాసం రాద్దురూ” అని మళ్ళీ సౌమ్య నా బలహీనత మీద ఆడుకోబోయింది. “నాకు దీపావళులు లేవు, నాకు చిచ్చుబుడ్డులు లేవు” అని చెప్పేద్దును కానీ ఈసారి మంచి మాటల్తో చెప్పి చూద్దామని… “అది కాదమ్మాయ్ కవిత్వమంటే గొప్పగా రాయాలి, గొప్ప విషయాలపై రాయాలి నావల్లవుతుందా?”
“అదేం కాదు! తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం..” అని ఉత్సాహం గా నన్ను ఏమార్చబోయింది.
నాకు తిక్క రేగి
“చదల చుక్క,
నెమలి రెక్క ,
అరటి మొక్క,
ఆమె నొసటి కస్తూరి చుక్క”
అనొక తిరుగులేని సమాధానమిచ్చి వెర్రిగా నవ్వాను.

ఇక కోలుకోలేని దెబ్బకొట్టానని ’ చిత్తమానందమయ మరీచికల సోల, హృదయమానందభంగ మాలికల దేల’ దర్జా గా దాటుకు వెళ్ళబోయా. ఐనా ఆమేమైనా తక్కువ తిందా? పుస్తకం పుస్తకం అంటూ జనాల దగ్గర తిన్న రివ్యూలన్నీ వంటపట్టించుకుని “ఏల రాయరు మీరు సమీక్ష ఒక్కటి? ఏల బాధింతురీరీతి నన్ను? నా హృదయమేల క్షోభించునిటుల” అంటూ గుమ్మానికడ్డు నిలుచుంది.

ఇక లాభం లేదు నన్ను ’చలువరాతి మేడల చరసాలలందు’ బంధించగలదీ అమ్మాయి అని నిర్మొహమాటమైన మొహమాటం తో ఉండగానే “మీరవుననలేదో.. ఈ కార్తీక పూర్ణిమ జ్యోత్స్న సైతం భయపెట్టు మిమ్ములను” అని బెదిరింపులు. అమ్మో ఈ పూర్ణిమ ఒకటే తక్కువైందిప్పుడు. ఆవిడ కూడా జాయినయ్యేలోపు నా పైత్యాన్ని రాసి వీళ్లమీద వదిలేస్తే తిక్క కుదురుతుంది కదా అని
“అలాగలాగే! అలాగే సౌమ్యా! పూర్ణిమా అలాగే!
నేను సైతం పుస్తకానికి వ్యాసమొక్కటి రాసి ఇస్తాను.”
అని వాగ్దానమిచ్చి బయటపడ్డాను. ఇప్పుడిలా మీ మీద రుద్దాను.