నానృషిః ..

 

ఎదురు చూపు సుదీర్ఘమనంటే
జాగ్రత్త, గుండెకేం తెలీదు ఆశల సందడి తప్ప.

వీడ్కోలు లో అంత విషాదం ఉందా?
ఇంకేం చెప్పకు
ఆ కలయిక ఎంత కమ్మనో తెలుసు.

జీవించటమే ధ్యేయమైతే,
అలోచన అవివేకమనిపిస్తే,
అవేశానికి ఆయుష్షు తక్కువైనా సరే,
ఉద్వేగానికి విలువలు తెలియవు మరి.

భౌతికమేదైనా..
నైతికమౌనా కాదా అని
మనసుకెందుకు మరణ యాతన.

సౌందర్యమూ, క్షణమూ అంత బలమైనవైతే,
సామీప్యాన్ని ఏమని ఏం లాభం.

సుడి గాలి మాటేమో, పిల్ల తెమ్మెర్ని తప్పించుకు తిరగడమెలా?
స్థితప్రజ్ఞత సంగతేమో, ప్రతి నిముషం పరవశాన్ని తాకొద్దనేదెలా?

లోకానికిదంతా అకారణ దుఃఖం
రాలే పూవుల్ని చూసినా, చూసీ చూడనట్టున్నా
కళ్ళకేదీ సుఖం.

13 thoughts on “నానృషిః ..

  1. వావ్!!
    బుచ్చిబాబు, చలం ఇద్దరూ కలిసి అర్ధనారీశ్వర అవతారం ఎత్తి ఓ కవిత రాస్తే అది ఇలాగే ఉంటుందేమో. ఇది కవిత కాబట్టి మీరు బతికిపోయేరు, అదే వ్యాసమైతే, దీనిమీద చర్చలు చాలా ఘాటుగానే ఉండేవేమో. మంచుముక్క ముట్టుకొన్నా, నిప్పుకణిక ముట్టుకున్నా చెయ్యి కాలుతుంది – అందులో ఇది మెదటి రకం.

    ఇందులో ఒక్కో పాదము ఒక లైబరింత్ – ఎక్కడ దూరితే ఎక్కడ తేలతామో తెలీదు. చదివిన ప్రతిసారి కొత్త అర్ధాలు స్పురిస్తున్నాయి. ప్రతి లైను, అందినట్టే అంది, దగ్గరకి పోగానే ఓ రెండడుగులు ముందుకేసి – నన్నందుకో అంటూ ముందుకురకలేస్తోంది.

    ఇప్పటిదాకా మీరు ఎడంచేత్తో అలవోకగా రాసిన అంతర్వాహిని మీ కవితలన్నిటిలోకి గొప్పదిగా అనిపించేది నాకు. అలాటి కవితొకటి, ఒక రెండు సంవత్సారాలు కష్టపడితే రాయలేకపోతానా అనుకునేవాడిని. ఇలాటి కవిత ఈ జన్మలో నావల్ల కాదు. ఇలాటి అన్-థింకబుల్ థాట్స్ ని థింకేసి, వాటిని ఇంత సులువుగా అక్షరరూపంలోకి ఎలా మారుస్తారో.. నాలాటి వాళ్ళ అసూయనిండిన చూపులు పడి మీ కవితా కన్యక చిక్కిపోకుండా సాయంత్రం దిష్టి తీయ్యండి

    ఇంతకీ – ఈ సారి ఫొటో పెట్టలేదేం? ఈ కవితకి ఏం ఫొటో అతికించగలరు?
    ఇలాటి వజ్రాలు ఇంకా ఉన్నట్టున్నయి మీ దగ్గర, బయట పెట్టండి – మాలాటి సెకెండ్ రేటు గాళ్ళకి ముడిసరుకుగా పనికొస్తాయి.

    నిజమే.. నానృషిః కురుతే కావ్యం..
    కొత్తపాళీగారెక్కడో అన్నట్టు – టోపీలు తీసేసాం.
    ఈ కవితని, ఎప్పుడైనా నేను రాస్తున్న వ్యాసాలలో విశ్లేషిస్తూ ఉటంకించవచ్చా?

  2. గురువు గారూ! ఇవ్వాళ నాకు బోలెడు ఆయు:క్షీణం లా ఉంది మీ మాటలు చూస్తే.

    ఫొటో లు అంటించటం మానేసే ప్రయత్నం లో ఉన్నా అండీ మరీ అవసరం ఐతే తప్ప (లావణ్య కౌముది లా).

    ఇక పోతే మీరు దీన్ని నిరభ్యంతరం గా వి’శ్లేషిం’చే అధికారం ఎప్పుడూ ఉంది.

  3. ఏంటండీ మరీ ఇంత గాడత! నాగరాజు గారన్నట్లు పది సార్లు చదివాక మొదటి సారి స్పురించిందంతా తప్పనిపించింది. మొత్తం నాకేదో అర్థం అయ్యింది ఏమర్థం అయ్యిందో చెప్పాలంటే మళ్ళీ నేను స్వాతినవ్వాల్సిందే! కాలేనుగనుక చెప్పలేను కూడానూ!
    నాగరాజు గారి వాఖ్య చూశాక నాకు మరింత అసూయ గావుంది మీ కవితంటే!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  4. నాకూ అంతే.ఏదో అర్ధం అవుతుంది.కానీ ఏమర్ధమయ్యిందా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటే ….నా దగ్గర సమాధానం లేదు.మీరేమి రాసారో,నేనేమి అర్ధం చేసుకున్నానో…కవిత మాత్రం అద్భుతం.

  5. బొమ్మలు కవిత పరిధిని తగ్గిస్తాయేమో. ఒకే కవితకు బహుముఖములైన భావనలు స్ఫురించే అవకాశం ఉండేది కాదేమో. ఈ కవితలో నా చూపును నిలువరించిన కొంతభాగంపై నా స్పందన ఇక్కడ:

  6. చాలా బాగా రాశారు అనే మాట చాలా చిన్నదై పోతున్నట్లు అనిపిస్తుందండీ మీ కవితకి.. ఒకసారి చదివేసి కామెంట్స్ పెడదామని వచ్చి ఇక్కడ రాసిన వాళ్ళ అభిప్రాయం “అర్ధం అయ్యీ అయినట్లుంది” చూసిన తర్వాత మళ్ళీ చదివాను.. అచ్చు రాధిక గారు చెప్పినట్లు “అసలేం అర్ధం అయింది నాకు!?” అనిపించింది.. ఇంత గాఢత కల కవిత చాలా రోజుల తర్వాత చదివాను!!!

వ్యాఖ్యానించండి