ప్రేరణ

రాత్రంతా తోట నిండా రాలి పడిన పసుపు గన్నేరు పూలు.
ఓంటరి నా గదిలో కాన్వాస్ పై రంగుల కలలే తెల్లవార్లూ..

అన్నట్టు మర్చిపోయాను ఇవ్వాళ నిన్ను కలవబోతున్నాను కదా! అంటే నిజం గా మర్చిపోయానని కాదు, అంతా మాములుగా ఉన్నప్పుడు ఒక ఇష్టమైన విషయం గుర్తుకు రావటం లో ఉండే ఆనందం కోసం మళ్ళీ మర్చిపోవటం. పుప్పొడి పూతల్లో అణిగి ఉన్న ఆరాటాన్ని గాలి బంధిస్తే అదొక మకరందపు విస్ఫోటనమైనట్టు.. ఇన్నాళ్లూ అణచిపెట్టిన ఉద్వేగమంతా నిన్ను చూడగానే ఎక్కడ నా మాటకి ఎదురుతిరుగుతుందోనని భయం. మనం కలిసి ఇన్నాళ్ళయిందా? ఆశ్చర్యం! ప్రతి నిముషం పలకరించుకుంటున్నట్టే ఉంటుంది. మరి అదేమిటో ప్రతి రోజూ కనపడినప్పుడు మాత్రం యుగాల నిరీక్షణ లా ఉండేది.

‘నన్నెపుడైనా గుర్తు చేసుకుంటావా’ అని నువ్వడిగితే;

వసంతాల్నీ సమీరాల్ని వదిలేసి ,
ఉషోదయాలు, అపరాహ్నాలూ,అసురసంధ్య లు
నా ఉనికినే మరిచిపోయేంతగా లీనమయ్యి చిత్రవర్ణాల్లో అంతర్లోకాల్నిని సృజించుకుంటూ,
ఏ అర్ధరాత్రో ఆకలి తెలిసి,
ఒకదాన్లో ఒకటి ఐక్యమైపోయిన అరచేతుల జంట ఆసరా గా తల వెనక్కి వాల్చినప్పుడు,
మూసిన కనురెప్పల వెనక ఎగసిపడే మొట్ట మొదటి జ్ఞాపకం నీదేనని..
చెప్పనా?
వద్దు, ఇప్పుడు కరిగిపోతే ఎన్నో సార్లు ఘనీభవించటానికి సిద్ధపడాలి.
గుర్తు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రతి క్షణం హోరెత్తుతున్న నీ జ్ఞాపకాల కోలాహలాన్ని తప్పించుకోలేని అశక్తుణ్ణి..

‘నేనెప్పుడైనా గుర్తొస్తానా’ అని నువ్వడిగితే..
‘ఊహూ’ తల అడ్డం గా ఊపాను. అన్ని అబద్ధాలూ అందంగా ఉండవు మరి. కోపం తో అరుణిమైన నీ వెచ్చని చూపుకీ ఈ సాయంత్రపు నీలిమ కీ మధ్య ఉభయసంధ్యల వారధిలా నిల్చుని నేను.

మెదడు లోంచి లావా పొంగి హృదయాన్ని దహించివేస్తున్న దృశ్యాన్ని తర్వాతెప్పుడో ఒకరోజు కాన్వాస్ పై చిత్రిస్తే..
ఈ ఆలోచన నీకెలా వచ్చింది అని ఎవరైనా అడిగినప్పుడు, ఇదంతా తవ్వి తలపులకెత్తుకోవటం ఇష్టం లేక ప్లాస్టిక్ పూలమీంచి వచ్చే పెర్ఫ్యూమ్ పరిమళం లాంటి ఒక నవ్వు బదులిస్తాను.

మరి కొన్ని చోట్ల

చదువది యెంత గల్గిన

ఆంద్ర జ్యోతి ..నవ్య లో

navya

ఈనాడు.. ఈతరం లో

eetaram

ఉగాది సంపాదకీయం

ఏటి ఒడ్డున కొన్ని మాటలు

కంప్యూటర్ ఎరా లో

ఊకదంపుడు బ్లాగు సమీక్ష

త్వమేవాహం

ప్రేమంటే..
..రెండు హృదయాలు ఒకేలా స్పందించటం,
..ఇద్దరి అభిప్రాయాలు, భావాలు కలవటం.
ఇలాంటివి అప్పటికి చాలా విని ఉన్నాను.

మన పరిచయమైన మొదటి రోజుల్లో ఒకసారి నిన్ను అడిగాను,
“మీకు అన్నిటికన్నా ఏదంటే బాగా ఇష్టం?” (అసంబద్ధం గా, అస్పష్టం గా
ఉందా?ఐనా చూద్దాం ఏం చెప్తావో అని) అసలు ఇసుమంతైనా అలోచించకుండా చాలా అత్మ విశ్వాసం తో చెప్పావు.”నాకు దానిమ్మ పండంటే చాలా ఇస్టం” ఆపలేనంతగా నవ్వానో, నడుస్తూ నవ్వలేక అలాగే ఆగిపోయానో..మొత్తానికి సభ్యత గా ఉండదేమో అని అపేశాక నాకు ఎదురు ప్రశ్న “మరి మీకు?””అక్షరం ” అని లోపల గొణుక్కున్నానేమో “ఏదైనా చదువుతూ ఉండటం నాకు
బావుంటుంది.” అని వీలైనంత సింపుల్ గా చేప్పినట్టు గుర్తు.

తొండ ముదిరి ఊసరవెల్లి అయాక ఒక రోజు..(చాలా పనికిమాలిన పోలిక, కానీ స్నేహం పెరిగాక అని నా ఉద్దేశం.)మొహం వేళ్ళాడేసుకుని కనిపించావ్. “ఏంటలా ఉన్నావ్ జ్వరమా ? తిరక్కుండా పడుకో” ఒక మొక్కుబడి సలహా పడేసి బాధ్యత తీర్చేసుకున్నా. “కాదు ! నిన్నంతా నిన్ను చూడక పోయేసరికి తిండి నిద్ర సహించలేదు”-

“నా మొహం లా ఉంది, ఫూలిష్, నేనైతే ఏదెలా ఉన్నా వేళకి తిని శుభ్రం గా
పడుకుంటా” గట్టిగానే పైకే చెప్పాను. అలా అనటం వరకైతే సాధ్యమైంది కానీ తెచ్చిపెట్టుకున్న కొద్దిపాటి కరకుతనం ఎర్రబడిన నీ కళ్ళలోనీ ఆరాటాన్ని చూసి కరిగిపోయాక కూడా, నొక్కి పెట్టిన ఉద్వేగాన్ని ఆపటం నా తరం కాలేదు.

‘మనసెప్పుడు లయ తప్పుతుందో తెలిసుంటే ఆ ఒక్క క్షణం నీ పై చూపు నిలవకుండా చేసి ఉందును కదా’అని రాసుకున్నాను ఆ రోజు రాత్రి డైరీ లో. అలాంటి క్షణాలే గంటలుగా మారి ప్రతి సాయంత్రం నీ సమక్షం లో సముద్రపు ఒడ్డున సాగిపోయేవి. ఇసుకలో గవ్వలేరుకుంటూ నేను, నా నవ్వులేరుకుంటూ నువ్వు. ప్రతి రాత్రీ ఇంటి గేట్ దగ్గర వెన్నెలతో పాటు నీకూ వీడ్కోలు చెప్పి మెట్లు ఎక్కబోతుంటే.. దోసిట్లో నువ్విచ్చిన గులాబీల పైన రాలి పడే కన్నీటి చుక్కని ఎన్నో సార్లు ప్రశ్నించి ఉంటాను. ‘ఒక్క రోజు ఎడబాటుకే ఇంత వేదనా?’ అని. ఆరాధన లో, ఆకర్షణ లో, ప్రేమావేశం లో కొన్ని నెలలే తెలియకుండా గడిచిపోయాయి. ఇంకెన్నాళ్ళైనా నీతొ స్నేహం ఇలానే అద్బుతం గా సాగి ఉండేదేమో.

కానీ ఈలోపు మన పెళ్ళయింది.

****
పెళ్ళి తర్వాత మీ ఇంట్లో కొత్తగా అడుగుపెట్టిన రోజు అలసట తో, అంతా సవ్యం గా జరిగిందన్న అనందం తో కొత్త చోటని లేకుండా నిద్ర పట్టేసింది. లేచి చూసేసరికి గది లో ఒంటరిగా నేను. వరండా లో నాకు పరిచయం లేని నీ సొంత మనుషుల మధ్య నవ్వుతూ కబుర్లలో మునిగిపోయి నువ్వు. నీ ప్రపంచం లో నేను కొంత భాగం మత్రమేనని మొదటిసారి అనిపించింది.

నీకు కవిత్వం, సాహిత్యం తో అసలు పరిచయం లేదని, టీవీ లో క్రికెట్ గంటల తరబడి చూడగలవని కలిసి బ్రతకటం మొదలు పెట్టిన కొన్నాళ్ళకే అర్ద్ధమైంది. ఇంత చిన్న విషయాలు కూడా బీచ్ లో పార్క్ లో మనం కలిసి గడిపిన అన్ని సాయంత్రాల్లో నాకు తెలుసుకోవలనిపించకపోవటం ఆశ్చర్యమే. మిన్ను విరిగి మీద పడలేదు కానీ
అభూత కల్పన లాంటి ఊహ కి అతి సహజమైన వాస్తవానికి సమన్వయం కుదర్చాల్సిన అవసరం మొదలైంది.

నన్ను నేను మార్చుకోవాలా? నిన్ను మార్చటం జరిగే పనేనా? మరి ఇలా చెరో దారిలో ఎన్నాళ్ళు నడవగలం? రోజు రోజు కి మనసు నీండా పెరిగిపోతున్న ప్రశ్నలు. అన్నిటికీ సమాధానం మన సహజీవనం లోనే దొరికింది.

*******
కదలకపోతే అది కాలమెలా అవుతుంది?

ఇన్నాళ్ళ సాహచర్యం లో ఎన్ని పేచీ లు ఎన్ని రాజీలు,నా కష్టానికి చెమర్చు నీ నయనాలు, అలసటలో బాసటగా నువ్వందించే చేయూత.నా చిన్న స్వార్ధాలు – నీ పెద్ద త్యాగాలు (ఇష్టం తో చేస్తే కష్టం కాదట.. నువ్వే చెప్తావ్)

“బాబు కి పేరు పెట్టాలి కదా ! నువ్వు మాత్రం అలోచించకు మహానుభావా,చివరికి ఏ రొటీన్ పేరో చెబుతావ్.”
అని నేను ఫిర్యాదు చేసేలోపే”ఇలాంటివి నీకే బాగా తెలుసు. నువ్వేపేరు పెట్టినా బాగుంటుంది .”అని నా పై నీ నమ్మకం లో కవితలకి తెలియని సున్నితత్వం.

అభిరుచులొకటి కాకపోతే ఒకే రుచి ని పంచుకోలేమా?
నా ఒళ్ళో తలతో , క్రికెట్ మాచ్ లో కళ్ళతో టీ వీ కి నువ్వు అంకితమైపోతే..
చేతిలో పుస్తకం తో కవితా లోకం లో నేను మునిగిపోతే,
ప్రతీ బౌండరీ కీ నా చదువుని ఆపి నీ కామెంట్రీ విని..
నా ప్రబంధం లోని ప్రతి పద చమత్కృతి కి నీ తపో భంగం చేసీ నా ఉద్వేగాన్నినీతో పంచుకుని..
ఇటువంటి రమ్య చిత్రాలు మన జంట జీవితాల పై ఎన్నో చిత్రించుకున్నాక..

ఇప్పుడు నాకనిపిస్తుంది,
ప్రేమంటే
“ఒక హృదయ స్పందన ని మరో హృదయం అనుభూతి చెందటం” అని.

****

సమీప దూరాలు

తెలి మంచు లో తెల్లవారుఝామునే తడిసిపోయే పసి కుసుమం త్వరలో ధనుర్మాసానికి వీడ్కోలు చెప్పాలని తెలియక చలి లో తుళ్ళి పడుతుంటేఅరె నీహారిక కళ్ళలోకే వచ్చిందేమిటి!

 

నూనెలో రంగులు కలిపి గచ్చు మీద పగలంతా ముగ్గులు పెట్టాను. ఇంకా తడి ఆరలేదు.. ఏదోక రోజు నువ్వు చూసి ముచ్చట పడకపోతావా అనే ఆశలానే. రామాలయం లో తిరుప్పావై వినడానికి వెళ్ళిన వాళ్ళు చెరువు గట్టున స్నేహితుల్తో ఆటలాడుకున్న పిల్లలు కూడా తిరిగొస్తున్నారు. వేణ్ణీళ్ళ కాగు కింద తుక్కు పులల్లు ఎగ దోస్తూ చిరు చలికి ముడుచుకు కూచుని వీధి గుమ్మం వైపు తదేకం గా చూస్తూ ద్వారబంధాల పక్కన నీ చెప్పులుంటే సాయంత్రం ఎంత ఉల్లాసం గా ఉండేది అనుకుంటాను.

 

ఒక చుక్క తేనె కోసం నాలుగు పూలమొక్కల మధ్యే వేల మైళ్ళు తిరిగే తేనెటీగల్లాంటి జ్ఞాపకాలు. సన్నజాజుల్లో లేని విశేషం పారిజాతాల్లో ఏముందని అడిగితే.. నీ తెల్లని అరచేతి మధ్య గోరింట చుక్కని తలపించటం కాబోలు.. అని నీ సమాధానం గుర్తొచ్చి సిగ్గుని కోపం లోకి అభినయించబోయి భంగపడి నవ్వుతాను. పరిమళపు పూతలన్ని ఏమంటున్నాయి? వసంతాలకేం వచ్చి పోతుంటాయి మరో హేమంతానికైనా నువ్వు తోడురాకూడదూ అని కదా! ప్రేమంటే ఇంత వేదనని ఎవరు నమ్ముతారు?

 

నిశ్శబ్ధ ఏకాంతం, మౌనం ఇన్ని సంగతులు చెబ్తాయే! బహుశా ఏమీ లేదని చెప్పటానికే మాటలు అవసరపడతాయి. నీరెండలో నిశ్చలం గా మెరిసే కోనేటి నీరు కూడా మట్టి కుండ లో చేరాక రూపు మార్చుకున్నట్టు.. వియోగం లో ఎంత అందమైన దృశ్యం కూడా నాలో విషాదాన్నే నింపుతుందెందుకు. ఐనా సౌందర్యం విషాదం పరస్పరం లీనమయ్యి లేవని అనగలమా?

ఎడారిలో గడ్డి పరక సైతం కాస్త అనువు దొరగ్గానే మొలకెత్తుతుందట. మాత్రం భాగ్యం కూడా కన్నీటి చుక్కకి లేదు కదా. పగళ్ళూ రాత్రులూ గుండెను పగిలించుకుంటూ, అతికించుకుంటూ గొంతు చాటున దుఃఖాన్ని అపేసి నడుస్తుంటే.. వంతెన దాటుతున్నంత సేపూ వెంటపడి వచ్చే వెన్నెలని విసుక్కోక ఏం చెయ్యను?

*తొలి ప్రచురణ పొద్దులో

*తెలుగు వెలుగులు లో

సింధువు

గవ్వల గనుల అన్వేషణ లో
అందమైన సంపద పోగేసిన ఆశ్చర్యం లో
ఇసుక గూళ్ళు కట్టిన అమాయకపు గర్వం లో
పసితనపు పాటలకు
పరుగులెత్తి పడిన పందేలకు
సేద తీర్చిన సాగర సమీరం.

కలల తీరం లో
ప్రేమ పారవశ్యం లో
ఊహల భారం తో
మాటలు వెదికే మౌనం లో
మెల్లని కెరటాలని
పాదాల మీదకి పంపి
తలపులని తేలిక చేసే ఆర్ద్ర సముద్రం.

చిత్తమంతా చింతలు ముప్పిరిగొని
ఒకదాన్నొకటి ఢీకొని
ఒక్కో అల ఉద్రేకం తో ఎగసిపడి
మరో తరగ ఇక ఎగరలేక విరిగిపడి
ఆటు పోట్ల అంతస్సంఘర్షణ
నిదర్శనం గా కల్లోలపు కడలి.

ఘడియో క్షణమో
ఉద్రేకమో క్రోధమో
జీవితాల్నీ ఆశయాల్నీ
ఇళ్ళ్లనీ ఊళ్ళనీ
సుడిగుండాలతో సునామీలతో
మున్నీట ముంచిన
మహోగ్ర మహార్ణవం.

*తొలి ప్రచురణ  పొద్దు లో

నా వేసవి విశేషాలు

చూస్తుండగానే వేసవి మళ్ళీ వచ్చేసింది.

నవ వసంతం చైత్రానికి మావి చిగురు తాంబూలం అందించి
తానున్నంత సేపూ కోకిలమ్మ తో కబుర్ల కచేరీ చేయించి
కొద్దిగా ఎండ చురుక్కుమనగానే గుబురు వేపాకుల పందిరి వేసి
సాయంత్రమవుతుంటే మలయ సమీరాల వింజామరలు వీచి
మాపటి వేళ మరుమల్లె సుగంధాల అత్తరు నిద్రని కానుకిచ్చి
ఇలా మనకి వేసవి ని వదిలి వెళ్ళబోతుంది.

వైశాఖమంటే మండే ఎండలు, చల్లని నీళ్ళు.
పల్లెటూళ్ళలో కొత్తావకాయ పచ్చళ్ళు,తాటాకు పందిళ్ళు, పెళ్ళి సందళ్ళు.
పిల్లలకైతే వేసవి సెలవలు, అమ్మమ్మల వూళ్ళు, కొత్త ఆటలు, స్నేహాలు.
ఎండల్లో ఆడొద్దని, వడదెబ్బని అమ్మ చెప్తే అది తమని మోసం చెయ్యటానికి
చెప్పే అబద్ధమని గట్టి నమ్మకం తో రెట్టించిన ఉత్సాహం తో వీధుల్లోకి
పరుగులు.

ఇక సిటీల్లో ఐతే సమ్మర్ కాంప్ లు, ఎగ్జిబిషన్ లు.
మొత్తం మీద చివరికి ఏ మార్పూ లేనిది మాత్రం కంప్యూటర్ పక్షులకి
ప్రాజెక్ట్ లూ, చావు గీతలు( deadline లు లెండి) వీటిల్లో ఏం తేడా లేదు.
బాధ్యత పెరిగేది మాత్రం ఎంట్రన్సు సెట్లు రాసే నిమ్మిత్తం తెగ రుద్దబడే
రేపటి పౌరుల మీదే.

నా మటుకు నాకు కొన్నేళ్ళ క్రితం వరకు(ఉద్యోగమూ, వివాహమూ కాకముందనమాట)
ఎండాకాలం అంటే మనసు నిండే కాలం.
సరికొత్త ప్రేమ లో ఒక రోజు విరహం తరువాత ప్రియ సఖి ని కలవబోయే చెలికాడి
మనః స్థితి లా ఉండేది సంవత్సరాంత పరిక్షలు రాస్తున్నన్ని రోజులూ. ఆఖరి
పరిక్ష పూర్తయిన మరుక్షణం ఆఘ మేఘాలు, వురుకులు పరుగులు ఈ రెంటిలొ ఏది
ముందైతే దాని మీద సర్వోత్తమ గ్రంధాలయానికో, ఇంట్లోని పుస్తకాల అరకో
చేరేవరకి స్థిమితం దొరకదు. విజయవాడ లో ఉన్న కారణం గా ప్రతీ ఆంగ్ల
సంవత్సరాది కి పుస్తక ప్రదర్శన లో కొన్న పుస్తకాలన్నీ
తమ మౌన తపో భంగం కోసం ట్రంకు పెట్టె లో ఎదురు చూస్తూ ఉండేవి మరి.

కొత్తవాసన తో పొందికగా పేజీ ల అమరిక లో సర్దుకుని కూర్చున్న పుస్తకాన్ని
మొదటిసారి తెరిచి చూసే ఆనందానికి సాటేది. ముందుగా కొన్ని రోజులు గుబురు
మీసాల గురజాడ తాత మాటలన్ని విని పెద్దాయన్ని పంపించెయ్యగానే ఏ కొంటె
రామలింగడొ, బీర్బలో ఎక్కడ తెలివిగా మాటనేస్తారో అని వాళ్ళ కధలోసారి
ఆలకించి కొద్దిగా నిద్ర లోకి జారుకుంటే ఒక గబ్బిలపు కవితా రొద తో మళ్ళీ
అక్షరాల మెలకువ.

పెద్దన పెద్దరికాన్ని చూసి కొద్దిగా బిడియ పడినా, యండమూరి కాల్పనికాన్ని
తీవ్రంగా ఆరాధించినా, చలం కలం ధాటి కి అయోమయపడినా, శ్రిశ్రీ ని తిలక్ ని
పుస్తక స్నేహితులు గా పొందినా దీనంతటికీ కారణం తను చిరిగిన చొక్కా
వేసుకున్నా నేను కోరిన పుసకాన్ని కొనిచ్చి “నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ
విద్యతే” అని చెప్పిన నాన్న చలవే.

*తొలి ప్రచురణ పొద్దు లో

నానృషిః ..

 

ఎదురు చూపు సుదీర్ఘమనంటే
జాగ్రత్త, గుండెకేం తెలీదు ఆశల సందడి తప్ప.

వీడ్కోలు లో అంత విషాదం ఉందా?
ఇంకేం చెప్పకు
ఆ కలయిక ఎంత కమ్మనో తెలుసు.

జీవించటమే ధ్యేయమైతే,
అలోచన అవివేకమనిపిస్తే,
అవేశానికి ఆయుష్షు తక్కువైనా సరే,
ఉద్వేగానికి విలువలు తెలియవు మరి.

భౌతికమేదైనా..
నైతికమౌనా కాదా అని
మనసుకెందుకు మరణ యాతన.

సౌందర్యమూ, క్షణమూ అంత బలమైనవైతే,
సామీప్యాన్ని ఏమని ఏం లాభం.

సుడి గాలి మాటేమో, పిల్ల తెమ్మెర్ని తప్పించుకు తిరగడమెలా?
స్థితప్రజ్ఞత సంగతేమో, ప్రతి నిముషం పరవశాన్ని తాకొద్దనేదెలా?

లోకానికిదంతా అకారణ దుఃఖం
రాలే పూవుల్ని చూసినా, చూసీ చూడనట్టున్నా
కళ్ళకేదీ సుఖం.

మా ఊర్లో నిన్న వర్షం

img_6320_small.jpg
సాయంత్రం…టైం ఏడని కంప్యూటర్ లో కనిపిస్తుంది కాబట్టి,

తేడా తెలీదు చుట్టూ లైట్లు నిరంతరాయం గా వెలుగుతూ ఉంటాయి కాబట్టి.

ఏదో మెయిల్..
clickk..
meeting..
agenda..
document..
..ok fine
close.
కీ బోర్డ్ టక టక.. ఇంటర్ కమ్ గణగణ..అటు ఇటు మనుషులు చక చక..

ఒక pop up మెస్సేజ్..Heyy!! it’s raining outside.
“ఓహ్! అవునా”
ఇక్కడేం కనపడదే! కాఫీ రూమ్ కెళ్తే సరి..
ఆ! అన్ని వైపులనుంచి గది అద్దాల మీద ఎడా పెడా జల్లు , గట్టిగా తగిలి వెంటనే జారి పోతూ.. అద్దాలు శుభ్రం, చూపుకి అస్పష్టత..

Back to seat

కొద్దిగా సంగీతం?
Why not.. వెంటనే  సమాధానం.
బయట వాన జోరు, చెవుల్లో  ఉన్ని క్రిష్ణన్ శాస్త్రీయ హోరు, సగం సిప్ చేసిన కాఫీ కప్, కీ బోర్డ్ మీద ముని వేళ్ళ అనంద తాండవం..
వెరసి తెలుగులో ఒక ఈ-లేఖ.

what’s next?
hello! hello! పక్కన టీం మేట్ గొడవ,
ఉన్ని క్రిష్ణన్ కి చిన్న అంతరాయం ..తనకి సమాధానం చిన్న నవ్వు తో పాటు..
“ఏమిటీ హుషారు”? తన ప్రశ్న
– “nothing! వాన కదా”మళ్ళీ నవ్వు.
“హా అదా సరే enjoy” ఆమె నిష్క్రమణం.

సంగీతం మళ్ళీ..ఈ సారి పని తో బాటు..
రోజూ ఉండే పనులే సంగతులే .. కొత్త ఉత్సాహం తో.
ఓ అరగంటయ్యాక..
సెల్లు గోల..
– “ఊ చెప్పు”
“బయట  _ _ వాన_ _ నువ్వూ__” ముక్కలు ముక్కలు గా శ్రీవారు..కవరేజ్ లేదేమో .. వాన కదా ,
hmm ఒక నిట్టుర్పు.”వస్తున్నా wait ఇంటికెళ్దాం”

రోడ్డు మీద మూసీ లు మురికి జలపాతాలు…
తెరిచి పెట్టిన మాన్ హోల్ లు,
దారి లేక బస్ స్టాండ్ లో బిచ్చగాళ్ళు,
తడిచిన బట్టల్తో లేక గొడుగుల్తో జనాలు,
గోడల చాటున దాక్కుంటూ కుక్క పిల్లలు,
ఆటో వాలా కి మంచి గిరాకీ లు.
ఒక్కటే వాన …
ఇవన్నీ కోణాలు.

లావణ్య కౌముది

kum1.jpg

నిండు జాబిలి కి తోడు మరో చందమామా?
శశి వదనా! నీ మోవి పై అవి నవ్వుల నెలవంకలా

అసలే సిరులు.. చుట్టూ ముత్యాల హారాలా?
లేక కురుల వనం లో మరుమల్లె సరాలా

జ్యోతి శిఖల నడుమ  కృష్ణ వర్ణాలా?
మెరుపు కళ్ళలో నల్లటి కనుపాపల మైమరపులా

పసిడి పోత కి హరితపు పూతలా?
హేమలతా!  నీవు కదిలితే పచ్చని గాజుల మోతలా!

* కౌముది పత్రిక పై ముఖ చిత్రాన్ని చూసి.