సమీప దూరాలు

తెలి మంచు లో తెల్లవారుఝామునే తడిసిపోయే పసి కుసుమం త్వరలో ధనుర్మాసానికి వీడ్కోలు చెప్పాలని తెలియక చలి లో తుళ్ళి పడుతుంటేఅరె నీహారిక కళ్ళలోకే వచ్చిందేమిటి!

 

నూనెలో రంగులు కలిపి గచ్చు మీద పగలంతా ముగ్గులు పెట్టాను. ఇంకా తడి ఆరలేదు.. ఏదోక రోజు నువ్వు చూసి ముచ్చట పడకపోతావా అనే ఆశలానే. రామాలయం లో తిరుప్పావై వినడానికి వెళ్ళిన వాళ్ళు చెరువు గట్టున స్నేహితుల్తో ఆటలాడుకున్న పిల్లలు కూడా తిరిగొస్తున్నారు. వేణ్ణీళ్ళ కాగు కింద తుక్కు పులల్లు ఎగ దోస్తూ చిరు చలికి ముడుచుకు కూచుని వీధి గుమ్మం వైపు తదేకం గా చూస్తూ ద్వారబంధాల పక్కన నీ చెప్పులుంటే సాయంత్రం ఎంత ఉల్లాసం గా ఉండేది అనుకుంటాను.

 

ఒక చుక్క తేనె కోసం నాలుగు పూలమొక్కల మధ్యే వేల మైళ్ళు తిరిగే తేనెటీగల్లాంటి జ్ఞాపకాలు. సన్నజాజుల్లో లేని విశేషం పారిజాతాల్లో ఏముందని అడిగితే.. నీ తెల్లని అరచేతి మధ్య గోరింట చుక్కని తలపించటం కాబోలు.. అని నీ సమాధానం గుర్తొచ్చి సిగ్గుని కోపం లోకి అభినయించబోయి భంగపడి నవ్వుతాను. పరిమళపు పూతలన్ని ఏమంటున్నాయి? వసంతాలకేం వచ్చి పోతుంటాయి మరో హేమంతానికైనా నువ్వు తోడురాకూడదూ అని కదా! ప్రేమంటే ఇంత వేదనని ఎవరు నమ్ముతారు?

 

నిశ్శబ్ధ ఏకాంతం, మౌనం ఇన్ని సంగతులు చెబ్తాయే! బహుశా ఏమీ లేదని చెప్పటానికే మాటలు అవసరపడతాయి. నీరెండలో నిశ్చలం గా మెరిసే కోనేటి నీరు కూడా మట్టి కుండ లో చేరాక రూపు మార్చుకున్నట్టు.. వియోగం లో ఎంత అందమైన దృశ్యం కూడా నాలో విషాదాన్నే నింపుతుందెందుకు. ఐనా సౌందర్యం విషాదం పరస్పరం లీనమయ్యి లేవని అనగలమా?

ఎడారిలో గడ్డి పరక సైతం కాస్త అనువు దొరగ్గానే మొలకెత్తుతుందట. మాత్రం భాగ్యం కూడా కన్నీటి చుక్కకి లేదు కదా. పగళ్ళూ రాత్రులూ గుండెను పగిలించుకుంటూ, అతికించుకుంటూ గొంతు చాటున దుఃఖాన్ని అపేసి నడుస్తుంటే.. వంతెన దాటుతున్నంత సేపూ వెంటపడి వచ్చే వెన్నెలని విసుక్కోక ఏం చెయ్యను?

*తొలి ప్రచురణ పొద్దులో

*తెలుగు వెలుగులు లో

7 thoughts on “సమీప దూరాలు

  1. “ఈ నిశ్శబ్ధ ఏకాంతం, ఈ మౌనం
    ఇన్ని సంగతులు చెబ్తాయే!
    బహుశా ఏమీ లేదని చెప్పటానికే
    మాటలు అవసరపడతాయి. ”

    —కాబట్టి… చాలా బావుందని మాత్రం చెప్పి ఊరుకుంటాను.

  2. “సన్నజాజుల్లో లేని విశేషం పారిజాతాల్లో ఏముందని అడిగితే.. నీ తెల్లని అరిచేతి మధ్య గోరింట చుక్కని తలపించటం కాబోలు”.. ఎంత అందంగా చెప్పారో! ఎన్నిరోజుల తర్వాత చూశానో మీ పోస్ట్!! చాలా సంతోషంగా ఉంది.. 🙂

  3. ఈ “కల్హర” బ్లాగు నిన్ననే accidental గా చూడడం జరిగింది. ఒక అద్భుతం చూసినట్టు. ఇంతకాలం యిదెలా మిస్సయ్యానో నాకు తెలీదు. అయినా యిలా ఎన్ని బ్లాగులు మిస్సవుతున్నానో నాకు తెలుసా. తీరా చూస్తే జనవరి, 2006 నుండి టపాలున్నాయి. ఈమె సీనియర్ బ్లాగరు. ఇందులో చల్లటి పదప్రయోగాలూ, సుతిమెత్తని వాక్య విన్యాసాలే గాక మిక్కిలి మానసిక పరిణతీ కన్పిస్తోంది. స్వాతి గారి వయసెంతో నాకు తెలీదు. అయినా వయసుకీ పరిణతికీ సంబంధం లేదనుకుంటా. అందుకే ఈ టపాలపై నేను ప్రత్యేకించి నా అభిప్రాయం చెప్పదల్చుకున్నా. ఇందులో నేను ఆమె టపాలో నాకు నచ్చిన, నేను Quote చేసే వాక్యాలే మరొక వ్యాఖ్యాత కూడా చెప్పి వుండవచ్చు. అయినా ఆ వాక్యాలు ఈ కవయిత్రి నా వంటి మరో చదువరికి కూడా నచ్చినవిగా భావించలే గానీ వారు ఉటంకించినవే నేనూ ప్రస్థావిస్తున్నానని భావించ వలదని మనవి. ఇక “సమీప దూరాలు” టపా గురించి. ఇదొక లేఖా సాహిత్యం వంటి టపా. ఇందులో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.

    “పగలంతా ముగ్గులు పెట్టాను. ఇంకా తడి ఆరలేదు.. ఏదోక రోజు నువ్వు చూసి ముచ్చట పడకపోతావా అనే ఆశలానే.” అలాగే, “ఆ ద్వారబంధాల పక్కన నీ చెప్పులుంటే ఈ సాయంత్రం ఎంత ఉల్లాసం గా ఉండేది అనుకుంటాను.” ఈ వాక్యాలెంతటి కమ్మటి కలకి ప్రతిబింబాలు. మరొక వాక్యం “సన్నజాజుల్లో లేని విశేషం పారిజాతాల్లో ఏముందని అడిగితే.. నీ తెల్లని అరచేతి మధ్య గోరింట చుక్కని తలపించటం కాబోలు.. అని నీ సమాధానం గుర్తొచ్చి సిగ్గుని కోపం లోకి అభినయించబోయి భంగపడి నవ్వుతాను.” అంటే ఆమెకిక్కడ తనని పొగడడం సంతోషాన్నిస్తుందనే విషయం ఎంత చక్కగా చెప్పారో చూడండి. “వసంతాలకేం వచ్చి పోతుంటాయి మరో హేమంతానికైనా నువ్వు తోడురాకూడదూ అని కదా!” ఎంత కోరికని మూటగట్టుకుందో ఈ వాక్యం. “ఈ నిశ్శబ్ధ ఏకాంతం, ఈ మౌనం ఇన్ని సంగతులు చెబ్తాయే! బహుశా ఏమీ లేదని చెప్పటానికే మాటలు అవసరపడతాయి.” ఇటువంటివే నేను పరిణతికి చిహ్నాలన్న మాటలు. ఇది ఈ టపా అతటికీ హైలెట్. అలాగే, “పగళ్ళూ రాత్రులూ గుండెను పగిలించుకుంటూ, అతికించుకుంటూ గొంతు చాటున దుఃఖాన్ని అపేసి నడుస్తుంటే.. వంతెన దాటుతున్నంత సేపూ వెంటపడి వచ్చే వెన్నెలని విసుక్కోక ఏం చెయ్యను?” ఇది శక్తివంతమైన వాక్యం. కవయిత్రి కి అభినందలతో. . . .

  4. విజయకుమార్ గారూ, ముందు మీకు కృతజ్ఞతలు చెప్పాలి. కూడలిలో మీ వ్యాఖ్య చూసి ఇలా వచ్చాను. ఈ కవితావచనానికి మీ వ్యాఖ్యానం చదివాకగానీ అసలు కవితను చదవలేదు. అసలెప్పుడో ముందుగా ఈ లేఖ పొద్దులో ప్రచురితమైంది. అప్పుడు కూడా చూడనందుకు నన్ను తిట్టుకున్నాను. స్వాతిగారి రచనలు కొత్తకాదుగానీ, ఈ లేఖలో మాత్రం ఒకట్రెండుచోట్ల కాస్త చెన్నపట్నంగాలి తగిలింది. మొదటిది – రామాలయంలో తిరుప్పావై… కాగా రెండవది – ‘అవసరపడతాయి’ అన్న పదం. ఏమిటో విశేషం!?

వ్యాఖ్యానించండి